EPAPER

Mahatma Gandhi : తెలుగు నేలపై బాపూ పాదముద్రలు..!

Mahatma Gandhi : తెలుగు నేలపై బాపూ పాదముద్రలు..!
Mahatma gandhi

Mahatma Gandhi : తెల్లవాడి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసిన అహింసా యోధుడు.. మన బాపూజీ. అక్టోబరు 2న ఆయన జయంతి. సత్యము, అహింసలే ఆయుధాలుగా, స్వదేశీ నినాదంతో జాతి జనుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన పూజ్య బాపూ పాదస్పర్శతో మన తెలుగునేలపై అనేక ప్రాంతాలు పునీతమయ్యాయి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ ప్రదేశాల వివరాలు, అక్కడ ఇచ్చిన సందేశాలు మీకోసం..


భాగ్యనగరంలో బాపూజీ యాత్ర
మహాత్ముడు తొలిసారి 1927 ఏప్రిల్ 7న వివేకవర్ధిని హైస్కూల్లో జరిగిన సభకుకు హాజరై ఓ చిన్నవేదికపైనే కూర్చొని సందేశమిచ్చారు. నాటి ఆ వేదిక నేటికీ ఆ స్కూల్‌లో భద్రంగా ఉన్నది. ‘రాట్నం కామధేనువు. ఖద్దరు ఉత్పత్తికి నగరం చాలా అనుకూలమని సరోజిని చెప్పింది. మీరు నా మెడలో వేసిన నూలుదండ హరిజనులు వడికినదని తెలిసి సంతోషపడ్డాను. నేటి నుంచి ఖద్దరునే ధరించండి’ అంటూ ప్రసంగించారు. నాటి సభ ముగింపులో ‘నేడు ఇక్కడ 12వేల రూపాయలు విరాళంగా వచ్చింది. ఈ దరిద్ర నారాయణుడిని ఇంత డబ్బుతో సత్కరించినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. మలిదఫాలో 1934లో మార్చి 9న కర్బలా మైదానంలో జరిగిన సభకు హాజరై అంటరానితనం పాపమని ప్రభోధించారు.

అనంతపురం జిల్లా
తిలక్‌ నిధి సేకరణకై బాపూ తొలిసారి 1921, సెప్టెంబర్‌ 20న తాడిపత్రి, సమీప ప్రాంతాల్లో పర్యటించి హిందూముస్లింల ఐక్యత కావాలని, జూదం, తాగుడు, వ్యభిచారం, అంటరానితనం వద్దని పిలుపునిచ్చారు. రెండవసారి 1929, మే 16న బాపూ పర్యటనలో వేలాదిమంది బ్రిటీష్‌ వస్త్రాలు తగలబెట్టి ఖద్దరు ధరించారు.
మూడవసారి.. 1934లో గుత్తి ఉరవకొండ, హిందూపురం సభల్లో పాల్గొని అంటరానితనం పోవాలని, అది ఉన్నంతవరకు తన మనసుకు శాంతిలేదని ఆవేదన చెందారు.


తూర్పు గోదావరి
పూజ్య బాపూజీ 1921 మార్చి 30న, అదేఏడాది ఏప్రిల్‌ 4న రెండవసారి, మూడవసారి 1929 మే 6న, నాల్గవసారి 1933 డిసెంబర్‌ 25న, 1946 జనవరి 20న.. ఇలా ఏకంగా 5 సార్లు రాజమహేంద్రవరం వచ్చారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం(కస్తూర్బా ఆశ్రమం)లో బసచేశారు. నేటికీ నాడు గాంధీజీ వాడిన రాట్నం భద్రంగా ఉంది. 1929 మే 6న వీరేశలింగం హాల్‌ సమావేశంలో, పాల్‌ చౌక్‌(ఇన్నీస్ పేట) బహిరంగసభల్లో గాంధీజీ ప్రసంగించారు. నేడు నగరం మెయిన్‌రోడ్‌లోని దేవతా భవన్‌లో నాడు గాంధీజీ విడిది చేశారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ తన ఇక్కడి పర్యటన సందర్భంగా ఇదే భవనంలో బస చేయటం విశేషం.

పశ్చిమ గోదావరి జిల్లా
బెజవాడ ఏఐసీసీ మీటింగ్‌కు వచ్చిన గాంధీజీ సతీసమేతంగా మాగంటి అన్నపూర్ణమ్మ కోరిక మేరకు 1921 మార్చిలో ఏలూరు వచ్చారు. పౌరసన్మానం పొంది, టౌన్‌‌హాలు 10 వేలమంది పాల్గొన్న సభలో ప్రసంగించారు. 1921 ఏప్రిల్‌ రెండో వారంలో యంగ్‌ ఇండియా పత్రికలో ‘తెలుగువారు బలవంతులు, ఉదారవాదులని’ చెబుతూ మాగంటి అన్నపూర్ణమ్మ గురించి ప్రస్తావించారు. 1929లో జిల్లాకు వచ్చినప్పుడు 48 గ్రామాల్లో 250 మైళ్ల దూరం ప్రయాణం చేశారు. మూడోసారి 1933లో.. అంటరానితనం నిర్మూలనకై డిసెంబర్‌ 26న జిల్లాలో పర్యటించారు.

కృష్ణా జిల్లా
పూజ్యబాపూ ఏడుసార్లు విజయవాడలో పర్యటించారు. తొలిసారి 1919 మార్చి 31న నగరంలోని రామ్మోహన్ రాయ్ లైబ్రరీలో సత్యాగ్రహం గురించి ఉపన్యసించారు. 1920, ఆగస్టు 23న సహాయనిరాకరణ ఉద్యమంలో నగర సభలో ప్రసంగిస్తూ.. బ్రిటిష్ వారి బిరుదులను వదిలేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 21, 1921న ఏఐసీసీ మీటింగ్ కోసం మూడోసారి నగరానికి వచ్చినప్పుడే.. పింగళి వెంకయ్య జాతీక పతాక నమూనాను పరిశీలించి, సూచనలిచ్చారు. నాలుగోసారి ఏప్రిల్ 10, 1929న ఖద్దరు ప్రచారంకోసం, అయిదోసారి 16 డిసెంబర్, 1933 న హరిజనోద్ధరణ ప్రచారానికి, 1937, జనవరి 23న గుంటూరు తుఫాన్ బాధితులను పరామర్శించి వస్తూ బెజవాడలో ప్రసంగించారు. హిందీ ప్రచార సభ కార్యక్రమం కోసం 1946 జనవరి 21న చివరిసారి వచ్చారు. రెండుసార్లు బందరు నేషనల్ కాలేజీనీ గాంధీజీ సందర్శించారు.

శ్రీకాకుళం జిల్లా
1921లో బెజవాడ ఏఐసీసీ సభకు వచ్చిన బాపూకి కాంగ్రెస్ నేతలు పొందూరు ఖద్దరును అందించారు. పొందూరు ఖాదీ, అక్కడి కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ మరుసటి నెల యంగ్ ఇండియా‌లో సంపాదకీయం రాశారు. 1927 డిసెంబర్‌ 2న గాంధీజీ వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వేస్టేషన్‌ సమీపంలో 3 రోజులు బసచేసి, నౌపడ ప్రాంత ఉప్పు రైతులతో సమావేశమయ్యారు. మర్నాడు మెళియాపుట్టిలో ఖాదీ షాపును ప్రారంభించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942లో దూసి రైల్వే స్టేషన్‌‌లోనే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

నెల్లూరు జిల్లా
సింహపురి నేలపై బాపూజీ ఐదుసార్లు పర్యటించారు. 1921లో గాంధీజీ పల్లెపాడు పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించి, హరిజనులకు గ్రామ ప్రవేశం కల్పించారు. నెల్లూరు టౌన్‌హాల్‌లో తిలక్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం 1929, 1933లోనూ కావలి ప్రాంత మెట్ట ప్రాంతాల్లో పర్యటించి, ప్రసంగించారు. 1946లోనూ చివరిసారిగా చెన్నై పట్టణం వెళుతూ వచ్చారు. టౌన్‌హాల్‌లో బాపూజీ సమావేశాలు, వీఆర్‌ కాలేజీలో జరిగిన సభలు, పొణకా కనకమ్మ స్థాపించిన కస్తూర్బా బాలికల విద్యాలయం, రేబాల వారి నివాసంలో బాపూజీ బస వంటివి జిల్లావాసులుకు దక్కిన కొన్ని అదృష్టాలు. .

కర్నూలు
1921, 1929లో రెండుసార్లు జిల్లాలో పర్యటించారు. తొలిసారి జాతీయ నిధికి విరాళాల సేకరణకు 1921 సెప్టెంబర్‌ 30న కర్నూలు వచ్చి, ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రధాన వీధుల గుండా సాగుతూ.. విరాళాలు స్వీకరించారు. రెండవసారి 1929 మే 21న సతీసమేతంగా ఖద్దరు నిధి విరాళాల సేకరణకు ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, కర్నూలు, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల్లో పర్యటించారు.

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×