EPAPER
Kirrak Couples Episode 1

Bharat Ratna Award : భారతరత్న.. ఈ పురస్కారానికి 70 ఏళ్లు..

Bharat Ratna Award : భారతరత్న.. ఈ పురస్కారానికి 70 ఏళ్లు..


Bharat Ratna Award : మనదేశంలో ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత స్థాయి పౌర పురస్కారం..భారతరత్న. 1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డును ప్రారంభించారు. ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలు దీనిని అందుకున్నారు.


కుల, మత, వర్గ, వర్ణ, విద్య తదితర అనేక వ్యత్యాసాలకు అతీతంగా ఈ పురస్కారాన్ని అందిస్తారు. పద్మ అవార్డులకు భిన్నంగా భారతరత్న పురస్కారానికి వ్యక్తుల ఎంపిక జరుగుతుంది. భారతరత్న పురస్కారానికి అర్హులైన వక్తులను ప్రధానమంత్రే నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఈ అవార్డునిస్తారు. అలాగే.. ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన కూడా ఏమీలేదు. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (తొలి 6 స్థానాలు… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి).

ఈ పురస్కార స్వీకర్తలకు ఒక సర్టిఫికెట్, రావి ఆకులను పోలిన పతకాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. దానిపై ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు ఉంటుంది. కింద హిందీలో భారత రత్న అని రాసి కనిపిస్తుంది. ఆ పతకం అంచుల్లో కూడా ప్లాటినం లైనింగ్ కూడా ఉంటుంది. రెండో వైపు అశోక స్తంభం ముద్ర కనిపిస్తుంది. దాని కింద దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది.


ఈ అవార్డు కింద ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. వీరికి ఉచిత రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం, జాతీయ, స్వరాష్ట్రంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం, ప్రోటోకాల్‌ మర్యాద ఉంటాయి. అయితే, వీరు తమ పేరుకు ముందు ‘భారతరత్న’ అని బహిరంగంగా రాసుకొని, ప్రదర్శించ కూడదు. కానీ.. తమ లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డుల్లో ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు.

ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డునివ్వగా, వీరిలో విదేశీయులైన సరిహద్దు గాంధీగా పేరున్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా కూడా ఉన్నారు. అయితే.. మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని నిలిపివేసింది. 2013లో తొలిసారి క్రీడాకారులకూ దీనిని ఇవ్వాలని నిర్ణయించటమే గాక.. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఇదీ జాబితా!
ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ఈ అవార్డును ఇచ్చారు. 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డా.సి.వి.రామన్, 1955లో డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ,1957లో గోవింద్ వల్లభ్ పంత్, 1958లో ధొండొ కేశవ కార్వే, 1961లో డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్, 1962లో డా. రాజేంద్ర ప్రసాద్, 1963లో డా. జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్ కానే, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం), 1971లో ఇందిరాగాంధీ, 1975లో వీ.వీ.గిరి, 1976లో కామరాజ్ నాడార్ (మరణానంతరం), 1980లో మదర్ థెరీసా, 1983లో ఆచార్య వినోబా భావే (మరణానంతరం), 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 1988లో ఎంజీ రామచంద్రన్ (మరణానంతరం), 1990లో బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం), నెల్సన్ మండేలా, 1991లో రాజీవ్ గాంధీ (మరణానంతరం), సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం), మొరార్జీ దేశాయి, 1992లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం), జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే, 1997లో ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ (మరణానంతరం), 1998లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, సి.సుబ్రమణ్యం, జయప్రకాశ్ నారాయణ్, 1999లో రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాథ్ బొర్దొలాయి, 2001లో లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్, 2008లో భీమ్ సేన్ జోషి, 2014లో సచిన్ టెండూల్కర్, సి.ఎన్.ఆర్.రావు, 2015లో మదన్ మోహన్ మాలవ్యా, అటల్ బిహారీ వాజపేయి, 2019లో నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

వివాదాలు..
అలాగే..1992లో సుభాష్ చంద్రబోస్‌కు ఈ అవార్డును ప్రకటించినా.. కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆయన మృతిని కేంద్రం అధికారికంగా ప్రకటించకుండా మరణానంతర అవార్డును ప్రకటించటంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం దుమారం లేపింది. అటు.. అవార్డును స్వీకరించేందుకు బోస్ కుటుంబసభ్యులు నిరాకరించటంతో కేంద్రం ఆ అవార్డును వెనక్కి తీసుకుంది.

1977లో నాటి ఇందిర ప్రభుత్వం పూర్వ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన కామ‌రాజ్‌ నాడార్‌కు, 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం.. సినీ న‌టుడు, నాటి త‌మిళ‌నాడు సీఎం ఎంజీఆర్‌కు ఈ అవార్డును ఇవ్వటం.. కేవలం తమిళ ఓట్ల కోసమేనే ప్రచారం సాగింది.

అలాగే ఈ అవార్డు కోసం.. పండిట్ ర‌విశంక‌ర్ పైర‌వీ చేశాడ‌నీ, దళిత ఓట్ల కోసమే నాటి ప్రధాని వీపీ సింగ్.. డా. అంబేద్కర్‌కు ఈ పురస్కారం ప్రకటించారనే మాటా వినిపించింది. 1946లో మృతి చెందిన మద‌న్ మోహ‌న్ మాల‌వ్యాకు 2015లో మోదీ సర్కారు ఈ పురస్కారం ఇవ్వటం మీదా వివాదం రాజుకుంది.

ఇలాంటి పౌర పురస్కారాల విషయంలో సాధారణంగానే ఏకాభిప్రాయం ఎన్నడూ సాధ్యం కాదు. ఇక.. ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో ఈ పురస్కారంపై విమర్శలు రావటంలో పెద్ద ఆశ్చర్యమూ లేదు. అయితే.. మనం ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయం మేరకు అందించే ఈ అవార్డును మనమంతా గౌరవించటమే మనం దానికి ఇచ్చే నిజమైన గౌరవం.

Related News

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Big Stories

×