EPAPER

Supreme Court : ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్..!

Supreme Court : ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్..!

Electoral Bonds Scheme : రాజకీయ పార్టీలకు ఎలక్షన్ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని సుప్రీం కోర్టు కాసేపటి క్రితం సంచలన తీర్పునిచ్చింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్ బాండ్లమీద దేశవ్యాప్తంగా మారోసారి చర్చ జరుగుతుతోంది. ఇంతకీ ఈ బాండ్లు ఏమిటి? వీటి నేపథ్యమేమిటో ఓసారి అవలోకిద్దాం.


ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చింది. 2017 ఆర్థిక బిల్లు ద్వారా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. 2018లో ఇవి అమల్లోకి వచ్చాయి. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు.. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు వీటిని తీసుకొచ్చామని అప్పట్లో చెప్పింది.

Read More : ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


బ్యాంక్ ద్వారా జారీ అయ్యే ఈ వడ్డీరహిత ఎన్నికల బాండ్లను డోనర్(దాత) కొనుగోలు చేస్తారు. చెక్కు లేదా డిజిటల్ పేమెంట్ ద్వారా ఇది జరుగుతుంది. విరాళాలిచ్చేవారి రక్షణ కోసమే ఇది. ఈ గోప్యత పాటించకుంటే.. ప్రధానంగా డోనర్లు వాణిజ్యవేత్తలైన పక్షంలో రాజకీయ వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆ బాండ్లను తనకు నచ్చిన పార్టీకి డోనర్ విరాళంగా అందజేస్తారు. ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీలు ఆ బాండ్లను 15 రోజుల్లోగా నగదుగా మార్చుకుని తీరాలి.

వివాదాలేమిటి?
రాజకీయ పార్టీలకు గతంలో దొడ్డిదోవ పద్ధతుల్లో విరాళాలు అందేవి. ఇది అవినీతి, నల్లధనానికి దారి తీస్తుందనే వాదన మొదలైంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎన్నికల బాండ్లు వచ్చాయి. అయితే ఈ పథకంలో కొన్ని నిబంధనలను గమనిస్తే.. పారదర్శకత నీటిమూటలాగే కనిపిస్తుంది. నగదు మూలాల గురించి డోనర్(వ్యక్తి/సంస్థ) వెల్లడించాల్సిన అవసరం లేదనేది ఓ నిబంధన. రాజకీయ పార్టీలు కూడా ఆ విరాళాలు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొనుగోలు చేసిన బాండ్లను డోనర్లు ఏ రాజకీయ పార్టీకి అందజేశారన్నవిషయం వారు వెల్లడిస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు.

డొల్ల కంపెనీలకు అవకాశం
తమ లాభనష్టాల నివేదికలో కంపెనీలు ఈ ఎన్నికల బాండ్లను చూపించనక్కర్లేదు. పైగా కార్పొరేట్ విరాళాలు 7.5% మించరాదన్న సూత్రం ఈ బాండ్ల విషయంలో వర్తించదు. అలాగే కంపెనీలు ఏవైనా 3 ఏళ్లుగా మనుగడలో ఉంటే.. రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసేందుకు అర్హత ఉన్నట్టే. డొల్ల కంపెనీలకు ఊతమిచ్చేందుకు ఇది పరోక్షంగా దోహదపడుతుందనేది సుస్పష్టం.

నల్లధనానికి రాచమార్గం
నల్లధన ప్రవాహానికి ఇదో రాచమార్గంగా మారిందనేది అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వాదన. ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఏడీఆర్ 2017లో పిటిషన్ వేసింది. 2019, 2021లలో బాండ్ల జారీపై స్టే కోరినా .. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మాత్రమే బాండ్లను జారీ చేస్తుంది కాబట్టి.. కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఈ సమాచారాన్ని తమకు అనువుగా వినియోగించుకునే ప్రమాదమూ ఉంది. లెక్కలకు మించి ఆదాయం ఉన్న సంస్థలు/వ్యక్తులు బాండ్లను విరాళంగా అందజేసి.. అధికార పార్టీలను ప్రసన్నం చేసుకునే సౌలభ్యం ఈ పథకంలో ఉండటం గమనార్హం.

అధికార పార్టీలకే అందలం
బాండ్ల ద్వారా విరాళాలు అందుకోవడంలో అధికార పార్టీలదే అగ్రస్థానమనేది సుస్పష్టం. ఏడీఆర్ తన పిటిషన్లో ఎన్నో విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికలు, ఆదాయపన్ను నివేదికలను పరిశీలిస్తే ఎన్నికల బాండ్లతో అధిక లబ్ధి చేకూరింది బీజేపీకేనని తెలుస్తోంది. ఏడీఆర్ నివేదిక మేరకు 2019-20లో బీజేపీ అత్యధిక మొత్తంలో(రూ.1651.022 కోట్లు) ఖర్చు చేసింది. కాంగ్రెస్(రూ.998.158 కోట్లు), టీఎంసీ(రూ.107.277కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆ ఏడాది రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల విలువ రూ.3429.56 కోట్లు. ఆ మొత్తంలో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు(బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ) 87.29% మేర దక్కించుకున్నాయి.

22 విడతల్లో రూ.10 వేల కోట్లు
మార్చి 2018 నుంచి అక్టోబర్ 2022 వరకు మొత్తం 19,520 బాండ్లు జారీ అయ్యాయి. మొత్తం 22 విడతలుగా జారీ అయిన ఈ బాండ్ల విలువ రూ.10791.47 కోట్లు.
మార్చి 2018 – అక్టోబర్ 2022 మధ్యకాలంలో 22 విడదలుగా జారీ అయిన బాండ్ల విలువ మొత్తంలో 80 శాతానికి పైగా నాలుగు నగరాల నుంచే కావడం విశేషం. ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది. వీటిలో ముంబై నుంచి రూ. 2742.13 కోట్లు, కోలకతా నుంచి రూ. 2387.72 కోట్లు, హైదరాబాద్ నుంచి రూ. 1885.36 కోట్లు, న్యూఢిల్లీ నుంచి 1519.44 కోట్లు రావటం విశేషం.
ఇక.. 2019లో పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థుల్లో 82% కోటీశ్వరులే.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×