EPAPER

Congress : కాంగ్రెస్ హ‌స్తం గుర్తు వెన‌క కంచి ప‌ర‌మాచార్య‌…!

Congress : కాంగ్రెస్ హ‌స్తం గుర్తు వెన‌క కంచి ప‌ర‌మాచార్య‌…!
Congress news today

Congress news today(Latest telugu news):

కాంగ్రెస్ పార్టీ గుర్తు హ‌స్తం అని ఎవ‌రైనా చెబుతారు. కానీ.. పార్టీ ఆరంభం నుంచి దీని గుర్తు అది కాదు. దీనికంటే ముందు ఆ పార్టీ వేరే గుర్తుల‌ మీద ఎన్నిక‌ల్లో పోటీచేసింద‌నే విష‌యం చాలామందికి తెలియ‌దు. నేటి 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ పార్టీ గుర్తుల విశేషాల మీద ఓ లుక్కేద్దాం.


దేశంలో 1952లో తొలిసారిగా జరిగిన తొలి సాధార‌ణ‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుర్తు కాడెడ్లు. ఈ గుర్తుతోనే దేశమంతా ఎన్నికల బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే విజయ దుందుభి మోగించింది. నెహ్రూజీ, లాల్ బ‌హుదూర్ శాస్త్రి త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన ఇందిరా గాంధీ 1975లో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన త‌ర్వాత తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీంతో 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇందిర సైతం రాయబరేలీలో జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. 1977‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. బ్రహ్మానందరెడ్డి గెలిచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు.


ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు. దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. ‘ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర’ అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు.

కాంగ్రెస్(ఐ) ఏర్పాటు
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు. అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన ‘ఆవు – దూడ’ చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అయితే..పార్టీలో అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున ‘ఆవు, దూడ’ గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తు తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎన్నికల సంఘం అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది.

గందరగోళానికి తెరదించిన పీవీ
కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘ఆవు, దూడ’ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని ఈసీ సూచించింది. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.

latest news on congress party

ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఆమెకి బూటాసింగ్ కాల్ చేశారు. లైన్లన్నీ అస్పష్టంగా ఉండ‌టంతో బూటాసింగ్ హాత్ (హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. అయినా ఆయ‌న ఏదో చెబుతున్న‌ట్లు అనిపించి, రిసీవ‌ర్‌ను ప‌క్క‌నే ఉన్న పీవీ న‌ర‌సింహ‌రావుకి ఇచ్చారు.

ఇదంతా హాథీ, హాత్ అనే పదాల మధ్య వ‌చ్చిన‌ గందరగోళమ‌ని బహు భాషా కోవిదుడైన పీవీ వెంటనే విషయం అర్థం చేసుకుని ”బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా”(బూటాసింగ్ గారూ.. పంజా(చెయ్యి) అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ”ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి” అని చెప్తారు.

నేతల్లో అయిష్టత..
ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఉంది, ఇదేం గుర్తు? అని చాలామంది నేత‌లు ఈ గుర్తు వ‌ద్ద‌న్నా.. ఇందిర స‌రేన‌న‌టంతో ఆ గుర్తునే ఈసీకి పంపారు. అప్ప‌టివ‌ర‌కు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి. కొత్త గుర్తుతో ఈ చాన్స్ వారికి లేకుండా పోయింద‌ని మ‌రికొంద‌రు కాంగ్రెస్‌ నేత‌లు సంతోషించారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను ప్ర‌ముఖ పాత్రికేయుడు రషీద్ కిద్వాయి తన ’24 అక్బర్ రోడ్’ పుస్తకంలో రాసుకొచ్చారు.

అయితే.. దీనిపై మ‌రో ఆస‌క్తిక‌ర క‌థ‌నం కూడా ఉంది. పార్టీ నేత‌ల తిరుగుబాటుతో త‌న వ‌ర్గానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించే క్రమంలో ఇందిర.. త‌మిళ నాడు ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఈ స‌మ‌యంలోనే కంచి పీఠాధిప‌తి శ్రీ చంద్ర‌శేఖ‌రేంద్ర స్వామి ద‌ర్శ‌నం తీసుకుని కొత్త గుర్తుపై స‌ల‌హా కోరాల‌ని కొంద‌రు నేత‌లు ఆమెకు సూచించారు.

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు అంద‌రూ క‌లిసి కంచి పీఠానికి వెళ్లారు. న‌డిచే దైవంగా పేరున్న స్వామివారు అప్పుడు కౌపీనం (చిన్న‌ గోచీ) ధ‌రించి బావి వ‌ద్ద స్నానానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఇందిర‌, నేత‌లంతా స్వామికి దూరంగా నిల‌బ‌డి ఉండ‌గా, స్వామి స‌హాయ‌కుడు వెళ్లి పార్టీ గుర్తుపై మీ మాట కోసం వ‌చ్చార‌ని అడ‌గ‌గా స్వామి దూరం నుంచే చేయెత్తి ఆశీర్వ‌దించార‌ట‌. అప్ప‌టికే ఈసీ ప్ర‌తిపాదించిన గుర్తుల్లో హ‌స్తం ఉండ‌టంతో నేత‌లంతా సంతోషంగా స్వామికి న‌మ‌స్క‌రించి తిరిగొచ్చార‌ట‌. మ‌ర్నాడు విజ‌య‌వాడ‌లో బూటాసింగ్‌, పీవీ, ఇందిర క‌ల‌సి ఓ మాట అనుకుని చివ‌ర‌కు అదే గుర్తును ఫైన‌ల్ చేశార‌ట‌. ప్ర‌ముఖ‌ జ‌ర్న‌లిస్టు నీలంరాజు వెంక‌ట శేష‌య్య రాసిన న‌డిచేదైవం అనే పుస్త‌కంలో ఈ వివరాల‌ను చ‌క్కగా వివ‌రించారు.

కాకా ఇల్లే.. ఇందిర పార్టీ ఆఫీసు

latest congress news in india

ఇందిర గాంధీ ఏర్పర్చుకున్న కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్ సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు.

అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది. అక్కడ ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)’ అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారింది.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×