EPAPER
Kirrak Couples Episode 1

Review : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ..

Review : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ..

Review :


నటీనటులు: ‘అల్లరి’ నరేశ్‌, ఆనంది, వెన్నెల కిశోర్‌, రఘు బాబు, శ్రీతేజ్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్‌
నిర్మాత: రాజేశ్‌ దండు
సమర్పణ: జీ స్టూడియోస్‌
దర్శకుడు: ఏఆర్‌ మోహన్‌
సంగీతం: సాయి చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్‌
ఎడిటర్‌: రామ్‌ రెడ్డి
విడుదల తేది: నవంబర్‌ 25, 2022

నవ్వించే పాత్రలు చేస్తూ ‘అల్లరి’నే ఇంటి పేరుగా మార్చుకున్న నరేష్.. ‘నాంది’తో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. అల్లరి పాత్రలతో పాటు భావోద్వేగభరితమైన పాత్రలనూ చేయగలనని ‘మహర్షి’తోనే ప్రూవ్ చేసుకుని.. అలాంటి పాత్రలకు ‘నాంది’తో గట్టి పునాది వేసుకున్నారు. అలా అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఓటు విలువను, ఓటర్ల హక్కులను తెలియజేసే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజాస్వామ్యం ప్రధానాంశంగా ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో కొత్తగా ఏం చూపించారో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…


కథ:
అది.. విశాఖపట్నం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని మారేడుమిల్లి అటవీ గ్రామం. సాధారణ ప్రజానీకానికి దూరంగా ఎక్కడో కొండ కోనల్లో ఉంటుంది. అక్కడికి ఎవరైనా వెళ్లాలన్నా.. అక్కడివారు బయట ప్రాంతానికి వెళ్లాలన్నా కొండప్రాంతాలు, వాగులు, వంకలు దాటుతూ వెళ్లాల్సిందే. మారేడుమిల్లిలో ఓ వ్యక్తి చెట్టుమీద నుంచి కిందపడి గాయాలపాలవుతాడు. అతడిని సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో ప్రాణాలు కోల్పోతాడు. ఊళ్లో ఆస్పత్రి లేకపోవడం, వాగులు దాటడానికి బ్రిడ్జి లేకపోవడం వల్లే అతడు మరణించాడని మారేడుమిల్లి ప్రజలు భావిస్తారు. ఈ నరకయాతన ఇంకెన్నేళ్లు అంటూ తమలో తామే కుంగిపోతారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. రంపచోడవరం ఎమ్మెల్యే మరణించడం.. అక్కడ ఉప ఎన్నిక రావడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. పోలింగ్‌కు దూరంగా ఉండే మారేడుమిల్లిలోనే ఓ బూత్‌ను నిర్వహించి వంద శాతం ఓటింగ్ సాధించేందుకు తెలుగు టీచర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ (అల్లరి నరేష్), ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న వెన్నెల కిశోర్‌ను ఆ ఊరికి ప్రిసైడింగ్ అధిరులుగా పంపిస్తారు. అక్కడికి వెళ్లిన అల్లరి నరేష్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? కలెక్టర్ త్రివేది (సంపత్ రాజ్) వేసిన ప్లాన్స్‌ను తిప్పికొట్టిందెవరు? మారేడుమిల్లి ప్రజానీకం అనుకున్నది సాధించారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ, రియాల్టీలో అమలు కావడం లేదు. ‘ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడిమల్లన్న’ అనే చందంగా రాజకీయ నాయకులు మారిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో సేవకులుగా మారే నాయకులు.. పోలింగ్ అయిపోగానే దేవుళ్లుగా మారిపోయి ప్రజలను తమ చుట్టూతిప్పుకుంటూ నానా తిప్పలు పెడతారు. భారతదేశంలో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఈ పాయింట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో కొత్త దర్శకుడు ఏఆర్ మోహన్ మరోసారి ఈ పాయింట్‌నే లేవనెత్తారు. కథ పాతదే అయినా ఆయన తన కథనంతో కొత్తదనాన్ని చూపించి ఆకట్టుకున్నారు. ‘మార్పు కోసం ఓటేస్తాం.. అయితే రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ, ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదు’, ‘ఎన్నికలప్పుడు ప్రజలే దేవుళ్లు అంటారు.. ఆ తర్వాత నాయకులే దేవుళ్లయిపోయి ప్రజలను క్యూలో నిలబెడతారు’. ‘ఆశతో చావడం కన్నా.. పోరాడి చావడం మేలు’, సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ అంటూ శిక్షణ తీసుకుని అధికారులు అయ్యేవారు సర్వీస్ అనే పదాన్నే మర్చిపోతున్నారు’ అనే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా ఉన్నాయి. పూటకో మాట మార్చే రాజకీయ నేతలకన్నా.. ప్రభుత్వ అధికారులు ప్రజల సేవ గురించి నిజంగా ఆలోచిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయనే విషయాన్ని దర్శకుడు ఇందులో ప్రధానంగా తెలియజేశాడు. సీరియస్ అంశాన్ని ప్రస్తావిస్తూనే వెన్నెల కిశోర్, రఘుబాబు, ప్రవీణ్‌తో కామెడీ కూడా పండించాడు. ఒకట్రెండు చోట్ల స్లోగా అనిపించినా దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ రామిరెడ్డి అటవీ అందాలను, గిరిజనుల జీవితాలను తన కెమెరాలో ఎంతో చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ ఎంతగా కామెడీ పండిచగలడో అంతకన్నా ఎక్కువగా క్యారెక్టర్‌లో జీవించగలడని ‘నాంది’ సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో దాన్ని కంటిన్యూ చేశాడని చెప్పొచ్చు. తెలుగు టీచర్ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే ఎన్నికల అధికారిగా ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ, పురుడుపోసే భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. నరేష్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఏదైనా ఉందంటే అది శ్రీతేజ్‌దే. మారేడుమిల్లి ప్రజానీకం హక్కుల కోసం పోరాడే యువకుడి పాత్రలో శ్రీతేజ్ కనిపించాడు. హీరోయిన్‌గా నటించిన ఆనంది గిరిజన వేషధారణలో కాకుండా మామూలు యువతిగా కనిపించినా.. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఊరి పెద్దగా ‘రమణా లోడెత్తాలిరా’ డైలాగ్ ఫేం కుమనన్ సేతురామన్ కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, రఘుబాబు కామెడీతో ఆకట్టుకున్నారు. కలెక్టర్‌గా సంపత్ రాజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.

రేటింగ్ : 3/5

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఈజీగా ఓ సారి చూసేయొచ్చు

-బిల్లా గంగాధర్

Related News

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Big Stories

×