EPAPER

Gruhajyothi Scheme : ఎన్నికల హామీలపై కసరత్తు.. గృహజ్యోతి స్కీమ్ అమలుకు ప్రణాళికలు..

Gruhajyothi Scheme : ఎన్నికల హామీలపై కసరత్తు.. గృహజ్యోతి స్కీమ్ అమలుకు ప్రణాళికలు..

Gruhajyothi Scheme : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం లిమిట్‌ పెంపును అమలు చేస్తోంది.ఇక గృహజ్యోతి స్కీంలో ప్రతి నెలా 200 యూనిట్ల గృహ విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.


రాష్ట్రంలో ప్రస్తుతం కోటి 31 లక్షల 48వేలకుపైగా డొమెస్టిక్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నెలకు 200 యూనిట్ల వరకు వాడేది కోటి 5 లక్షల వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెలనెలా కరెంటు బిల్లులపై డిస్కంలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే కోటి 5 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తే.. నెలనెలా వచ్చే 350 కోట్ల ఆదాయం డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 4వేల 200 కోట్ల వరకు డిస్కంలకు సర్కార్‌ చెల్లించాలి.

ఇక ఫ్రీ పవర్‌ పొందే కోటి 5 లక్షల ఇళ్ల వినియోగదారుల వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు కోసం ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ పథకం కింద లబ్ధి పొందాలంటే అందులో నమోదు చేసుకోవాలి. అంటే విద్యుత్‌ కనెక్షన్‌ వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. స్వయంగా వినియోగదారులే నేరుగా నమోదు చేసుకునే అవకాశం కర్ణాటక సర్కార్‌ కల్పించింది. అక్కడి ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలు చేస్తోంది. అదే తరహాలో ఇక్కడా అమలుకు ప్రాథమికంగా డిస్కంల నుంచి తెలంగాణ ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది.


పోర్టల్‌లో వినియోగదారుడి కరెంట్ కనెక్షన్‌ వివరాలు నమోదు చేయగానే గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున ఎన్ని యూనిట్లు వాడారో తెలుస్తుంది. అదే సగటు ప్రకారం కర్ణాటకలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు. అదే పద్ధతిని తెలంగాణలోనూ పాటించాలా లేదా 200 యూనిట్లు వాడే కోటీ 5 లక్షల మంది వినియోగదారులందరికీ ఇవ్వాలా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.

ఉచిత విద్యుత్‌ను పొందే ఇళ్లకు సోలార్‌ పవర్‌ ఇవ్వడంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎందుకంటే సోలార్‌ పవర్‌ ఇవ్వడంతో విద్యుత్‌ వాడకం తగ్గిపోతోంది. దాంతో రాయితీ కింద ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం కూడా భారీగా తగ్గనుంది. కానీ సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు దాదాపు 10 వేల కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు చెబుతున్నారు. రెండు కిలోవాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటు చేస్తే ఏడాదికి 2 వేల 880 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత ధరల్లో రెండు కిలోవాట్ల సౌర విద్యుత్తు ఏర్పాటుకు లక్షా 30 వేల ఖర్చవుతుందని, ఇందులో కేంద్రం 36 వేలు రాయితీగా ఇస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ రాయితీ పోగా మిగిలిన 94 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించి.. ప్రతి కనెక్షన్‌కూ సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటు చేసే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

2,880 యూనిట్లకు ప్రస్తుతం డిస్కంకు చెల్లిస్తున్న ఛార్జీలను లెక్కిస్తే ఏడాదికి రూ.12,235 అవుతుంది. ఈ లెక్కన దాదాపు ఏడున్నరేళ్లలో ఒక్కో సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటుకు వెచ్చించిన రూ.94 వేలు ప్రభుత్వానికి తిరిగివచ్చేసినట్టేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ యూనిట్ల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందనేదే కీలక ప్రశ్నగా మారింది.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×