EPAPER
Kirrak Couples Episode 1

Rudraksha : పరమేశ్వర స్వరూపం .. రుద్రాక్ష

Rudraksha : పరమేశ్వర స్వరూపం .. రుద్రాక్ష
Rudraksha

Rudraksha : సనాతన భారతీయ సంప్రదాయంలో రుద్రాక్షలకు విశేష ప్రాధాన్యం ఉంది. రుద్ర అనగా పరమేశ్వరుడు, అక్ష అనగా నేత్రము. పరమేశ్వరుని కన్నుగా చెప్పబడే రుద్రాక్ష ధారణ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలే గాక గ్రహ సంబంధిత బాధలూ తొలగిపోతాయి. ఏ రోజు చేసిన పాపాలు రోజే తొలగిపోతుంది.


పూర్వం శ్రీశైల క్షేత్రానికి తూర్పున ఉన్న త్రిపురాంతకం (ప్రకాశం జిల్లాలో ఉంది) క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులతో యుద్ధం చేశాడు. ఈ పోరాటంలో ఆయన వారిని భస్మం చేశాడు. కానీ.. పరమ దయాళువు అయిన పరమేశ్వరుడు.. తర్వాత వారిని తలచుకున్నప్పుడు అనుకోకుండా ఆయన కళ్లలోంచి నీళ్లు వచ్చాయట. అవే భూమ్మీద పడి.. రుద్రాక్ష వృక్షాలుగా మారాయని పురాణ గాధ.

పండితుల లెక్క ప్రకారం.. 21 ముఖాల రుద్రాలున్నాయి. కానీ వీటిలో మనకు కేవలం 14 రకాలు మాత్రమే లభిస్తున్నాయి. రుద్రాక్ష చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని తెల్లని పూలు, ఆకుల కంటే చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పుష్పిస్తుంది. పచ్చిగా ఉండగా కోడిగుడ్డు ఆకారంలో ఉండే రుద్రాక్ష.. క్రమంగా గుండ్రంగా మారి, ఎండిపోయి తొడిమ నుంచి విడిపోయి, కింద రాలిపోతుంది. దీనిలో నిలువునా సన్నని రంధ్రం ఏర్పడుతుంది. రుద్రాక్షలు తేనె, నలుపు, తెలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో లభ్యమవుతాయి.


రుద్రాక్షల ఆకృతిని బట్టి వాటిని పలు రకాలుగా విభజించారు. వీటిలో ఏకముఖి రుద్రాక్షను సాక్షాత్తూ పరమేశ్వరుని నేత్రంగా భావిస్తారు. ఇది అత్యంత శ్రేష్ఠమైనది. దీనిని ధరించేవారికి గొప్ప జ్ఞానం, సంపద, మేధోవికాసం సిద్ధిస్తాయి. రెండు ముఖాల ద్విముఖ రుద్రాక్ష అర్థనారీశ్వర తత్వానికి ప్రతీక. దీనిని ధరించేవారి కుండలినీ శక్తి ఉత్తేజితమై, గొప్ప ఆధ్యాత్మిక సాధకులుగా మారతారు. మూడు ముఖాల త్రిముఖ రుద్రాక్షను అగ్ని, త్రిమూర్తుల స్వరూపంగా చెబుతారు. దీని ధారణతో మంచి ఆరోగ్యం, అభివృద్ధి సిద్ధిస్తాయి.

నాలుగు ముఖాల చతుర్ముఖ రుద్రాక్ష.. బ్రహ్మ, వేదములను సూచిస్తుంది. దీనిని కాచిన ఆవు పాలలో వేసి తాగితే అనేక మానసిక రోగాలు, ఆందోళనలు తొలగిపోతాయి. విద్యార్థుల బుద్ది వికసిస్తుంది. ఐదు ముఖాల పంచముఖ రుద్రాక్ష పంచభూతాలకు గుర్తు. ఇది విరివిగా లభిస్తుంది. గుండె జబ్బులున్నవారు దీనిని ధరించటం మంచిది. ఇది శత్రువులను జయించే శక్తినిస్తుంది. పాముకాటు నుంచి రక్షణనిస్తుంది. ఆరు ముఖాల షణ్ముఖ రుద్రాక్ష సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీక. అధిక రక్తపోటు, మానసిక సమస్యల బాధితులు దీనిని ధరిస్తే సమస్య దూరమవుతుంది.

ఏడు ముఖాల సప్తముఖ రుద్రాక్ష కామధేనువుకు గుర్తు. దీనివల్ల కోరిన కోర్కెలు నెరవేరటమే గాక అకాల మరణం దరిచేరదు. ఎనిమిది ముఖాల అష్టముఖ రుద్రాక్ష సాక్షాత్తూ గణపతి స్వరూపం. దీనిని ధరిస్తే.. విఘ్నాలు తొలగటంతో బాటు ఆధ్యాత్మిక సాధనా శక్తి చేకూరుతుంది. తొమ్మిది ముఖాల రుద్రాక్ష సాక్షాత్తూ జనార్దనుడి రూపం. దీనిని ధరించిన వారికి ఏకంగా అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. మహిళలకు దీనిని ఎక్కువగా సూచిస్తారు.

పదకొండు ముఖాల ఏకాదశ ముఖ రుద్రాక్ష.. పరమశివుడి 11 రూపాలకు ప్రతీక. ఇది దుష్టశక్తులను దరిచేరనీయదు. ఇక.. 12 ముఖాల ద్వాదశముఖ రుద్రాక్ష కీర్తి ప్రతిష్టలను, 13 ముఖాల రుద్రాక్ష ఆనందాన్ని ఇస్తాయి. ఇక..19 ముఖాల రుద్రాక్షను విష్ణువుకు, 20 ముఖాల రుద్రాక్షను బ్రహ్మకు ప్రతీకగా చెబుతారు. రుద్రాక్షల్లో చివరిదైన 21 ముఖాల రుద్రాక్ష కుబేరుడికి ప్రతీక. ఈ రుద్రాక్షలతో తయారైన మాలను ‘ఇంద్రమాల’ అంటారు. దీనిని ధరించిన వాడికి ఇక అపజయం అనేదే ఉండదట.

రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. అయితే.. శ్రేష్టమైన రుద్రాక్షను ఎంచుకోవాలి. పుష్యమి నక్షత్రం లేదా సోమవారం నాడు, సుముహూర్తంలో రుద్రాక్షను శుద్ధి చేసి, శివ పూజ చేసి ఆ తర్వాతే దానిని ధరించాలి. రుద్రాక్ష ధరించే ముందు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా(వీలుంటే మహాశివరాత్రి రోజున) ఆ మాలకు ఏకాదశ రుద్రాభిషేకం చేయడం శుభకరం.

ఒకరి రుద్రాక్షను మరొకరు ధరించకూడదు. రుద్రాక్షను ఉంగరంలో ధరించకూడదు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతో కూర్చి.. మాలగా ధరించాలి. దండలో.. 108/54/27 రుద్రాక్షలను వాడాలి. దీనిని జపమాలగానూ వాడొచ్చు. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం.

ఇక.. వ్యక్తిగత నియమాల విషయానికికొస్తే.. రుద్రాక్షలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మైల సమయంలో/ మహిళలు రుతు సమయంలో దీనిని ధరించకూడదు. రుద్రాక్ష మాలను ధరించి నిద్ర పోరాదు. శృంగారంలో పాల్గొనకూడదు. రుద్రాక్ష మాలను ధరించి స్మశానానికి వెళ్ళకూడదు. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఏదైనా నియమాన్ని తెలియక ఉల్లంఘిస్తే.. మెడలోని మాలను ఆవుపాలతో శుద్ధి చేసి, 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని(ఓం నమ:శివాయ:) జపించిన తర్వాతే తిరిగి ధరించాలి.

Related News

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Big Stories

×