EPAPER
Kirrak Couples Episode 1

Prabhala Theertham : ఏకాదశ రుద్రల సమాగమమే.. కోనసీమ ప్రభల తీర్థం

Prabhala Theertham : ఏకాదశ రుద్రల సమాగమమే.. కోనసీమ ప్రభల తీర్థం
Prabhala Theertham

Prabhala Theertham : కోనసీమ అంటేనే అందం. అది వేదసీమ అని పెద్దలు చెబుతారు. శ్రీశైలం తరువాత అంతటి ప్రాముఖ్యమున్న శైవ క్షేత్రాలున్న ప్రదేశమిది. అలాంటి కోనసీమ నడుమ తరతరాలనుండీ సంక్రాంతి కనుమ నాడు జరిగే ‘జగ్గన్నతోట’ ప్రభలతీర్థపు వేడుకలకు ఎంతో పేరుంది. ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో కనుమ ఘడియల్లో ‘మొసలిపల్లి శివారు జగ్గన్నతోట’ జరిగే ఈ ఏకాదశ రుద్రుల సమాగమం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన సమాగమంగా పెద్దలు చెబుతారు. తెలుగు సంప్రదాయం, ఆధ్యాత్మిక పరిమణాలను వెదజల్లే ఈ కోనసీమ ప్రభల ఉత్సవానికి శతాబ్దాల చరిత్ర ఉంది.


సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ, ఎంతో కరువు రోజుల్లోనూ 17వ శతాబ్ధములోనూ ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోకరక్షణగావించారనీ ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు. ఈ తోటలో ఏ గుడీ ఉండదు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. నాటి స్థానిక సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, కాలక్రమంలో ‘జగ్గన్న తోట’ అనే పేరుతో స్థిరపడింది.

నేటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారు జగ్గన్నతోటలో దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభల తీర్థం వేడుక మిగిలిన ఉత్సవాలకు భిన్నంగా సాగుతుంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలలో గంగలకుర్రు అగ్రహారం ప్రభలు ఎగువ కౌశిక నదిని దాటి వచ్చే తీరును మాటల్లో వర్ణించలేము. ఉత్తరాయణకాలంలో ప్రభలను ఊరిపొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.


పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉంటారని.. లోకకల్యాణం కోసం మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు, కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు, ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు, వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు, నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు, మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు, పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు, గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు ఏడాదికోమారు సమావేశమై చర్చలు సాగిస్తారని నమ్మకం. అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థం. వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.

ప్రభల తయారీకి తాటిశూలం, టేకుచెక్క, వెదురు బొంగులు, పోకచెట్ల పెంటిలను, శివునికి ప్రీతిపాత్రమైన మర్రి ఊడలను ఉపయోగిస్తారు. తేలికపాటి వెదురు బొంగులను ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో వంచి అందులో అమర్చుతారు. ప్రభకు పైన దేవాలయాల్లో ఉంచే పసిడి కుండను ఉంచి చుట్టూ నెమలి పింఛాలతో అలంకరిస్తారు.పైభాగంలో ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. దీనినే ప్రభ అంటారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచి, మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరతారు.

ఈ స్వామివారలను ‘ప్రభలపై” అలంకరించి మేళతాళాలతో, మంగళవాయిద్యాలు, భాజాబజంత్రీలతో ‘శరభ శరభా’ ‘హరహరమహాదేవ’ అంటూ ఆయా గ్రామాలనుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది కనుక మిగతా గ్రామ రుద్రులకు మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నాముందే తోటకు చేరుకుని, అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశరుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీవ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదపూర్వకంగా ఒకసారి పైకి లేపి మళ్ళీ కిందకు దించుతారు.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే గంగలకుర్రు. గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో గోదావరి పాయ, కౌశిక దాటాలి. ఆ గంగలకుర్రు ప్రభలను ఆరడుగుల లోతు నీరున్న కాలువలోంచి ‘హరాహరా’ అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండుకళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడవలేం. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆకాలువ లోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక ఆకాలువలోకి వచ్చేముందు వరిచేలను సైతం ఆ ప్రభలు దాటాల్సి వస్తుంది. తమ పంట చేలగుండా ప్రభలు సాగుతుంటే.. రైతులు సాక్షాత్తూ ఆ పరమశివుడు, ఆయన ప్రమథ గణాలు తమ పొలంలో పాదం మోపాయని రైతులు ఆనందపడతారు. దానిని తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.

పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంక్రాంతి నాడు ఆరంభమై ముక్కనుమ వరకు కోనసీమలో వివిధ ప్రాంతాల్లో 90 వరకు తీర్థాలు జరుగుతాయి. తీర్థాల నిర్వహణ వెనుక పురాణ, అధ్యాత్మిక ఆధారాలు, చరిత్ర ఉంది. నాటి రాజుల కాలంలోను.. ఆ తరువాత బ్రిటీష్‌ కాలంలోను.. నేటి ప్రజా పాలనలోను ఈ తీర్థాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. కోనసీమలోని అంబాజీపేట మండలం జగన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన శివారు వేట్లపాలెం వద్ద జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవి. ఈ తీర్థాన్ని తిలకించడానికి, రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు.

Related News

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Big Stories

×