EPAPER
Kirrak Couples Episode 1

Tripuraneni Ramaswamy : మనకాలపు మార్గదర్శి.. త్రిపురనేని..!

Tripuraneni Ramaswamy : మనకాలపు మార్గదర్శి.. త్రిపురనేని..!

Tripuraneni Ramaswamy : తెలుగునాట హేతువాద ఉద్యమాన్ని చురుగ్గా నడిపి, ప్రగతిశీల భావాలకు, పురోగామి శక్తులకు ప్రాణంపోసిన మహనీయుల్లో త్రిపురనేని రామస్వామి చౌదరి ఒకరు. ద్రవిడనాట పెరియార్ రామసామి నాయకర్ సేవలను తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చి, కులమతాల ఉచ్చుల్లో చిక్కకుపోయిన సమాజాన్ని సంస్కరణ వాదం వైపు నడపటంలో రామస్వామి చౌదరి కీలకపాత్ర పోషించారు. పెరియార్ మాదిరిగానే తన పేరులోని కులనామాన్ని త్యజించి మానవవాద విస్తరణకు, విద్యావ్యాప్తికి, గొప్ప సంస్కరణ వాదానికి పునాదులు వేశారు.


త్రిపురనేని రామస్వామి 15 జనవరి 1887న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు రామమాంబ, చలమయ్య. 11 ఏళ్ల వయసులో పున్నమ్మ అనే బాలికతో 1898లో ఆయన వివాహం జరిగింది. చాలా ఆలస్యంగా 23వ ఏట మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. ఆ తర్వాత రచనలు చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రాణా ప్రతాప్ జీవితంపై ఆయన రచన అచ్చు దశలో ఉండగా, నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 1910లో తన స్వగ్రామమైన అంగలూరు బడిలో హరిజన బాలికకు అడ్మిషన్ చేయించిన కారణంగా, సొంతకులం వారి ఆగ్రహానికి గురి అయ్యాడు. 1911లో ఆయన బందరు నోబెల్ కాలేజీలో ఇంటర్ చదివారు.

అక్కడ అధ్యాపకుడిగా ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యరికం చేసి తన గొప్ప ధారణా శక్తిని, సాహిత్యం మీద సాధికారతను సాధించి మొదట అష్టావధానం, తర్వాత శతావధానం చేశారు. తర్వాత అవధానాన్ని పక్కనబెట్టి.. లా చదువు కోసం 1913లో బొంబాయి వెళ్లినా.. 1914లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదివారు. దానితో పాటు ఆంగ్ల సాహిత్యాన్నీ చదివారు.


ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడూ ఆయన ఆయన పంచె కట్టుతోనే గడిపేవారు. ‘ఏ దేశంలో ఉంటే ఆ దుస్తులే వేసుకోవాలిగానీ ఇదేమిటని’ అక్కడి ఓ బ్రిటీష్‌ మహిళ హేళన చేయగా.. ‘మీరు మాదేశం వస్తే చీర కట్టుకుంటారా?’ అని జవాబిచ్చారట. డబ్లిన్‌ నుంచి ఇక్కడి కృష్ణా పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆయన ప్రసిద్ధ రచన ‘శంభూక వధ’ డబ్లిన్‌లో ఉండగా రాసిందే!

డబ్లిన్‌ నుంచి 1917లో తిరిగొచ్చాక.. నాలుగేళ్లు మచిలీపట్నంలో లాయరుగా ప్రాక్టీసు చేసి, 1922లో తెనాలికి మారి లాయరుగా అక్కడే స్థిరపడ్డారు. అక్కడే సామాజిక దురాచారాలను, మతమౌఢ్యాన్ని నిరసిస్తూ సంస్కరణవాదాన్ని జనంలోకి తీసుకుపోయారు. రాజా రామ్మోహన్‌ రాయ్, కందుకూరి, గురజాడ ఆదర్శాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేవారు. దీనికి గొప్ప జనామోదం రావటంతో 1925లో జస్టిస్ పార్టీ తరపున తెనాలి మునిసిపాలిటీ ఛైర్మన్ అయ్యారు. వెంటనే పట్టణంలో జంతుబలిని నిషేధిస్తూ తీర్మానం చేయగా, సభ్యుల్లో వ్యతిరేకత వచ్చి వారంతా ఆయనను పదవి నుంచి దించేశారు. కానీ..మరుసటి ఎన్నికల్లో ఆయన తిరిగి ఛైర్మన్‌గా ఎన్నికై 1939 వరకు సేవలందించారు.

సూతాశ్రమం అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెల్పుడు’ అనే గీతాన్ని రాసి తెలుగువారిని స్వాతంత్ర్య పోరాటంవైపు నడిపించారు. స్వాతంత్య్రం వచ్చే వరకు సమరయోధుడిగా ఆయన బ్రిటీష్‌ పాలకులపైకి తన జీవితాంతం అక్షర తూటాలను సంధిస్తూ వచ్చారు.

సంస్కృతంలోని పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, సులువైన తెలుగులో ‘వివాహ విధి’ అనే పద్ధతికి రూపకల్పన చేశారు. బ్రాహ్మణులతో పనిలేకుండా ఈయనే.. అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యం వహించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఎన్నో కులాంతర వివాహాలు జరిపించారు. ఆ రోజుల్లోనే ఆంధ్రమహాసభ ‘కవిరాజు’ బిరుదునిచ్చి గౌరవించింది. మూడుసార్లు ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగానూ త్రిపురనేని పనిచేశారు. 1941లో ప్రఖ్యాత మానవవాది ఎం.ఎన్‌.రాయ్ తెనాలిలోని వీరి సూతాశ్రమాన్ని సందర్శించారు.

1920 లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని వివాహమాడిన త్రిపురనేని, రెండేళ్లకు ఆమె కూడా మరణించటంతో అన్నపూర్ణమ్మను వివాహమాడారు. వీరి కుమారుడు గోపీచంద్ కూడా సుప్రసిద్ధ రచయితగా పేరుపొందారు. సూతపురాణం, శంభూకవధతో సహా అనేక సుప్రసిద్ధ రచనలు చేసిన కవిరాజు.. 1946 జనవరి 16న కన్నుమూశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో కవిరాజు శత జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏటా కవిరాజు పేరిట ఏటా ఒక పురస్కారాన్ని అందిస్తోంది. కేవలం 56 ఏళ్లు జీవించిన త్రిపురనేని.. హేతువాదిగా, మానవవాదిగా తెలుగు సమాజం మీద తనదైన ముద్రను వేసి వెళ్లిపోయారు.

Tags

Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×