EPAPER

Swami Ramanand Tirtha : హైదరాబాద్ సంస్థానపు రాజకీయ గురువు.. రామనంద తీర్థ

Swami Ramanand Tirtha : హైదరాబాద్ సంస్థానపు రాజకీయ గురువు.. రామనంద తీర్థ
Swami Ramanand Tirtha

Swami Ramanand Tirtha : వెంకటేష్ భగవాన్‌రావ్ ఖేడ్గీకర్‌ అంటే చాలామందికి తెలియదేమో గానీ.. స్వామీ రామానంద తీర్థ అంటే తెలియని తెలుగువారు ఉండరు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడిగా నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ముందుండి పోరాడిన యోధుడిగా, నాటి యువతరానికి ఆచార్యుడిగా, మార్గదర్శిగా, తత్వ బోధకుడిగా నిలిచిన మహాజ్ఞాని ఆయన. ‘ఈ విశ్వమంతా నాదే. ఈ జనులంతా నా కుటుంబ సభ్యులే’ అని ప్రకటించి, ‘విద్వతీ సన్యాసం’ తీసుకున్న తర్వాత ‘స్వామి రామానంద తీర్థ’గా మారారు. దారిద్య్రం, అజ్ఞానం, జడత్వం, బానిసత్వంలో మగ్గుతున్న తన జాతి ప్రజలకు దారిచూపేందుకే తాను కాషాయం కట్టానని ప్రకటించిన నిష్కామయోగి. నేడు ఆ మహనీయుని వర్థంతి.


స్వామీజీ కర్ణాటక రాష్ట్రం జువర్గీ జిల్లాలోని ‘సింధీ’ గ్రామంలో 1903 అక్టోబర్‌ 3న జన్మించారు. ఆయన తండ్రి బాపూరావు, తల్లి యషూబాయి. స్వామీజీకి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరావు ఖేడ్గికర్‌. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించటంతో బంధువుల సాయంతో చదువుకున్నారు. ప్రాథమిక విద్యను గాణగాపూర్‌లో పూర్తిచేసిన స్వామీజీ, షోలాపూర్‌లోని తిలక్‌ విద్యాపీఠం నుంచి రాజకీయశాస్త్రంలో ఎం.ఏ. పట్టా పుచ్చుకొన్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య తిలక్‌ మరణ వార్త విని, బ్రహ్మచారిగా మాతృభూమి సేవకే అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. అనంతరం గాంధీ పిలుపునందుకుని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, హరిజనోద్ధరణకు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ వ్యాప్తికి కృషి చేశారు.

కొంతకాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్.ఎం జోషి కార్మికోద్యమంలో పాల్గొన్నారు. 1926 లో ఢిల్లీలో ఉండగా పాక్షిక పక్షవాతానికి గురై కొంతకాలానికి కోలుకున్నాడు. ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ హెడ్మాష్టర్‌గా చేరారు. ఈ సమయంలోనే హైదరాబాదు రాష్ట్రంలో హిందువులపై నిజాం అనుచరులు చేస్తున్న దుర్మార్గాలను ప్రత్యక్షంగా గమనించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి పోరుబాట పట్టారు. జనవరి 14, 1930 లో ఆయన విద్వతీ సన్యాస దీక్ష స్వీకరించి.. ‘స్వామీ రామానంద తీర్థ’ అనే సన్యాస నామాన్ని స్వీకరించారు.


తిలక్‌ ప్రసంగాల ప్రభావం, గాంధీజీ పోరాట పటిమకు ఆకర్షితులైన స్వామీజీ స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నారు. 1938 జూన్‌లో లాతూరులో జరిగిన మహారాష్ర్ట రెండో కాంగ్రెస్ మహాసభలో స్వామీజీ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌ వచ్చి ప్రత్యక్ష రాజకీయ పోరాటాలకు పిలుపునిచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలపట్ల విశ్వాసం గల వందలాది మంది యువకులను సమీకరించి, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నిర్మాణానికి పునాది వేశారు.

‘హైదరాబాద్‌‌లో ఎలాంటి రాజకీయ పోరాటాలను అనుమతించబోము’ అని నాటి సంస్థానపు ప్రధానమంత్రి సర్‌ అక్బర్‌ హైదరీ హెచ్చరించినా స్వామీజీ వెనకడుగు వేయలేదు. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో నిజాం సర్కారు కాంగ్రెస్ పార్టీని నిషేధించగా, ఆ ఉత్వర్వులను ధిక్కరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సుల్తాన్‌ బజార్‌లోని హైదరాబాద్‌ టెలిగ్రాఫ్‌ ఆఫీసు ముందే స్టేట్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు. దీంతో ప్రభుత్వం స్వామీజీతోపాటు రావి నారాయణరెడ్డి, తదితరులను అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలులో నిర్భంధించగా, 18 నెలల శిక్షను అనుభవించారు.

జైలు నుంచి విడుదలయ్యాక.. మళ్లీ జాతీయోద్యమం బాట పట్టిన స్వామీజీ.. హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం వందేమాతర గీతం ఆలపించటాన్ని నిషేధించగా, దానిని ధిక్కరించారు. స్వామీజీ పిలుపుకు స్పందించిన 300 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని మరింత జనంలోకి తీసుకుపోయేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వం వారిని వర్సిటీ నుంచి బహిష్కరించింది. నాటి బహిష్కృతుల్లో మాజీ ప్రధాని పీవీ ఒకరు. ఆ విద్యార్థులందరినీ స్వామీజీ మహారాష్ట్రలోని వేర్వేరు విద్యాసంస్థల్లో చేర్పించి, వారి బాగోగుల బాధ్యత తీసుకున్నారు.

నాందేడ్‌లోని పీపుల్స్‌ కాలేజి స్థాపకులుగా, హైదరాబాదు ఖాదీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా, హైదరాబాదు హిందీ ప్రచార సంఘానికి అధ్యక్షులుగా, 1952లో హైదరాబాదు కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులుగా సేవలందించారు. 1952, 1957లో గుల్బర్గా లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 1953లో హైదరాబాదులో జరిగిన తొలి అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, ఉస్మానియా వర్సిటీ సెనేట్‌ శాశ్వత సభ్యులుగా, వినోభా భావే భూదాన్‌ ఉద్యమంలోనూ సేవలందించారు. హైదరాబాదు సంస్థానంలోని తెలుగు జిల్లాలను, ఆంధ్రరాష్ట్రంతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవ కోసం ముగ్గురు అద్భుతమైన శిష్యులను కూడా స్వామీజీ అందించారు. వారిలో ఒకరు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బి.చవాన్‌ కాగా మరొకరు కర్ణాటక మాజీ సీఎం పాటిల్‌. ఇక స్వామీజీకి అత్యంత ప్రియమైన శిష్యుడైన పీవీ నరసింహారావు ఏపీ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సేవలందించారు. తన శేషజీవితాన్ని హైదరాబాద్‌‌లోని బేగంపేటలోని బ్రాహ్మణవాడి 9వ లేన్‌లోని నివాసంలో గడిపిన స్వామీజీ.. 1972 జనవరి 22న శివైక్యం చెందారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×