EPAPER

YCP Changes : మార్పు మంచికేనా..? ఆ వర్గం నేతలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..?

YCP Changes : మార్పు మంచికేనా..? ఆ వర్గం నేతలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..?
YCP party latest news

YCP party latest news(Andhra pradesh political news today):

వైనాట్ 175. ఇదీ.. అధికార వైసీపీ నినాదం. అందులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని మొదట్నుంచి చెప్పుకొస్తున్న జగన్‌.. చేసిన మార్పుల్లో మాత్రం ఎస్సీల సీటల్లోనే భారీగా మార్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. నా ఎస్సీలు.. నా బీసీలు అని చెప్పుకునే వైసీపీ అధినేత.. పార్టీ ప్రయోజనాల పేరుతో ఇలాంటి మార్పులు చేయటంపై ఎస్సీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వైసీపీ అధిష్టానం చేసిన మార్పులేంటి? అందులో ఎస్సీ సీట్లు మార్పులెన్ని.


త్వరలో జరగనున్న ఎన్నికల కోసం YSRCP కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత జగన్.. సుదీర్ఘ కసరత్తు తర్వాత మరికొన్ని స్థానాలకు ఇంఛార్జ్‌లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలు, నాలుగో జాబితాలో తొమ్మిది మంది ఇంఛార్జ్‌లను వైసీపీ ప్రకటించింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఎక్కువ మార్పులు చేసింది తమ సామాజికవర్గంలోనే అని.. ఇతరుల విషయంలో జగన్‌ పెద్దగా మార్పులు చేయలేదని YCP..తమ వర్గంపైనే గురి పెట్టిందని ఎస్సీ నేతలు ఆవేదన చెందుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎలాగైనా ఈ సారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానం.. భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అక్కడ వరకూ బాగానే ఉంది. మొత్తం 175 స్థానాల్లోని ఎక్కువగా ఎస్సీలకు సంబంధించిన వారికే స్థానచలనాలు కల్పించింది. పనితీరు ఆధారంగా కొందరు.. ఐప్యాక్‌ సమాచారం ఆధారంగా మరికొందరిని మార్పులు చేసింది. కొందరికి టిక్కెట్లు ఇవ్వకపోగా.. మరికొందరిని ఏకంగా నియోజకవర్గాలనే మార్చేసింది.
మొదటిలిస్టులో ఇద్దరు ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యేకు స్థానచలనం చేశారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరితకు.. తాడికొండ నియోజవర్గ బాధ్యతలు అప్పగించారు.
సౌమ్యురాలిగా పేరున్న సుచరిత.. టీడీడీ- జనసేనపై అంతగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ఆమెకు నియోజకవర్గంలోనూ ఆశించినంత ప్రజాదరణ దక్కలేదు. అందుకే ఆమె మార్పు అంటూ వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.


ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమాలపు సురేష్‌ను కొండేపి నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు. ఆ స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించారు. ఒకటీ రెండు ఘటనల మినహా ఆదిమూలపు సురేష్‌ కూడా అధిష్టానం మెప్పు పొందలేకపోయారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోవటం తప్ప.. క్యాడర్‌కు అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. మరో మంత్రి.. మెరుగు నాగార్జునను సంతనూతలపాడు నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అసెంబ్లీలో టీడీపీపై ఘాటు విమర్శలు చేసే నాగార్జునకు.. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో సీటు మార్చేశారని చర్చ నడుస్తోంది.

రెండో విడతను పరిశీలిస్తే.. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు అధిష్టానం టిక్కెట్‌ నిరాకరించింది. ఆ స్థానంలో విప్పర్తి వేణుగోపాల్‌కు అవకాశం కల్పించారు. మొదట్నుంచీ చిట్టిబాబు వైఖరి అధిష్టానానికి నచ్చలేదనే వాదనలూ ఉన్నాయి. ఆయన సోదరుడుతో పాటు కుమారుడూ.. పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా రావటంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వైపు మొగ్గుచూపని వైసీపీ అధిష్టానం ఆ స్థానంలో కంబాల జోగులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. గొల్ల బాబూరావు పనితనం పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని.. అందుకే ఆయన్ను తప్పించారని స్థానిక నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కంబాల జోగులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాం లో డాక్టర్ తాలె రాజేష్‌కు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో జోగులుకు తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారంతో ఆయనను మార్చినట్లు కనిపిస్తోంది.

మూడో లిస్టులోనూ చాలా మార్పులు చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టిక్కెట్ నిరాకరించిన అధిష్టానం.. ఆ స్థానంలో కంభం విజయరాజుకు అవకాశం ఇచ్చింది. మొత్తం ఎంపీ పెత్తనంతో ఇష్టానుసారంగా మార్పులు చేశారని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పలుమార్లు ఆరోపణలు చేయగా.. అది నచ్చని అధిష్టానం ఆయన్ను తప్పించిందనే వాదనలూ ఉన్నాయి. ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎలీజా మధ్య ఉన్న విభేదాలు కూడా ఎలీజాను పక్కన పెట్టేందుకు దోహదం చేశాయనే వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్‌గా ఉన్న MS బాబుకు మొండిచేయి చూపించిన జగన్‌… ఆ స్థానంలో మూతిరేవుల సునీల్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేయటంపై.. సిట్టింగ్ ఎమ్మెల్యే MS బాబు.. వైసీపీ అధిష్టానాన్ని తప్పుబట్టారు. నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసే ఎస్సీ ఎమ్మెల్యేలను బలి పశువులను చేస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. చిత్తూరు జిల్లా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పూతలపట్టు ఇన్‌ఛార్జ్‌ మార్పు జరిగిందనే వినికిడి ఉంది.

కోడుమారు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్‌కు టిక్కెట్ ఇవ్వని YCP అధిష్టానం.. అక్కడ నుంచి డాక్టర్ సతీష్‌కు ఎంపిక చేసింది. పార్టీ చేయించిన సర్వేల్లో సుధాకర్‌కు సానుకూలత లేకపోవటం వల్లే ఆయన్ను పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్‌ స్థానంలో మేరిగ మురళిని పోటీ చేయిస్తోంది. ఈయన గతంలో RDOగా పనిచేసిన అనుభవం ఉంది. వరప్రసాద్‌పై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైన వేళ.. ఆయనను కొనసాగించేందుకు జగన్ నిరాకరించారు. తొలునుంచి జగన్‌కు అండగా నిలిచిన వరప్రసాద్‌కు కూడా టిక్కెట్ నిరాకరించటం.. వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దాంతో పాటు వరప్రసాద్‌.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు ఈ సారి నిరాశే ఎదురైంది. ఆయనకు మరోసారి టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపలేదు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మద్దిల గురుమూర్తికి అవకాశం కల్పించారు. తిరుపతి ఎంపీ సీటును ఆదిమూలంకు కేటాయించారు. ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయంతో లోక్‌సభకు పోటీకి సిద్ధమయ్యారు ఆదిమూలం.

నాలుగో విడత జాబితాలోనూ పలు మార్పులు చేసిన వైసీపీ.. అక్కడ కూడా ఎస్సీ నేతలకే స్థానచలనం కల్పించింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామికి సీటు మార్పు చేస్తూ… ఆయన్ను చిత్తూరు ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న రెడ్డెప్పను.. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మరోవైపు.. శింగనమల ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతికి.. టికెట్ నిరాకరించిన వైసీపీ… ఆ స్థానంలో వీరాంజనేయులకు అవకాశం కల్పించారు. జిల్లాల్లో ఆదిపత్యపోరు కారణంగానే పద్మావతికి టిక్కెట్ దక్కలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్‌ఛార్జ్‌ల మార్పులు జరుగుతున్న సమయంలోనే సాగునీటి విషయంలో పార్టీ అధిష్టానాన్ని, మంత్రులను ఇరుకున పెట్టేవిధంగా పద్మావతి వ్యాఖ్యలు చేయటం.. వాటిపై సీఎంవోకి స్వయంగా వెళ్లి వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో టిక్కెట్ దక్కలేదని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌ను కొనసాగించేందుకు ఇష్టపడని సీఎం జగన్‌.. ఆ స్థానంలో డాక్టర్ సుధీర్‌కు అవకాశం కల్పించారు. తొలినుంచి ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వర్గపోరు ఉంది. బైరెడ్డి చక్రం తిప్పడం వల్లే సుధీర్‌ను జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అటు.. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిపై సీతకన్ను వేసిన వైసీపీ.. ఆ స్థానంలో ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చింది. సర్వే నివేదికలు, వ్యకిగత ఇమేజ్ లేకపోవటం వల్ల కొత్త అభ్యర్థిని తీసుకురావాల్సి వచ్చిందని వైసీపీ నుంచి టాక్‌. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో అభ్యర్థులను.. అధిష్టానం అటూ..ఇటూ మార్చింది. కొవ్వూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనితను గోపాలపురంకు, గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నతలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చారు.

నాలుగు విడతలుగా అభ్యర్థులను ఖరారు చేసిన జగన్‌.. తొలి జాబితాలో ఐదు స్థానాలు అంటే.. ఒంగోలులో రెండు, గుంటూరులో మూడు మార్పు చేశారు. రెండో లిస్టులో నాలుగు మార్పులు జరగ్గా.. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఒంగోలులో ఒక్కో మార్పు జరిగింది. మూడో విడతలో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా, నెల్లూరు, కర్నూలులో ఒక్కో మార్పు చేసిన జగన్‌.. చిత్తూరులో మాత్రం ఇద్దరికి స్థానచలనం కల్పించారు. ఏపీలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 21 మందిని మార్చిన వైసీపీ.. నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరి స్థానచలనం కల్పించింది. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లురుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు.

నిజానికి ఆయా ఎమ్మెల్యేలు కూడా ఈ మార్పులను ఊహించి ఉండరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించటం సహా ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా ఈ సారి భారీ మార్పులకు వైసీపీ సిద్ధమయ్యింది. కేవలం గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని.. అందుకోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు సై అన్నట్లుగా జగన్‌ పావులు కదుపుతున్నారు. విజయమే లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం చేసిన మార్పులను కొందరు నేతలు అర్థం చేసుకుంటే.. మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ గూటికి కూడా చేశారు. జగన్‌.. వ్యూహాలు తెలియక కొందరు నేతలు బిక్కమొహాలు వేసుకున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×