EPAPER

Hyderabad BJP MP candidate: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత.. ఒవైసీ కోటను బద్దలు కొట్టనుందా..?

Hyderabad BJP MP candidate: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత.. ఒవైసీ కోటను బద్దలు కొట్టనుందా..?

Hyderabad BJP MP candidate


Hyderabad BJP MP candidate: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది.

నాడు అక్కడి ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ.. 2004 వరకు వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత వారసుడైన అసదుద్దీన్ నేటి వరకు ఎంపీగా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది.


త్రిముఖ పోరులో లాభపడాలని స్కెచ్

దేశ వ్యాప్తంగా మోడీ ప్రభ వెలిగిపోతున్న ఈ సమయంలోనైనా ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉంది. అందుకే, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్, అతని పార్టీకి చెక్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఓటమి తర్వాత ఒవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంని గట్టిగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తోందని, కనుక.. ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే.. ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది.

ఈ సమయంలో బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోంది. ఇప్పటికే అక్కడ పోటీచేస్తున్న భగవంతరావు, విక్రమ్ గౌడ్‌లలో ఒకరిని బరిలో దించాలనుకున్న ఆ పార్టీ ప్రస్తుతం కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.

ఎవరీ మాధవీలత?

పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత కోఠి మహిళా కళాశాలలో అనంతరం నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా. విరించి హాస్పిటల్స్ యజమానిగానే గాక మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌‌కార్ప్‌‌నూ నడుపుతున్నారు.

Read More: తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు వీరే..

ఈమె భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే. మాధవీలత ‘లోపాముద్రా ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా చాలా కాలంగా పాతబస్తీ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి, ఉచితంగా మందులు ఇవ్వటం, టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన పనిని ట్రస్ట్ తరఫున కల్పించటంతో పాటు ప్రజ్ఞాపూర్‌ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు.

కొవిడ్ సమయంలోనూ రోజూ వందలాది మందికి భోజనాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పంపి స్థానికంగా మంచిపేరు తెచ్చుకున్నారు. అటు సాధుసంతులతో సమావేశాలు పెట్టించటం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.

నియోజకవర్గంలో బీజేపీ బలం ఇదే!

ఇక.. ఈ స్థానంలో ఆది నుంచి బీజేపీ లోక్‌సభకు పోటీచేస్తున్నా.. బద్దం బాల్ రెడ్డి హయాంలో ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇవ్వగలిగింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి 4,54,823 ఓట్లు రాగా, బాల్‌రెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఒవైసీ కేవలం 39,524 ఓట్లతో గెలిచారు. హైదరాబాద్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజార్టీ ఇదే. అలాగే.. 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌ రెడ్డికి 4,14,173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానం సాధించారు.

నాటి నుంచి బీజేపీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకుంటూనే వచ్చినా.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ సాయంతో ఎంఐఎం ఇక్కడ గెలుస్తూ వస్తోంది. కానీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఎంఐఎం ఇప్పుడు కాస్త ఉక్కపోతను ఎదుర్కొంటోంది. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా దీన స్థితిలో ఉన్న పాతబస్తీలో పెద్ద సంఖ్యలో వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకున్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే ఒక మహిళను బరిలో దింపితే త్రిముఖపోరులో సత్తా చాటవచ్చని బీజేపీ అంచనా.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి, మోడీ, అమిత్ షా వంటి నేతల రోడ్ షోలు, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పలుకుబడి, టీడీపీ-జనసేనతో పొత్తు కుదిరితే.. ఎంబీటీ ఓటు బ్యాంకుతో పాటు.. దశాబ్దాలుగా ఒవైసీ అంటే మొహం మొత్తిన యువ, అభ్యుదయ ముస్లింల మద్దతూ తమకే లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×