EPAPER
Kirrak Couples Episode 1

National Girl Child Day : పరిమితుల బోనులో బాలికల భవిష్యత్తు..!

National Girl Child Day : పరిమితుల బోనులో బాలికల భవిష్యత్తు..!
National Girl Child Day 2024

National Girl Child Day : ప్రపంచంలో ఏ పురుషుడూ.. తల్లి, చెల్లి, భార్య, కూతురు.. ఇలా ఏ బంధం లేకుండా మనుగడ సాగించలేడు. కానీ.. అలాంటి ఆడపిల్ల జీవితం మాత్రం పురిటిలోనే ఆంక్షలు, వివక్షలతో మొదలవుతోంది. ఒకవైపు కొందరు బాలికలు చిన్నవయసులోనే అద్భుతాలు సాధించి జనం నోళ్లలో నానుతుంటే.. మరోవైపు ఆడపిల్లలు తల్లి గర్భంలోనే కన్నుమూస్తున్న దుస్థితి. పుట్టి భూమ్మీద పడిన తర్వాత కూడా ఎన్నో రకాల కుటుంబ, సామాజిక ఆంక్షల మధ్య నలిగిపోతున్నారు.


ఈ నేపథ్యంలో ఆడపిల్లల ప్రగతి, భద్రత తదితర అంశాలపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం.. 2008లో ‘నేషనల్‌ గర్ల్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌’ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా నాటి నుంచి ఏటా జనవరి 24న కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మన దేశపు తొలి మహిళా ప్రధానిగా శ్రీమతి ఇందిరా గాంధీ బాధ్యతలు చేపట్టిన రోజును (1966 జనవరి 24) జాతీయ బాలికా దినోత్సవంగా ఎంపిక చేశారు.

ఐరాస మహిళా విభాగం, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం మనదేశంలో ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరు కనీసం పదో తరగతి వరకైనా చదవడం లేదు. పై చదువులకు వెళ్ళిన ప్రతి పదిమంది బాలికల్లో నలుగురు ఇంటర్‌లోనే ఆగిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల్లో 90 శాతం మందికి ఇంటర్‌నెట్ సేవలు కూడా అందుబాటులో లేవు. 5-14 ఏళ్ల వయసు బాలికల్లో సగం మంది తమ సమాన వయసున్న అబ్బాయిలతో పోల్చితే జీతం భత్యం లేని పనులకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా ఇంటి చాకిరీ అంతా వీరి మీదనే పడుతోంది.


ఇక సుమారు 30 శాతం బాలికలు.. తమ కుటుంబ లేదా పరిచయస్తుల నుంచి ప్రత్యక్ష,పరోక్ష లైంగిక వేధింపులను ఎదుర్కోవాల్సి రావటంతో చదువుకు దూరమవతున్నారు. బడికి పోయే బాలికల్లో సుమారు 25 శాతం మంది తోటి విధ్యార్థులు, యువకుల నుంచి ఇలాంటి వేధింపులే ఎదుర్కోవాల్సి వస్తోంది. మన దేశంలో ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్న వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నారు. వీరిలో మెజారిటీ వేధింపుల కారణంగా డిప్రెషన్‌కు లోనై చదువుకు దూరమైపోతున్నారు.

మనదేశంలో బాలికల జనాభా సుమారు 28 కోట్లు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 929 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. పైగా, ప్రపంచం మొత్తంలో ఆడపిల్లల మరణాలు అత్యధికంగా ఉన్నది మనదేశంలోనే. బాల్య వివాహాల నిర్మూలనకు కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం బాల్యవివాహాల నిషేధ(సవరణ) బిల్లును తీసుకొచ్చినా.. నేటికీ బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి.

2022 జనవరి నాటికి దేశంలో మొత్తం 2,26,728 పోక్సో కేసులు పెండింగులో ఉన్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం- 2021 చివరి నాటికి తెలంగాణలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 4,332 కేసుల్లో దర్యాప్తు పూర్తి కాగా, 40.3శాతం కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జాతీయ సగటు (36.8శాతం) కంటే ఇది ఎక్కువ! తెలంగాణలో రోజూ సగటున ఏడుగురు మైనర్లపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నట్లు విశ్లేషణలు వచ్చాయి. గతంలో తల్లి పక్కనే నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికందును అపహరించి, అత్యాచారానికి పాల్పడటం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఈ పరిస్థితిని మార్చేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నా.. బాలికల జీవన ప్రమాణాల్లో ఇంకా ఆశించిన మార్పులు రావటంలేదు. ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి- బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం, బాలికలకు ఆర్థిక భద్రతను కలిగించే సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాల మొదలు పలు స్కాలర్ షిప్ స్కీమ్స్, ప్రోత్సాహకాలు అమల్లో ఉన్నప్పటికీ ఈ రంగంలో ఇంకా చేయాల్సింది చాలానే ఉందనిపిస్తోంది.

బాలికల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే, మొదట వారికి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారాల్సి ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడటం, చదువు, ఖర్చుల విషయంలో మగపిల్లలతో బాటు వీరినీ చూడకపోవటం, వేషధారణ విషయంలో సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లకు భయపడటం మానుకొని, వారికి తగినంత స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి భద్రత, భరోసా ఇంట్లో దక్కినప్పుడే బాలికల జీవితాల్లో ఆనందం విరబూస్తుంది.

Related News

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

Big Stories

×