EPAPER

Marri Chenna Reddy : రాజకీయ దురంధరుడు.. మర్రి చెన్నారెడ్డి..!

Marri Chenna Reddy : రాజకీయ దురంధరుడు.. మర్రి చెన్నారెడ్డి..!
Marri Chenna Reddy 

Marri Chenna Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో అత్యంత సమర్ధవంతమైన పరిపాలనా దక్షుల్లో మర్రి చెన్నారెడ్డి ముందువరుసలో ఉంటారు. ప్రజానేతగా, రాజకీయ చాణిక్యుడిగా పేరుతెచ్చుకున్న చెన్నారెడ్డి.. నేటి వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో 1919 జనవరి 13న మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, అక్కడ విద్యావసతులు లేకపోవటంతో మేనమామ కొండా వెంకట రంగారెడ్డి గారి ఊరైన.. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలంలోని పెద్దమంగళారం చేరి, అక్కడే ఉన్నత విద్యభ్యాసం పూర్తి చేశారు.


అనంతరం వికారాబాద్‌లో ఇంటర్‌ చదివి, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్‌గా వైద్య సేవలందించే రోజుల్లో ఆయనకు నాగార్జున సాగర్‌కు బదిలీ అయింది. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పాతబస్తీలోని ఫీల్‌ఖానాలో క్లినిక్‌ ఏర్పాటు చేసి ఏడాదిన్నర పాటు సేవలందించారు.

మేనమామ కొండా వెంకట రంగారెడ్డితో కలిసి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పొల్గొన్న చెన్నారెడ్డి, 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ సేవలందించారు. ఆ కాలంలోనే ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసు స్థాపన, నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారు. అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో పాల్గొన్నారు. ఒక వారపత్రికకు రెండేళ్లపాటు ఎడిటర్‌గా సేవలందించారు. అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించారు.


1952 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. 27 ఏళ్ల పిన్నవయసులోనే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మినిస్టర్‌గా పనిచేశారు. 1957 ఎన్నికల్లోలో అదే స్థానం నుంచి రెండవసారి గెలిచిన ఆయన, 1962లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1967 ఎన్నికల్లో తాండూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావును ఓడించి నాలుగో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అలా.. ఉక్కు, గనుల శాఖా సహాయ మంత్రిగా ఉండగానే, గత తాండూరు ఎన్నికల్లో చెన్నారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఓడిన రామచంద్రరావు హైకోర్టుకెళ్లటం, ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వటమే గాక ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించటంతో 1968లో చెన్నారెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి చట్ట సభలకు దూరమయ్యారు.

1974లో అనర్హతా కాలం ముగిశాక ఇందిర సూచన మేరకు గవర్నర్‌ పదవి చేపట్టారు. తర్వాత యూపీ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1978లో మేడ్చల్‌ నుంచి పోటీచేసి గెలుపొంది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. 1978- 79, 1989 -90లలో రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా సేవలందించారు.

1956లోనే ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన చెన్నారెడ్డి, 1969 – 70 తెలంగాణ ఉద్యమ సారథిగా నిలిచారు. తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్‌)ని ఏర్పాటు చేసి 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లలో పది గెలిచి సత్తాచాటారు. తెలంగాణ ప్రజల మనోభావా లను గమనించిన ఇందిర పిలుపు మేరకు టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఆయన సీఎంగా ఉండగానే హైదరాబాద్‌ విస్తరణ, అభివృద్ధి వేగం పెరిగింది. ఆయన పాలనాకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గన్నవరం నుంచి శాసన సభకు ఎన్నికైన సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్యను రాష్ట్ర డ్రయినేజీ బోర్డు చైర్మన్‌ పదవి తీసుకునేలా మొదట మర్రి ఒప్పించగలిగారు. అధికారులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి.

వికారాబాద్‌ ప్రాంతానికి ఆయన ఎనలేని సేవలను అందించారు. జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ‘కోట్‌పల్లి’నిర్మాణం ఆయన చలువే. దీనివల్ల తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్‌, వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూరు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు కల్పతరువుగా మారింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్‌ పట్టణానికి తాగునీటి సరఫరాకై అక్కడికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని శివారెడ్డిపేట వద్ద శివసాగర్‌ పేరుతో 1967లో చెరువును తవ్వించారు. నేటికీ ఈ చెరువే నేటికీ స్థానికుల దాహం తీరుస్తోంది.

పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడే.. గ్రామాల్లోని మట్టి రోడ్లను కంకర, బీటీ రోడ్లుగా మార్చే పథకం ప్రారంభించారు. వికారాబాద్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారేందుకు ఆయనే కారణం. 1965లోనే వికాస్‌ మండలిని స్థాపించి, దాని ఛైర్మన్‌గా ఉండి పలు కళాశాలల ఏర్పాటుకు కృషిచేశారు. అనంతగిరిలో 1968లో శ్రీ అనంత పద్మనాభ (ఎస్‌ఏపీ) పీయూసీ కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే ప్రారంభింపచేశారు.

పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ పదవిని చేపట్టాలని ఇందిర ఆదేశించడంతో చెన్నారెడ్డి చండీగఢ్‌ వెళ్లి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రజలకు, పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన సందర్భాల్లో పార్టీ నాయకత్వంతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడానికి వెనుకాడలేదు. అలాగే.. ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీతో రాజీపడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉన్నత పదవులు స్వీకరించడం కూడా చెన్నారెడ్డి రాజకీయ జీవితంలో భాగమే.

1989 డిసెంబర్‌లో సీఎం పదవిని రెండోసారి అధిష్టించిన మర్రి చెన్నారెడ్డి ఏడాదికే పార్టీలోని అసమ్మతి కారణంగా రాజీనామా చేశారు. తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌‌గా సేవలందించారు. చెన్నారెడ్డి.. సీఎం పదవిలో కన్నా గవర్నర్‌ పదవిలోనే ఎక్కువ కాలం పనిచేశారు. గవర్నర్‌ పదవిలో ఉన్నప్పుడు సైతం నిజమైన అధికారాలున్న నేతగా కనిపించడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే.

రాజకీయ ధురంధరుడిగా పేరు తెచ్చుకున్న మర్రి చెన్నారెడ్డి.. 1996, డిసెంబరు 2 న తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే కన్నుమూశారు. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన పాలనా దక్షతకు సంబంధించిన ఆనవాళ్లు నేటికీ తెలుగునేల నాలుగు చెరగులా ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×