EPAPER

Middle East : మంటల్లో పశ్చిమాసియా..!

Middle East : మంటల్లో పశ్చిమాసియా..!
Middle East

Middle East : పశ్చిమాసియా రగులుతోంది. మిస్సైళ్లు, రాకెట్లు, డ్రోన్ల దాడులు గాజా నుంచి ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులతో తలపడుతున్న నేపథ్యంలో.. మూడు నెలలుగా సాగుతున్న ఘర్షణలు మరింత విస్తృతమయ్యే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు భయపడుతున్నారు. గాజా యుద్ధంతో హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని ఇజ్రాయెల్, దాని మద్దతుదారులు భావించారు. కానీ, ఈ పోరాటంలో వారు.. హమాస్, ఇరాన్‌లతో సంబంధాలు ఉన్న ఇతర సాయుధ మిలిటెంట్ గ్రూపుల నుంచి ఎదురవుతున్న ఊహించని దాడులనూ ఎదుర్కోవాల్సి వస్తోంది.


సాయుధ గ్రూపుల ఆజ్యం

పశ్చిమాసియాలోని సాయుధ గ్రూపులు అమెరికాకే కాదు.. ప్రపంచానికీ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాజాలో హమాస్‌, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, ఇరాక్-సిరియాల్లో చిన్నపాటి మిలీషీయాలు (ప్రైవేటు సైన్యం), యెమెన్ లోని హౌతీ గ్రూపులు పశ్చిమాసియా జ్వాలల్లో ఆజ్యం పోస్తున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడమే గాక.. ఆ దేశంలోకి చొచ్చుకుపోవడం ద్వారా హమాస్ యుద్ధానికి తెరతీసింది. హమాస్‌కు మద్దతుగా మిగిలిన సాయుధ గ్రూపులన్నీ అమెరికా, ఇజ్రాయెల్‌ను తమ దాడులతో కవ్విస్తుండటంతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ సాయుధ గ్రూపుల చరిత్ర ఏంటో ఓసారి అవలోకిద్దాం.


హమాస్
ఈ అతివాద ముస్లిం సంస్థ గాజా కేంద్రంగా 1987లో ఆవిర్భవించింది. ఇజ్రాయెల్ ఆక్రమణను నిరసిస్తూ పాలస్తీనా చేపట్టిన పోరాటాల్లో భాగస్వామి అయింది. 1920లలో ఈజిప్టులో ఆవిర్భవించిన, సున్నీల ప్రముఖ గ్రూపుల్లో ఒకటైన ముస్లిం బ్రదర్‌హుడ్‌తో దీనికి ముందునుంచే సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా హమాస్.. ఆ దేశ పౌరులు, సైనికులపై ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. 2007 పార్లమెంట్ ఎన్నికల్లో 44% ఓట్లను సాధించిన దరిమిలా గాజాను బలవంతంగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఖతర్, తుర్కియే సహా అరబ్, ముస్లిం దేశాల మద్దతు ఈ సంస్థకు ఉంది. సున్నీ ముస్లింల గ్రూపు అయినప్పటికీ.. ఇది ఇరాన్‌లోని షియా ముస్లింలు, ఇరాన్ మిత్రదేశాలకు సన్నిహితం కాగలిగింది.

హెజ్‌బొల్లా
షరియత్ పాలనే లక్ష్యంగా.. ఇరాన్ మద్దతుతో ఆవిర్భవించి, అత్యంత బలమైన సంస్థగా ఎదిగింది. సైనికపరంగా, సంస్థాగతంగా ఎంతో పటిష్ఠమైన షియైత్ ముస్లిం గ్రూప్ ఇది. ఇజ్రాయెల్ 1982లో లెబనాన్‌ను ముట్టడించిన నేపథ్యంలో హెజ్‌బొల్లా సాయుధ గ్రూపు మొలకెత్తింది. 1990లలో అమెరికాపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించింది. 1992లో లెబనాన్ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. లెబనాన్ సాయుధ బలగాలతో పోల్చితే హెజ్‌బొల్లా మిలటరీ విభాగమే బలమైనది. ఇజ్రాయెల్ సైనికులను అపహరించడం ద్వారా కవ్వింపులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్ దాడికి దిగటంతో, 2006లో దక్షిణ లెబనాన్, బీరూట్ కకావికలమయ్యాయి. గాజాతో తాజాయుద్ధం నేపథ్యంలో లెబనీస్‌ 2006 నాటి పరిస్థితులను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులపైకి వరుసగా రాకెట్లు, మిస్సైళ్లను ప్రయోగిస్తూనే ఉంది. బీరూట్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో.. అక్కడ ఆశ్రయం పొందుతున్న హమాస్ కీలక నేత సాలేహ్ అరౌరీ హతమవగా, అతడి హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఈ సంస్థ బిజీగా ఉంది.

హౌతీలు
యెమెన్ కేంద్రంగా హౌతీ సాయుధ గ్రూపు కార్యకలాపాలు సాగిస్తోంది. చమురు, ఇతర వ్యాపారాలకు కీలకమైన షిప్పింగ్ రూట్లు యెమెన్ గుండానే సాగుతాయి. గాజాతో యుద్ధం కారణంగా వాణిజ్యనౌకలపై ప్రస్తుతం హౌతీలు రాకెట్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నారు. వీరికి భయపడి, కొన్ని వ్యాపార సంస్థలు తమ నౌకామార్గాన్ని మళ్లించుకుంటున్నాయి. దీనివల్ల ప్రపంచంపై ఆర్థికంగా పెనుభారం పడుతోంది. అన్సార్ అల్లా (అరబిక్‌లో.. దైవ సహాయకుడు) పేరిట 1990లలో హౌతీ ఉద్యమం ఆరంభమైంది. జైదీ షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ సంస్థ క్రమేపీ రాజకీయ, సైనిక శక్తిగా ఎదిగింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హౌతీలు ఎక్కువగా యెమెన్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. హౌతీలను తుదముట్టించేందుకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2015లో ప్రయత్నించి విఫలమయ్యాయి. ఆ క్రమంలో హౌతీలు ఇరాన్‌కు దగ్గరయ్యారు.

సిరియా, ఇరాక్ మిలీషియాలు
ఇరాక్, సిరియా యుద్ధాల సమయంలో ఇరాన్ మద్దతున్న చిన్న మిలిటెంట్ గ్రూపులు అమెరికా, మిత్రదేశాలపై దాడులు చేశాయి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల ఏరివేత కోసం అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై అవి అడపాదడపా విరుచుకుపడేవి. ఆ రెండు దేశాల్లో మిలీషియా గ్రూపులను అణచివేసేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని ఇరాన్ చెబుతూ వస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా.. ఇరాన్ మద్దతు ఉన్న ఓ మిలీషియా సంస్థ గురువారం బాగ్దాద్‌లో దాడికి యత్నించగా.. అమెరికా తిప్పికొట్టింది. అందులో ఆ మిలీషియా కీలక కమాండర్ ఒకరు హతమయ్యారు.

ఐఎస్, అల్ కాయిదా
హమాస్ దాడులతో ఆరంభమైన ఇజ్రాయెల్ యుద్ధం, ఈ పోరుకు అమెరికా మద్దతుగా నిలవటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం ఉగ్రవాద సంస్థలన్నీ ఒక్కటవుతున్నాయి. పశ్చిమదేశాలు, ఇస్లామేతర దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తూ.. అంతిమ, దీర్ఘకాల యుద్ధానికి పిలుపునిస్తున్నాయి. గాజా ప్రజల ప్రతీకారేచ్ఛ తీర్చేలా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు దాడులకు దిగాలంటూ ఐఎస్ అధికార ప్రతినిధి అబు హద్‌హైఫా అల్-అన్సర్ పిలుపునిచ్చాడు. యూదులు, క్రైస్తవులు, వారి మిత్రులపై తిరగబడాలని కోరాడు. సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అతని ప్రసంగాన్ని రిపోర్టు చేసింది. గత వారం చోటు చేసుకున్న ఘటనలను బట్టి.. మరోమారు పశ్చిమాసియా మంటలు ప్రపంచాన్ని తగలబెట్టేలా కనిపిస్తున్నాయి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×