EPAPER
Kirrak Couples Episode 1

Sankranti : పండుగ ఒకటే.. పద్ధతులే వేరు..!

Sankranti : పండుగ ఒకటే.. పద్ధతులే వేరు..!
Makar Sankranti

Sankranti : తెలుగువారికి ఎంతో ఇష్టమైన సంక్రాంతి.. నిజానికి దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. రైతాంగం తమ పంట ఇంటికొచ్చే సమయంలో చేసుకునే ఈ పండుగను పలుచోట్ల పలు పేర్లతో జరుపుకుంటారు. కాకపోతే..పండుగ పేరు, దానిని జరుపుకునే పద్ధతిలోనే కొంత తేడా ఉంది. ఈ పండుగ జరిగే అన్ని ప్రదేశాల్లో సూర్యుడి ఆరాధన, నువ్వుల వినియోగం కామన్‌గా కనిపించటం విశేషం.


మన సంక్రాంతిని పంజాబ్ వాసులు.. ‘లోహ్రీ ఉత్సవ్’ అనే పేరుతో జరుపుకుంటారు. మన సంక్రాంతి భోగితో మొదలయితే.. వీరి పండుగ భోగికి ముందురోజే ఆరంభమవుతుంది. ఈ రోజున వీరు స్నానాదికాలు చేసి, కొత్త బట్టలు ధరించి, మనలాగే భోగి మంటలు వేసి, నువ్వులతో చేసిన మిఠాయిలను అగ్నిలో వేసి నమస్కరిస్తారు. ఆ భోగిమంటల చుట్టూ తిరిగి పాటలు పాడుతూ రాత్రంతా గడుపుతారు. నువ్వులు, వేరుశనగలు, మొక్కజొన్న, బెల్లంతో తయారు చేసిన మిఠాయిలను ప్రసాదంగా పంచుతారు.

మహారాష్ర్టలో సంక్రాంతిని మాఘి సంక్రాంతి, హాల్దీ కుంకుమ్ ఉత్సవ్ అనే పేర్లతో జరుపుకుంటారు. వీరు భోగి రోజున ఇంటి ముందు ముగ్గులేసి వాటిపై చెరకు గడలు, రేగుపండ్లు, చిలగడ దుంపలు, తమలపాకులు, నవధాన్యాలు, అలంకరించిన చిన్న మట్టి కుండ పెట్టి భోగి పూజ చేస్తారు. భోగినాడు నువ్వులు వేసి చేసిన సజ్జ రొట్టెలను, ప్రత్యేకమైన కూరతో ఆరగిస్తారు. సంక్రాంతి నాడు మహిళలు విఠలుడి ఆలయాలను దర్శిస్తారు. నువ్వులు, బెల్లం, పసుపు కుంకుమ, తమలపాకులతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వుల లడ్డులు పంచుకుంటారు. ముత్తయిదువలు హల్దీ కుంకుమ్‌ ఉత్సవ్‌ పేరుతో ఇరుగుపొరుగు వారిని ఇంటికి పిలిచి కొత్త పాత్రలో పసుపు కుంకుమ ఇస్తారు..


సుకరత్, సక్రాత్ అనే పేర్లతో రాజస్థానీయులు ఈ పండుగను చేసుకుంటారు. అక్కడ ఇది ఒకరోజు పండుగే. ఈ రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి చిన్న మట్టికుండలో బియ్యం, పెసలు, చెరుకు గడలు, రేగిపండ్లు, ముల్లంగి తదితరాలుంచి పూజిస్తారు. కొత్తగా పెళ్లయి అత్తారింటికి చేరిన ఆడపడచులందరూ పుట్టింటికి చేరి, పుట్టింటివారి బహుమతులు అందుకుంటారు. పుట్టింటికి వచ్చిన ఆడపడచులకు నూతన వస్త్రాలు, నువ్వుల లడ్డూలిచ్చి గౌరవిస్తారు.

అస్సాంలో సంక్రాంతిని.. మాఘ్‌ బిహు లేదా భోగలీ బిహూ అంటారు. పండుగకు ముందురోజే.. ప్రజలు ఈ పండుగ కోసమే నిర్దేశించిన చెరువుల వద్దకు చేరి చేపలు పడతారు. ఈ వేడుకను వారు ‘ఉరుగా’ అంటారు. చేపలు పట్టాక.. పురుషులు వెదురుపాకలు నిర్మిస్తే.. మహిళలు వంట పూర్తి చేస్తారు. తర్వాత అందరూ కలిసి వెదురుపాకలోనే భోంచేసి, రాత్రి కాలక్షేపం చేసి, మర్నాడు.. ఈ పాకకు నిప్పంటిస్తారు. ఇక్కడా దున్నపోతుల పోటీలు, కోడిపందేలుంటాయి.

తమిళులకూ మనలాగే సంక్రాంతి అతిపెద్ద పండుగ. అక్కడ పొంగల్ పేరుతో జరిగే ఈ పండుగను 3 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. వేకువనే ఇంటి ముందు ముగ్గులు వేసి, పూజాదికాలు చేస్తారు. పొంగలిని తయారుచేసి సూర్యునికి నివేదిస్తారు. మరికొందరు బియ్యం, పలు పప్పు దినుసులు, పాలు, నెయ్యి కలిపి కిచిడి చేసి..కులదైవాలకు నివేదిస్తారు. ఇక్కడి కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు, జల్లికట్టు వేడుకలు ఆకాశాన్నంటుతాయి.

ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతిని ‘ఖిచిరి’ అంటారు. సంక్రాంతికి నెలరోజుల మందే మాహామాఘి పేరుతో నదీస్నానం చేస్తారు. మకర సంక్రమణ సమయలో కోట్లాది మంది త్రివేణి సంగమం, ప్రయాగ, హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. ఇక.. ఒడిసాలో కొన్ని గిరిజన తెగలకు సంక్రాంతి పండుగ నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. పండుగ రోజు ఉదయాన్నే నెగడు వెలిగించి, దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.

ఇక గుజరాత్‌.. మకర్ సంక్రాంతి వేడుకల్లో గాలిపటాలదే ప్రధాన స్థానం. సంక్రాంతినాడు అహ్మదాబాద్‌లో ఆకాశమంతా లక్షలాది గాలిపట్టాలతో నిండిపోతుంది. ఈ వేడుకను తిలకించడానికే సంక్రాంతి రోజు.. దేశ విదేశాల నుంచి వేలాది పర్యాటకులు వస్తుంటారు. కశ్మీరీలు ఈ పండుగను ‘శిశుర్‌ సంక్రాంత్‌’ పేరుతో జరుపుకుంటారు.

నేపాల్‌లోని థారూ ప్రాంతీయులు ఈ పండుగను మాఘీ, మాఘే అనే పేర్లతో జరుపుకుంటారు. ప్రతి ఇంటి ముంగిట ముగ్గులు వేసి, అందులో పువ్వులు, పసుపుకుంకుమలు, రాగి నాణేలు ఉంచుతారు. ఇంట్లో శివలింగానికి పూజలు చేసి, పశుపతినాథుడిని దర్శించుకుంటారు. అక్కడి భాగమతి, గండకీ నదుల్లో పుణ్యస్నానం చేస్తారు. ఇక్కడ ఎద్దుల పోటీలు ప్రత్యేకం. మదించిన ఎద్దులు బరిలో దిగి కొట్లాడుకుంటుంటే జనం కేరింతలు కొడుతూ వీక్షిస్తారు.

కంబోడియాలో మన సంక్రాంతిని ‘మోహ సంగ్‌క్రాన్‌’గా 3 రోజులపాటు జరుపుకుంటారు. కాకుంటే వీరి సంక్రాంతి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ రోజున అక్కడి వారు బౌద్ధాలయాల్లో బుద్ధునికి అభిషేకం, పూజలు చేస్తారు. ఏడాదంతా మంచే జరగాలని ప్రార్థిస్తూ ముందురోజే తమ ఇంటిలో ప్రతిష్టించిన పవిత్ర జలంలోని నీటితో ఉదయం ముఖం, మధ్యాహ్నం ఛాతీని, సాయంత్రం పాదాలను కడుక్కుంటారు.

Related News

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Big Stories

×