EPAPER

Tanuku Assembly constituency: తణుకు నియోజకవర్గంలో.. తళుక్కుమనేదెవరు?

Tanuku Assembly constituency: తణుకు నియోజకవర్గంలో.. తళుక్కుమనేదెవరు?

Who Will Win in Tanuku Assembly constituency: తణుకు నియోజకవర్గంలో తళుక్కుమనేదెవరు? మరోసారి విజయం తమదేనంటూ మంత్రి కారుమూరి ధీమా వ్యక్తం చేస్తుంటే.. కూటమి అభ్యర్థిగా విజయగంటా మోగిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావంతో ఉన్నారు. ఎవరికి వారీ ధీమా వ్యక్తం చేస్తున్నా నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం మాటెలా ఉన్నా.. పందెంరాయుళ్లు విచ్చలవిడిగా పందేలు కాస్తున్నారట. అభ్యర్థి గెలుపుపై కొందరు కాస్తుంటే.. మరొకరు త్వరలో ఏర్పడనునున్న ప్రభుత్వంపై లక్షలకు లక్షలు పందేలా కాస్తూ.. రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నారు.


ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న తణుకు నియోజకవర్గంలో YSR హయాంలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో గెలుపొందారు. 2014లో YCPలో చేరిన ఆయన.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. తణుకు నియోజకవర్గంలో YSRCP ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ అప్పటి ఎమ్మెల్యే రాధాకృష్ణను చాలాసార్లు ఇబ్బందులకు గురి చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ.. వైసీపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించడంలోనూ కారుమూరి శైలే వేరు అనే పేరుంది. 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది. రాష్ట్రంలో రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్‌గా అవకాశాన్ని కారుమూరి దక్కించుకున్నారు. మంత్రిగా పనిచేస్తూనే.. ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ జనాల్లోనూ పేరు తెచ్చుకున్నారు. అధికారులతో శాఖాపరమైన సమావేశాలు నిర్వహిస్తూ.. శాఖపై గట్టి పట్టు సాధించారని సొంత పార్టీలోని నేతలే చెప్పుకుంటున్నారు. ఇవే అంశాలు.. తమను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో కారుమూరి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధితో జనం వైసీపీని గెలిపిస్తారనే ఆశాభావంతో కారుమూరి ఉన్నారట. ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల కంటే తణుకులోనే ఎక్కువగా ప్రచారం కల్పించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు కోవిడ్ సమయంలోనూ నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి బాగోగులు చూడటంలోనూ కారుమూరి నాగేశ్వరరావు ముందు వరసలో ఉన్నారని నియోజకవర్గంలో పేరుంది. మరోవైపు చంద్రబాబు పర్యటనలు , లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలోనూ వారు చేసిన ఆరోపణలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వటంలో కారుమూరి స్పెషలిస్ట్ అనే పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారితో మమేకం కావటంతో ఆయనకు ఆయనే సాటనే పేరు తెచ్చుకున్నారు. అందుకే.. ఈసారి ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. గతంలో రెండుసార్లు త్రిముఖ పోటీలో గెలుపొందిన కారుమూరి నాగేశ్వరరావు.. ఈసారి ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతో అయినా గెలుస్తారనే ఆశాభావంతో కారుమూరి వర్గం ఉందని సమాచారం.


Also Read:  రాజంపేట రాజెవరు ? మిథున్ రెడ్డికి హ్యాట్రిక్కా ?.. మాజీ సీఎంకు రీ ఎంట్రీనా ?

కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 2019 లో ఓటమి అనంతరం నిరుత్సాహం పడకుండా.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో నియోజకవర్గంలో ఆయన చాలా హుషారుగా పాల్గొని.. పశ్చిమగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర సక్సెస్ కావటంతో తనవంతు కృషి చేశారని పార్టీ నేతలతో పాటు అధిష్టానం వద్దా గుర్తింపు తెచ్చుకున్నారట. ఎమ్మెల్యేగా చేసిన అనుభవం.. తనకంటూ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమలు చేశారు.

వాటిపైనే ఆరిమిల్లి పూర్తిగా ఆశలు పెట్టుకోవటం సహా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో తాను గెలిస్తాననే భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. పైగా..కూటమిలోని ఇతర పార్టీ నేతల సహకారం పూర్తిగా తనకు అందిందని… ప్రజలు కూడా తనను ఆశీర్వదించారని ఆరిమిల్లి భావిస్తున్నారట. 2014లో రాధాకృష్ణ జనసేన పార్టీ మద్దతుతో సుమారు 32 వేల మెజార్టీతో గెలవటమే కాకుండా..జిల్లాలోనే రెండోస్థానంలో నిలిచారు. 2019లో త్రిముఖ పోటీతో ఓటుబ్యాంక్‌ చీలి.. రెండు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు రాధాకృష్ణ.

తెలుగుదేశంలో మొదట్నుంచీ క్రమశిక్షణ గల నాయకుడిగా.. నిత్యం కార్యకర్తల్లో ఉంటూ.. పార్టీ కారక్రమాల్లో చురుగ్గా పాల్గొనటంతో ఆరిమిల్లి శైలే వేరని సొంత క్యాడర్ చెప్పుకుంటోంది. టీడీపీకి కంచుకోట ఉన్న తణుకులో ఇతర పార్టీల నుంచి నేతలను టీడీపీలోకి రప్పించటంలోనూ ఆయన సఫలీకృతమయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. దీంతో ఈసారి తనకు విజయం ఖాయమనే భావనలో ఆయన ఉన్నారు. ఐదేళ్లలో తణుకు ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును సమర్థంగా ఎదుర్కొని.. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి.. అధిష్టానం దృష్టిలో రాధాకృష్ణ ఉన్నారట. ఇది.. ఆయన విజయానికి కలసొచ్చే అంశమనే భావనలో టీడీపీ క్యాడర్ ఉంది. 2019లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల స్వల్ప ఓటమి చెందిన ఈ యువనేత.. ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారట. ఏపీలో వచ్చే భారీ మెజార్టీ స్థానాల్లో తణుకు ఉంటుందనే భావనలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు.

ఇరు పార్టీల నేతలూ.. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉంటే.. ఇదే అదనుగా పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ గెలుపుపై కొందరు.. ఏర్పడనున్న ప్రభుత్వంపై మరికొందరు లక్షల్లో పందేలు కాస్తున్నారట. ఇప్పటికే.. ఓటరు తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది. జూన్ నాలుగు వరకూ ఓపిక పట్టాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడి పందేలు కాచి.. ఉన్నది పోగొట్టుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని.. జూదం.. చట్ట వ్యతిరేకమని హెచ్చరిస్తున్నారు.

 

Tags

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×