EPAPER

Kaleshwaram Project : మేడిగడ్డ పాపం.. కాళేశ్వరం తెలంగాణకు వరమా? శాపమా?

Kaleshwaram Project : మేడిగడ్డ పాపం.. కాళేశ్వరం తెలంగాణకు వరమా? శాపమా?


Kaleshwaram Project: హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట. చివరకు అదే వాడిని పోలీసులకు పట్టిస్తుందని చెబుతుంటారు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలంగాణ అంతా రీసౌండ్ వస్తోంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ డ్రామాలు షురూ చేశారనే మాట అంతటా వినిపిస్తోంది. జస్ట్ రెండు పిల్లర్లు పగిలినాయి.. దానికి ఇంత లొల్లి ఎందుకు..? రిపేర్ చేయిస్తే సరిపోతుందిగా.. మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయే కుట్ర చేస్తున్నారంటూ గులాబీ నేతలు మాట్లాడుతున్నారు. ఇదో చిన్న సమస్యగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇది అంత చిన్న వ్యవహారం కాదని ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు అంటున్నాయి.

నిజంగా ఇది చిన్న సమస్యా?


దాదాపు లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మాణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ చాలా కీలకం. ఓవరాల్ ప్రాజెక్టులోని మొత్తం 215 టీ‌ఎం‌సీల నీటిలో 195 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది మేడిగడ్డ నుంచే. మిగతా 20 టీ‌ఎం‌సీల నీరు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి వదులుతారు. ఈ లెక్కంతా డీపీఆర్‌లో ఉన్నదే. అంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90 శాతం మేడిగడ్డ నుండే ఎత్తిపోయాలన్నమాట. దీన్ని బట్టి మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్టు కాదా? అనే ప్రశ్న రాష్ట్రమంతా వ్యక్తమవుతోంది. మొన్నటిదాకా మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని మాట్లాడారు. ఇప్పుడేమో కుంగడంతో గులాబీ నేతలు మాట మారుస్తున్నారని.. కాళేశ్వరం అంటే పెద్ద వ్యవస్థ, పంపు హౌసులు, బ్యారేజీలు, కిలోమీటర్ల మేర కాలువలు అంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..!

మేడిగడ్డ పిల్లర్లు కుంగగానే కాంట్రాక్ట్ సంస్థే మొత్తం రిపేర్ చేయిస్తుందని అన్నారు. వాళ్లతో ఓ స్టేట్‌మెంట్ కూడా ఇప్పించారు. కానీ, ఎలక్షన్ రాగానే సీన్ మారిపోయింది. ఇది ఈపీసీ కాంట్రాక్టు కాదు.. లంప్‌సమ్ కాంట్రాక్టు. కాబట్టి తమ బాధ్యత ఏం లేదు.. మొత్తం ప్రభుత్వమే భరించాలని తెగేసి చెప్పింది నిర్మాణ సంస్థ. దీంతో బీఆర్ఎస్ నేతల నోట్లో వెలక్కాయ పడినట్టయింది. ఆనాడు ప్రజాధనం వృధా కాదు.. కాంట్రాక్ట్ సంస్థే అంతా చేస్తుందని చెప్పిన గులాబీ నేతలు.. ఇప్పుడేమో ఎన్ని వేలకోట్లు ఖర్చైనా ప్రభుత్వమే భరించాలని అంటున్నారు. మరమ్మతుల కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ, మేడిగడ్డ రిపేర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అనేది అంతు చిక్కని ప్రశ్న. ప్రస్తుతం రెండు పిల్లర్లు కుంగాయని చెబుతున్నారు. బ్యారేజీ మొత్తం 85 పిల్లర్లతో ఉంది. వీటన్నింటికీ ఒకటే శ్లాబ్. అయితే.. కింద ఉన్న శ్లాబ్ కుంగకుండా పిల్లర్లు కుంగవనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. నిజంగా అది జరిగితే.. మొత్తం పిల్లర్లకు ప్రమాదం ఉన్నట్టే. ఒకవేళ బీఆర్ఎస్ చెప్పినట్టు మరమ్మతులు చేశాక ఏదైనా జరిగితే.. ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇవేమీ ఆలోచించకుండా మరమ్మతులు చేయాలనడం కరెక్ట్ కాదేమో అనే మాట అంతటా వినిపిస్తోంది.

ముందే తెలిసినా నిర్లక్ష్యం

మేడిగడ్డ లోపాలు ముందే బయటకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదని.. సమస్యను గాలికొదిలేస్తే అది ఇక్కడిదాకా వచ్చిందని అప్పట్లో ఇంజనీర్లు రాసిన లేఖల ద్వారా తెలుస్తోంది. విజిలెన్స్ రిపోర్టులో అప్పటి ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇక, మొత్తం బ్యారేజీకే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణుల బృందం సైతం తేల్చింది. మేడిగడ్డ ప్రమాదం ఆషామాషీ కాదని.. ఇది ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణా లోపాలన్నీ కలిసి జరిగిందని స్పష్టం చేసింది. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ రిపేర్ ఎలా చేయాలో తెలియదని తెలిపింది. ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు.. ఇలాగే డిజైన్ చేసి నిర్మాణం చేసిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు కూడా ఉందని కేంద్ర బృందం అంటోంది. అంటే, గోదావరిపై కాళేశ్వరంలో భాగంగా కట్టిన అన్నిబ్యారేజీలకు ప్రమాదం ఉందన్నమాటే.

ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర

బ్యారేజీ పరిస్థితిపై పూర్తి స్థాయి అవగాహనకు వచ్చాకే ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ, ఈలోపే మరమ్మతులు చేయాలంటూ బీఆర్ఎస్ హడావుడి చేస్తోంది. దీనికి వెనుక పెద్ద కుట్ర ఉందనేది కాంగ్రెస్ శ్రేణుల వాదన. అసలు కారణాలు తెలుసుకోకుండా హడావుడిగా రిపేర్ చేస్తే.. మళ్ళీ వరదోచ్చి కొట్టుకుపోతే.. “చూడండి.. వీళ్ళ పనితనం ఎలా ఉందో” అని ప్రభుత్వాన్ని దెప్పిపొడవచ్చనే ప్లాన్‌లో బీఆర్ఎస్ ఉన్నట్టుగా అనిపిస్తోందని హస్తం నేతలు అంటున్నారు. అయితే.. 2023 ఫిబ్రవరిలోనే అసలు లోపాలు ఎమున్నాయో అని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఒక లెటర్ రాశారు. దానికి వచ్చిన రిప్లై చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. మొత్తం మేడిగడ్డకు సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదని.. అలాంటి ప్రదేశాలలో బ్యారేజీ కట్టరని తేలింది. అంతేకాదు, పంప్ హౌసుల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని.. వరదలొచ్చినప్పుడల్లా అవి మునగడం ఖాయమని అందులో ఉంది. కానీ, దీన్ని అత్యంత రహస్యంగా దాచి ఉంచారని సమాచారం. ఇప్పుడు మేడిగడ్డ రిపేర్ చేస్తే పంపు హౌస్ మునగదనే గ్యారెంటీ లేదు. అలాగే, అన్నారం, సుందిళ్ళ పంప్ హౌసుల సంగతి డౌటే. మూడు బ్యారేజీలలో ఏ ఒక్క దానికి సమస్య వచ్చినా ఏ ఒక్క పంపు హౌస్ మునిగినా మొత్తం కాళేశ్వరానికి ప్రమాదం. ఇది తెలిసి కూడా అడుగడుగునా నిర్లక్ష్యం వహించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read More: కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు.. 30 వేల కోట్లు దుబారా ఖర్చు తప్ప దమ్మిడీ ఆదాయం లేదు..

నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలు ఇవే..!

మేడిగడ్డ పంప్ హౌస్ మునక.. ఇప్పటికీ తుక్కుగానే ఉన్న 11 పంపులు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కాలువలకు ఏటా గండ్లు

అన్నారం పంప్ హౌస్ మునక

తెగిన సుందిళ్ళ బ్యారేజీ కట్టలు

పంప్ హౌస్‌లకు క్రాకులు

కూలిన రామడుగు సొరంగాలు

కుంగిన మిడ్ మానేరు డ్యామ్

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు రంధ్రాలు

మల్లన్నసాగర్ కాలువకు రంధ్రాలు, పందికొక్కుల పనేనంటూ సమర్ధించుకున్న బీఆర్ఎస్

ఎక్కడికక్కడ పంప్ హౌస్‌లకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులూడుతున్నాయి

కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు

అన్నారం బ్యారేజీ కింద బుంగలు

 

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×