EPAPER

PV Narasimharao : పీవీ.. మన ఠీవీ.. ఆర్థిక సంస్కరణల పితామహునిగా గుర్తించిన చరిత్ర

PV Narasimharao : పీవీ.. మన ఠీవీ.. ఆర్థిక సంస్కరణల పితామహునిగా గుర్తించిన చరిత్ర

Bharataratna for PV Narasimharao : ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణభారతవాసి, 17 భాషల్లోఅనర్గళంగా మాట్లాడే బహుభాషాకోవిదుడు.. రాజకీయాలకే.. రాజనీతిని నేర్పిన అపరచాణక్యుడు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజాలువేసి, కుంటుపడిన దేశఆర్థికవ్యవస్థను గాడిలోపెట్టిన ఆర్థికవేత్త. మన తెలుగువాడు.. తెలంగాణ బిడ్డ.. పాములపర్తి వెంకట నర్సింహారావు. ఎన్నో ఏళ్లుగా.. ఆయనకు చరిత్రలో దక్కాల్సిన గౌరవం లభించలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ భారతరత్న ప్రకటనతో అవన్ని పటాపంచలయ్యాయి. కేంద్రం ఆయనకు భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందించింది.


కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగర అనే మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి.. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పాములపర్తి వెంకట నర్సింహరావు సేవలకు, ఔన్నత్యానికి ఘనమైన గుర్తింపు దక్కింది. ఈ మహనీయుడికి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. దేశ గతిని మార్చి సంస్కరణల పథంవైపు నడిపించిన మార్గదర్శిని ఎట్టకేలకు భారతదేశ అత్యున్నత పురస్కారం వెతుక్కుంటూ రావడం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

నిజానికి పీవీ నర్సింహరావుకు కన్న తల్లిదండ్రులు, పెంచిన వారు వేర్వేరు అనే సంగతి చాలా మందికి తెలియదు. వరంగల్ జిల్లా.. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 నరుక్మాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు పీవీని దత్తత తీసుకోవడంతో అప్పటినుంచి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు పీవి.


1938 లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు పీవీ. వందేమాతరం గేయాన్ని పాడటంతో ఆయన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. అప్పుడు ఆయన ఓమిత్రుని సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయవిద్య పూర్తిచేశారు. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అడుగుల్లో స్వాతంత్రోద్యమంలోను, హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువజన కాంగ్రెస్ నాయకుడైన మర్రిచెన్నారెడ్డి, శంకరరావుచవాన్, వీరేంద్రపాటిల్ తో కలిసి పనిచేసారు. 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు.

పీవీ రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది. 1952 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన.. ప్రముఖ కమ్యూనిస్టునేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత 1957 నుంచి 1972 వరకు నాలుగు సార్లు మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖ పదవులు నిర్వహించారు.

1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అనంతరం జరిగిన పరిణామాలతో 1971 సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సామాజికవర్గ ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేకస్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం పీవిది. తనకంటూ ఒకవర్గం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్రరాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు పాములపర్తి వేంకట నర్సింహారావు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉన్నప్పటికీ.. సమర్థతవల్లే ఆనాడు పీవి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా పీవీ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

తన హయాంలో భూసంస్కరణలు కఠినంగా అమలు చేయడంతో పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈవిషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ ల మధ్య తిరగడంతోటే సరిపోయేది. ఆసమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోరుతూ జైఆంధ్ర ఉద్యమం చేపట్టారు. ఆ సయమంలో జరిగిన రాజకీయ కుట్రలకు లొంగిన కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా ముఖ్యమంత్రిగా పీవీ పదవీకాలం ముగిసిపోయింది. .

శాసనసభసభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్రరాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు. పీవీ సేవలను జాతీయస్థాయిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఆయన్ను 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1977లో హన్మకొండ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికై హోంశాఖ, విదేశాంగ శాఖలను తనదైన శైలిలో నిర్వహించారు పీవి. 1984లో మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై… రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మానవవనరులు, హోంశాఖా మంత్రిగా పనిచేశారు.

1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయని పీవీ.. దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అప్పుడే రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెసు పార్టీకి నాయకుడే లేని దుస్థితిలో పీవీని ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. ఆసమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపులేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించారు. అప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్న పీవీ.. మళ్లీ తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గంగులప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉపఎన్నికలో గెలిచిన పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు.

పీవీ పాలన పగ్గాలు చేపట్టిన సమయం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజసిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖల్లో ఆయనకున్న అపార అనుభవం ఆయనకు ఆ సంక్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, ఇందిర, రాజీవ్ తర్వాత… మొదటి వ్యక్తి పీవీ మాత్రమే. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించడం.. ఆయన అసమాన చాణక్య ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.

పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు జరిగాయి ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ చుట్టుముట్టాయి.అప్పటికే దివాలా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలకు బీజం వేశారు పీవీ నర్సింహారావు. తన క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా ఉన్న గత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి.. సంస్కరణలకు ఊతమిచ్చారు. వాటిఫలితంగా భారత ఆర్థికవ్యవస్థ శరవేగంగా అభివృద్ధి వైపు పయనం సాగించింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహునిగా చరిత్ర గుర్తించింది. అదేవిధంగా కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను ఎండగట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్‌లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా పీవీనే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారయిందన్న విషయాన్ని స్వయంగా వాజపేయి కూడా ప్రకటించారంటే పీవీ ఘనత ఏపాటిదో తెలుసుకోవచ్చు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×