EPAPER
Kirrak Couples Episode 1

White House : వావ్.. అనిపించే వైట్‌హౌస్ విశేషాలు..!

White House : వావ్.. అనిపించే వైట్‌హౌస్ విశేషాలు..!
White house

White House : ‘1600, పెన్సిల్వేనియా అవెన్యూ, వాషింగ్టన్‌ డీసీ’ అనే అడ్రస్ గురించి ఎప్పుడైనా విన్నారా?.. వినలేదని అనిపిస్తోంది కదా..! అయితే.. మీరు పొరబడ్డట్టే. మీరు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దీని గురించి వినే ఉంటారు. మీరే కాదు.. ఈ భూమ్మీది మానవుల్లో నూటికి 90 శాతం మందికి ఈ అడ్రస్ తెలుసు. ఇంతకీ అదేం అడ్రసో అనుకుంటున్నారా? అది.. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్ హౌస్’. అబ్బురపరచే ఆ భవనపు అపురూపమైన ముచ్చట్లు మీకోసం..


‘ఇల్లు కట్టింది ఒకడైతే.. కాపురముంటున్నది మరెవడో’ అన్నట్లు వైట్‌హౌస్ నిర్మాణానికి నిధులు, ప్లాన్ అన్నీ రెడీ చేసింది.. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్. 1792లో మొదలైన ఈ భవన నిర్మాణం.. 1800 నాటికి పూర్తయింది. అయితే… అంతకు మూడేళ్ల ముందే జార్జి వాషింగ్టన్‌ పదవీ కాలం ముగియటం, 1799లో ఆయన కన్ను మూయటం జరిగిపోయాయి. ఆ విధంగా.. ఇప్పటి వరకు వైట్‌హౌస్‌లో కాలుపెట్టని ఏకైక అమెరికా అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్‌ చరిత్రలో మిగిలిపోయారు.

వైట్‌హౌస్‌ను తొలిరోజుల్లో ‘ప్రెసిడెంట్స్‌ హౌస్‌’ అనేవారు. మరికొన్నాళ్ల తర్వాత ‘ఎగ్జిక్యూటివ్‌ మాన్సన్‌’ అనేవారు. అయితే.. దీనికో పర్మినెంట్ పేరు పెడదామనుకున్నప్పుడు.. ‘మల్లెపువ్వులాంటి ఈ భవనానికి వైట్ హౌస్ అనేదే సరైన పేరు’ అని నాటి ప్రెసిడెంట్‌ థియోడర్‌ రూజ్వెల్ట్‌కు అనిపించింది. అలా 1901 నుంచి దీనిని ‘వైట్‌హౌస్‌’ అంటున్నారు. ఎంతో పేరున్న ఈ భవనాన్ని డిజైన్ చేసింది అమెరికన్ కాదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరిష్‌ జాతీయుడైన జేమ్స్‌ హోబన్‌ అనే ఆర్కిటెక్ట్‌ దీనిని డిజైన్ చేశారు.


శ్వేతసౌధం అందుబాటులోకి వచ్చిన 91 ఏళ్ల వరకు దానికి కరెంటు సౌకర్యం లేదు. 1891లో తొలిసారి దీనికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అయితే.. స్విచ్ వేస్తే ‘కరెంటు షాక్ కొట్టి చనిపోతామేమో’ అనే భయంతో నాటి అధ్యక్షుడు.. బెంజిమన్ హ్యారిసన్, ఆయన భార్య ఆ భవనంలో ఉన్నన్ని రోజులూ స్విచ్‌లను ముట్టనేలేదట.

ఇప్పటివరకు ఇద్దరు అమెరికా అధ్యక్షులు ఈ భవనంలోనే కన్నుమూశారు. వారే… విలియమ్‌ హెన్రీ హ్యారిసన్‌, జచారీ టేలర్‌. ఇక… ముగ్గురు ‘ప్రథమ మహిళలు’ (అధ్యక్షుల సతీమణులు) ఇక్కడ ఉండగానే చనిపోయారు. వీరుగాక.. సుమారు 10 మంది ఉన్నతాధికారులు ఈ భవనంలో విధులు నిర్వహిస్తూనే కన్నుమూశారు.

వైట్‌హౌస్ ఓ దయ్యాల కొంప అనే వదంతులు ఒకప్పుడు గట్టిగానే వినిపించాయి. ఈ ‘ప్రతికూల శక్తుల’ చర్యలను తాము కళ్లారా చూశామని పలువురు ప్రథమ మహిళలు భయపడుతూ చెప్పారు. ఇక.. గొప్ప నేతగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తాను అతిథిగా ఆ భవనంలో బస చేసిన రోజు.. అబ్రహం లింకన్‌ ఆత్మను చూశానని చెప్పాడు.

ముట్టికుంటే మాసిపోయే ఈ శ్వేత సౌధం ఒకసారి మంటల్లో కాలిపోయి.. నల్లని మసిబొగ్గుగా మారింది. ఔను! 1814 యుద్ధంలో బ్రిటిష్‌ సైనికులు ఈ భవనానికి నిప్పంటించారు. దీంతో అధ్యక్షుడు ఆ భవనాన్ని ఖాళీ చేసి పోయాడు. తర్వాత దీనిని బాగుచేయించినా.. 1952లో దాదాపు మొత్తం భవనాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడున్నది నాటి వైట్‌హౌస్‌‌కు నెక్స్ వెర్షన్ అన్నమాట.!

వైట్‌హౌస్‌లో ఈస్ట్‌ వింగ్‌, వెస్ట్‌ వింగ్‌ అనే రెండు భాగాలున్నాయి. అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలన్నీ ‘వెస్ట్‌ వింగ్‌’లో జరుగుతాయి. వెస్ట్‌వింగ్‌లోని కేబినెట్‌ రూమ్‌‌లోనే అధ్యక్షుడు తన మంత్రులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే అధ్యక్షుడు కూర్చొనే రూమ్ నలుచదరంగా గాక.. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందుకే దీనిని ఓవెల్ ఆఫీస్ అంటారు. అమెరికా తొలి రాజధానిగా ఉన్న ఫిలడెల్ఫియాలో నాటి తొలి అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్‌ అధికార నివాసం ఈ ఆకారంలోనే ఉండేదనీ, దాని ప్రకారమే ఇక్కడి గదినీ రూపొందించారని చెబుతారు.

వైట్‌హౌస్‌లో టెన్నిస్‌ కోర్ట్‌, సినిమా థియేటర్‌, బిలియర్డ్స్‌ రూమ్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, జాగింగ్‌ ట్రాక్‌, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, విశాలమైన పచ్చిక మైదానం… ఇలా ఎన్నో ఉన్నాయి. అయినా ఇందులో ఉండటం ‘ఒంటరి బతుకే’అని పలువురు అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు వాపోయేవారు. నాటి అధ్యక్షుడు హెన్రీ ట్రూమన్ కుమార్తె జూలీ శ్వేతసౌధాన్ని ‘ఇట్స్ గ్రేట్‌ వైట్‌ జైల్‌’ (ఇదో అందమైన జైలు) అంటుండేవారు. ‘భద్రతా కారణాలతో పిల్లలు కూడా కనీసం తలుపులు, కిటికీలు తీసుకోలేరు. ఎప్పుడూ నిఘా తప్పదు. ఇందులో ఉండటమంటే ఒంటరి తనాన్ని గొప్పగా అనుభవించటమే’ అని మిషెల్లీ ఒబామా తన స్వీయ జీవిత చరిత్రలో చెప్పుకొని వాపోయారు.

అమెరికా అధ్యక్షుల జీవిత చరిత్రలతోపాటు కల్పిత కథలతో పదులకొద్దీ సినిమాలు వచ్చాయి. అందులో బాగా ప్రసిద్ధి చెందిన సినిమా… ‘లింకన్‌’. దీనిని స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించారు. ఇక… అచ్చంగా వైట్‌హౌస్‌ నేపథ్యంలో వచ్చిన సినిమాలూ చాలానే ఉన్నాయి. అందులో ‘వైట్‌ హౌస్‌ డౌన్‌’ సూపర్‌ హిట్‌. వైట్‌హౌస్‌ సందర్శనకు వచ్చిన ఒక పోలీస్‌… దుండగుల దాడి నుంచి అధ్యక్ష భవనాన్ని కాపాడటమే ఈ చిత్ర ఇతివృత్తం.

వైట్‌హౌస్‌ ముందున్న సువిశాలమైన ‘ప్రెసిడెంట్‌ పార్క్‌’ నిత్యం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. వైట్‌హౌస్‌ ముందు నిల్చుని ఫొటోలు దిగడం ఓ సరదా. ఇక… నిరసనలకూ వైట్‌హౌస్‌ కేంద్రంగా మారుతుంటుంది. వైట్‌హౌస్‌ ముందు రెండేళ్లపాటు జరిగిన నిరసన ఫలితంగానే అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఇక… నల్లజాతీయుడైన జార్జిఫ్లాయిడ్‌ కాల్చివేత సమయంలో వైట్‌హౌస్‌ ఆవరణ మొత్తం నిరసనలతో దద్దరిల్లింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడినంత పని చేశారు. అప్పటి నుంచి భారీ బారికేడ్లు, కంచెలతో భద్రత పెంచారు.

అధ్యక్ష భవనంలో మరో ముఖ్యమైన రూమ్.. సిట్యుయేషన్ రూమ్. అధ్యక్షుడు బయటి ప్రపంచంలో జరిగే ప్రధాన ఆపరేషన్లను, యుద్ధ సన్నివేశాలను ఇక్కడి నుంచే చూస్తాడు. ఈ రూమ్‌లోని సిబ్బంది 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. లాడెన్ చివరి క్షణాలను ఒబాబా కూడా తన బృందంతో ఇక్కడి నుంచే చూశాడు.

పేరులో ‘వైట్’ ఉన్న ఈ భవన నిర్మాణానికి నల్లజాతి బానిసలే రాళ్లెత్తారు. ‘బానిసలు కట్టిన భవంతిలో ఉంటున్నామనే సంగతి తలచుకుంటే మనసు కలుక్కుమంటుంది’ అని ఒబామా సతీమణి మిషెల్లీ కూడా అప్పట్లో మీడియాతో అనేశారు. వైట్‌హౌస్‌ రికార్డులను బట్టి.. దీని నిర్మాణ కాలంలో ఇటుకల తయారీ, రాళ్లు కొట్టే పని, కార్పెంటర్లుగా నల్లజాతి బానిసలు పనిచేశారు. అప్పట్లో వారిని ఔట్ సోర్స్ విధానంలో నియమించుకున్నారట. .

వైట్‌హౌస్‌లోని బేస్‌మెంట్‌‌లో ఓ మినీ షాపింగ్‌ మాల్‌ వంటి ఏర్పాటు ఉంది. సిబ్బంది తమకు అవసరమైన వస్తువులన్నీ అక్కడే కొనుక్కుంటారు. వైద్యం నుంచి అతిథులకిచ్చే బొకే రెడీ చేసే ఫ్లవరిస్ట్‌ వరకు అందరూ లోపలే ఉంటారు. అలాగని అధ్యక్షుడికి అన్నీ ఫ్రీగా రావు. తమ కుటుంబపు తిండి ఖర్చు, బట్టలు ఉతికి ఇస్త్రీ చేసిన బిల్లులు, మేకప్ వంటివి వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది.

అధ్యక్షులుగా ఎన్నికైన వారు అనేక పెంపుడు జంతువులను ఇక్కడ పెంచారట. ఈ జంతువుల జాబితాలో జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌ ఓ మొసలిని పెంచుకున్నారట! మార్టిన్‌ వాన్‌ బ్యూరెన్‌ తనకు ఒమన్‌ సుల్తాన్‌ బహూకరించిన రెండు పులి పిల్లలను కొన్నాళ్లపాటు పెంచుకున్నారు. అలాగే.. అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వైట్‌హౌస్‌లోనూ రెండు సొరంగాలు, ఒక బంకర్ నిర్మించారు. గతంలో నల్లజాతీయుడి కాల్చివేతకు నిరసనగా ఆందోళనకారులు వైట్‌హౌస్‌ ముట్టడి చేసినప్పుడు ట్రంప్‌ ఇదే బంకర్‌లో సమయం గడిపారట.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×