EPAPER
Kirrak Couples Episode 1

Ambati Rayudu : ‘సిట్టింగ్’ కాకుండానే ‘వాకౌట్’ చేసిన రాయుడు..!

Ambati Rayudu : ‘సిట్టింగ్’ కాకుండానే ‘వాకౌట్’ చేసిన రాయుడు..!
AP Political news

Ambati Rayudu latest news(AP political news):

రాజకీయాలకు, క్రీడా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. మంచి క్రీడాకారులుగా రాణించి, జనం మనసును గెలిచిన ఎందరో క్రీడాకారులు గతంలో రాజకీయాల్లో ప్రవేశించి, జనబలంతో పార్లమెంటు సభ్యులుగా రాణించారు. రాణిస్తూనే ఉన్నారు. అటు.. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించి, యువత ఓట్లను రాబట్టుకునేందుకు వారి సేవలను వాడుకోవటం కొత్తవేం కాదు. అయితే.. ఇటీవలే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడి కథ మాత్రం వారం రోజుల్లోనే ఊహించని మలుపులు తిరిగి, అంతిమంగా ఆయనను రాజీనామాకు దారితీసింది.


కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పకముందు నుంచే అడపా దడపా ఏపీ సీఎం జగన్‌ను, ఆయన పాలనపై ప్రసంశలు కురిపిస్తూ వచ్చారు. పలుమార్లు నేరుగా కలిసి మాట్లాడారు కూడా. అయితే.. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్, టీడీపీకి చెందిన మరో కాపు నేత వంగవీటి రాధాకృష్ణ.. వైసీపీని, సీఎం జగన్‌ను టార్గెట్ చేయటంతో వారిని అడ్డుకోగల సమర్థ కాపు యువనేత ఎవరా అని ఆరా తీస్తున్న వైసీపీ నేతల దృష్టి.. క్రికెటర్‌గా క్రేజ్ ఉన్న, యువకుడైన, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడి మీద పడింది.

ఇతడకి పార్టీలో ఏదైనా పదవి ఇచ్చి తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రకాశం వరకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే.. కాపు యువత ఓట్లను రాబట్టుకోవటంతో బాటు ప్రత్యర్థులైన జనసేన, టీడీపీ కాపునేతలకు చెక్ పెట్టొచ్చని వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆంధ్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం.. ఆంధ్రా’ కార్యక్రమ పోస్టర్లలో సీఎం జగన్‌తో బాటు ఆయన ఫోటోలతో కూడిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే.. ఆ ఈవెంట్ ప్రారంభోత్సవం రోజు జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఆయన కనిపించలేదు. దీంతో మర్నాడు అన్ని పత్రికల్లో రాయుడు వైసీపీలో చేరటం లేదనే వార్తలు కూడా వచ్చాయి.


అయితే.. అనూహ్యంగా ఓ వారం రోజులకే గత డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో రాయుడు సీఎం జగన్ చేతుల మీదగా పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పుడూ.. ఆయనకు పొన్నూరు అసెంబ్లీ సీటు లేదా మరేదైనా పార్లమెంట్ టికెట్ ఇస్తారనే వార్తలూ వచ్చాయి. అటు రాయుడు కూడా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే.. ఇదే సమయంలో సీఎం జగన్ వచ్చే ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసుకునే పని పెట్టుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాయడు.. గుంటూరు లోక్‌సభ ఎంపీగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే.. దీనికి సీఎం నో చెప్పటంతో బాటు అక్కడి కొందరు నేతల వైఖరి కూడా అంబటి రాయుడిని నొప్పించినట్లు తెలుస్తోంది.

‘నేతలంతా వైసీపీకి రాజీనామా చేస్తుంటే.. నువ్వు అందులో చేరుతున్నావేంటి’ అంటూ ఆయన శ్రేయోభిలాషులు ఆయనకు చెప్పటం, మారిన రాజకీయ, సామాజిక సమీకరణాలను బట్టి వైసీపీలో తనకు భవిష్యత్ లేదని అంబటి రాయుడు భావించారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రపంచకప్ సందర్భంగా తనను ఎంపిక చేయకపోవడంతో నొచ్చుకున్న రాయుడు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినట్లుగానే వైసీపీకీ అలాగే గుడ్ బై చెప్పారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆత్మాభిమానం గల అంబటి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వైసీపీలో కొనసాగలేక కేవలం 9 రోజుల్లోనే నిష్ర్కమించాల్సి వచ్చిందని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే.. గుంటూరులో తాను పోటీ చేయటం లేదని గల్లా జయదేవ్ ఇప్పటికే స్పష్టం చేసినందున.. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు నుంచి గెలవటం సులభమనే అంచనాకు రావటంతోనే ఆయన కామ్‌గా పార్టీకి గుడ్ బై చెప్పారనే వార్తలు కూడా ఆయన నిష్క్రమణ వేళ వినిపిస్తున్నాయి. మొత్తానికి అంబటి రాయుడు మాత్రం ‘సిట్టింగ్’ కాకుండానే ‘వాకౌట్’ చేశాడని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

.

.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×