EPAPER
Kirrak Couples Episode 1

Significance Of Rangoli : ముగ్గులకు పెద్ద చరిత్రే ఉందండోయ్…!

Significance Of Rangoli : ముగ్గులకు పెద్ద చరిత్రే ఉందండోయ్…!

Significance Of Rangoli : సంక్రాంతి నెల వచ్చిందంటే ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు, వాటిపై ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్ల మీద ముళ్లగోరింట, గుమ్మడిపూలు… ఇవీ పల్లెటూళ్లలో ప్రతి ఇంటా కనిపించే దృశ్యాలు. హేమంత రుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసమే మన పూర్వీకులు ముగ్గులను కనిపెట్టారని చెప్పాలి.


ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముగ్గుల గురించి ఇరుగు పొరుగు ఒకరితో ఒకరు చర్చించుకోవడం వల్ల ఇరుగుపొరుగు వారిమధ్య స్నేహం పెంపొందుతుంది. పూర్వులు పొయ్యిమీద ముగ్గు వేశాకే.. వంట చేసేవారు. తిరిగి భోజనాల తర్వాత మర్నాటికి పొయ్యిని ఆవుపేడతో అలికి మర్నాటికి సిద్ధం చేసేవారు.

గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. పెళ్లికాని అమ్మాయిలు గొబ్బెమ్మల చుట్టుూ తిరుగుతూ పాటలు పాడతారు. ఈ క్రమంలో ముగ్గు మధ్యలోని పెద్ద గొబ్బెమ్మను కృష్ణుడిగా, తక్కిన 8 గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడని, మిగతా గొబ్బెమ్మలూ 8 గ్రహాలకూ సంకేతమని చెబుతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని నమ్మకం. ఏ మహిళ అమ్మవారు, విఫ్ణువు ఆలయం ముందు ముగ్గు వేస్తుందో ఆమె సుమంగళిగా జీవిస్తుందని దేవీ భాగవతం చెబుతోంది. నిత్యం ఇంటిముందు, పెరటిలో తులసి వద్ద ముగ్గు వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించవని నమ్మకం.


ముగ్గు వేసే గీతలను బట్టి వారు.. ముగ్గువేసిన వారి స్వభావం ఎలా ఉంటుందో చెప్పొచ్చట. ముగ్గు కోసం సన్నగా గీతలు గీసేవారు.. పొదుపరులని, అందానికి ప్రాధాన్యత ఇస్తారని, లతలు, తీగలు, పద్మాలు, జంతువుల ముగ్గులు వేసేవారు స్నేహశీలురు, ప్రకృతి ప్రేమికులని, హాస్యచతురులని చెబుతారు. సూర్యుడు, చంద్రుడు, తామరపూలు తదితర ముగ్గులు వేస్తూ ఉండే వారయితే వారు సంప్రదాయాలను ఇష్టపడతారని, ఖగోళ శాస్త్రప్రేమికులనీ చెప్పవచ్చు.

ఇక.. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలనే దానికీ ఓ లెక్క ఉంది. పెళ్లి పందిరి దిగి, నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసేటప్పుడు వారి చుట్టూ లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేస్తారు. శివాలయాలలో, ఆలయం ముంగిట, శివార్చన సమయంలో 8 పలకల ముగ్గులో అష్టలింగ ముగ్గు వేస్తారు. అమ్మవారి ఆలయాలలో, విష్ణువు ఆలయాలలో అష్టదళ ముగ్గులు, శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున రథం ముగ్గు వేస్తారు.

నాగుల చవితి, నాగపంచమి, సుబ్బరాయ షష్ఠి సమయాలలో నాగులను లేదా జంట సర్పాలను సూచించే ముగ్గులు వేస్తారు. అమ్మవారి పూజలు చేసేటప్పుడు సాధారణంగా శ్రీచక్రాలకు ప్రతీకగా ఉండే ముగ్గు వేస్తారు. కొమురవెల్లి మల్లన్నకు ముగ్గులంటే ప్రీతి. అందుకే ఆయన సన్నిధిలో ముగ్గులు వేస్తామని మొక్కుకుంటారు. ఈ ముగ్గులను పట్నాలని పిలుస్తారు. పట్నాలంటే ఇష్టం కాబట్టి ఆయనకు పట్నాల మల్లన్న అని పేరు.

క్రీ.పూ. 8వ శతాబ్దంనుంచే ఇళ్ల ముందు ముగ్గులు వేసే సంప్రదాయం ఉంది. హరప్పా, మొహంజదారో, సింధునాగరకత కాలంలో సున్నం రాళ్లతో పనిముట్లను, పాత్రలను, ఆయుధాలను చేసుకునే క్రమంలో రాలిన పొడితో తాము నివసించే గోడలపైన చిత్రాలను, జంతువుల బొమ్మలను చిత్రించేవారు. బహుశా ముగ్గుకు తొలిరూపం అదేనేమో..!

ఛత్తీస్‌గఢ్‌ వాసులు ‘చావోక’ పేరుతో పండుగ వేళల్లో ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో బియ్యపు పిండితో మగ్గులు వేస్తుంటారు. మరాఠీలు మన మాదిరే.. పేడ కళ్లాపి చల్లి వాకిలి ముందు ముగ్గులు పెడతారు. కేరళ వాసులు ఓనం పండుగ వేళ.. పదిరోజులపాటు వాకిట్లో, వీధి అరుగులు మీద శంఖ చక్రాలతో కూడిన ముగ్గులు వేస్తారు. అసోం ప్రాంతంలో ‘మధుబని’ ముగ్గుల పేరిట ఇంటిగోడలని ఎర్రమట్టితో అలికి, వాటిపై పువ్వులు, లతలతో కూడిన ముగ్గులు పెడతారు. (శిల్పారామంలో కనిపిస్తాయి)

ముగ్గులోకి దింపడం, తలముగ్గుబుట్టలా నెరవడం అనే సామెతలూ మనకున్నాయి. మొత్తానికి వేల ఏళ్ల నాటి చరిత్ర మన తెలుగువారి అద్భుత కళారూపమని గర్విస్తూ.. రేపటి సంక్రాంతికి ఏం ముగ్గువేయాలో మందే ఆలోచించేద్దాం!

Related News

Kuber Favourite Zodiac: కుబేరుడికి ఇష్టమైన ఈ 3 రాశుల వారు లక్షాధికారులు కాబోతున్నారు

Budh Gochar in Kanya Rashi: రాబోయే 24 గంటల్లో కన్యాతో సహా 5 రాశులు ధనవంతులు కాబోతున్నారు

Ketu Transit 2024: అక్టోబర్ 10 వరకు ఈ రాశులపై సంపద వర్షం

Surya Ketu Yuti in kanya Rashi 2024: సూర్య గ్రహణానికి ముందే లంక గ్రహణ యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త

Vastu Tips for Negative Energy: ఈ ఉపాయాలు పాటిస్తే ఇంట్లో నుంచి గంటల్లోనే ప్రతి కూలతను దూరం చేసుకోవచ్చు

Shukra Gochar 2024: అక్టోబర్ 13 వరకు వీరికి తిరుగులేదు

Weekly Horoscope (22-28): సెప్టెంబర్ 22- 28 వరకు వారఫలాలు

Big Stories

×