EPAPER

Budget 2024 : నిర్మలమ్మ పద్దులో.. సాగుకు సాయం అందేనా?

Budget 2024 : నిర్మలమ్మ పద్దులో.. సాగుకు సాయం అందేనా?

Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ రానుంది. గత ఎన్నికల వేళ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న బీజేపీ ఈ చివరి బడ్జెట్‌లోనైనా వ్యవసాయానికి సాయం అందిస్తుందేమోనని దేశవ్యాప్తంగా రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయానిదే మొదటి స్థానం. దేశంలో 42 శాతం మందికి ఇదే జీవికగా ఉంది. గత నాలుగేళ్లలో కరోనా, ఆర్థిక సంక్షోభాల వల్ల మోదీ హామీలేవీ నెరవేరలేదనీ, ఈసారి బడ్జెట్‌లోనైనా సాగుకు చేవనిచ్చే నిర్ణయాలు ప్రకటించాలని సాగురంగపు నిపుణులు సూచిస్తున్నారు.


దేశానికి అన్నం పెట్టే రైతు ఆదాయం పెరగాలంటే మన వ్యవసాయ రంగం.. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. కనుక ఈ బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, ఎరువులు, విత్తనాలు, టెక్నాలజీ, పురుగుమందులు, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీ, మంచి మద్దతు ధర వంటి వాటిపై కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించాలని నిపుణులు కోరుతున్నారు.

వ్యవసాయ, పశుపోషణ, పౌల్ట్రీ రంగాలకు కీలకమైన డీజిల్‌, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు పెరగటం, వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణంలో పెరుగుదల, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యం కావటంతో ఏ ఏటికాయేడు పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారపు కొరత ఏర్పడటం, వ్యవసాయ ఎగమతులు తగ్గటం జరుగుతోంది. కనుక ఈ రంగానికి ప్రోత్సహకాలు ప్రకటించాలనేది నిపుణుల మాట.


అభివృద్ధి చెందిన దేశాల్లోని రైతాంగం ఆధునిక సాగు పద్ధతులను పాటిస్తుంటే.. భారతీయ రైతులు నేటికీ పాత పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. దీంతో మన వ్యవసాయ ఉత్పత్తుల క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఆధునిక దేశాల వారికంటే తక్కువగా ఉన్నాయి. కనుక వ్యవసాయ రంగంలో టెక్నాలజీని పెంచి, తద్వారా మెరుగైన ఉత్పత్తి, నాణ్యమైన ఉత్పత్తిని సాధించేలా రైతాంగాన్ని సిద్ధం చేసే పాలసీని బడ్జెట్‌లో ప్రకటించాలని నిపుణులు చెబుతున్నారు. మన రైతులకు సాంకేతికత, ఆధునిక వ్యవసాయ ఉపకరణాలు అందించే స్టార్టప్‌లకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు.

2022 బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి కిసాన్‌ డ్రోన్లను ప్రమోట్‌ చేసేలా అగ్రిటెక్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని నిర్ణయించటంతో బాటు దానికోసం నాబార్డ్‌ కింద ఓ నిధిని ఏర్పాటు చేశారు. ఈసారి ఆ బడ్టెట్ మరింత పెంచటంతో బాటు మరిన్ని రాయితీలిచ్చి, బ్లాక్‌చైన్‌, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను సాగురంగానికి అన్వయించేలా చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు.

గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయరుణాలను ఈసారి రూ.22 – 25 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 7% వడ్డీ ఉండగా, దానిపై కేంద్రం 2% వడ్డీ రాయితీ ఇస్తోంది. రుణమొత్తాన్ని, రాయితీని మరింత పెంచితే.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారినుంచి రైతులను తప్పించినట్లవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×