EPAPER
Kirrak Couples Episode 1

Dwadasa Aditya Temples : ద్వాదశ ఆదిత్య మందిరాలు ఇవే..!

Dwadasa Aditya Temples : ద్వాదశ ఆదిత్య మందిరాలు ఇవే..!
Dwadasa Aditya Temples

Dwadasa Aditya Temples : మన దేశంలో అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో ప్రత్యక్ష నారాయణునిగా పూజలందుకునే సూర్యుడి పేరుమీద ద్వాదశ ఆదిత్య క్షేత్రాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. ఉత్తర ప్రదేశ్‌లోని సుప్రసిద్ధమైన వారణాసి క్షేత్రంలో ఈ 12 సూర్యాలయాలు ఉన్నాయి. అపారమైన శక్తి కలిగిన ఇక్కడి ఆదిత్యుల రూపాల సందర్శనతో మంచి ఆరోగ్యం, ఆయుష్షు, గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ ద్వాదశాదిత్య మందిరాల గురించి శ్రీనాథ మహాకవి రచించిన కాశీ ఖండం ప్రస్తావించింది. ఈ ద్వాదశ ఆదిత్యమందిరాలపై చాలా విదేశీ పరిశోధనలు కూడా జరిగాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివుడే ప్రధాన దైవం. ఈ 12 ఆలయాల్లో ఎలాంటి హంగు, ఆర్భాటం ఉండవు. ఇప్పుడు ఆ ఆలయాల వివరాల గురించి తెలుసుకుందాం.


1) యమాదిత్యుడు: పూర్వం యయుడు, ఆయన సోదరి యమునతో కలిసి.. కార్తీకమాసంలో రోజూ గంగాస్నానం చేసి, ఆదిత్యుని ప్రసన్నుడిని చేసుకున్నాడు. ఆయన ఏదైనా వరం కోరుకోమనగా, కలియుగంలో ఇక్కడ కొలువైన సూర్యుడిని దర్శించుకున్నవారికి అకాల మరణాలను, వారి పితృలోక బంధువులకు యమలోక విముక్తిని ప్రసాదించమని కోరాడట. ఈ ఆలయం సింధియా ఘాట్ నుంచి మెట్లెక్కి.. ‘సంకటా దేవి’ మందిరానికి వెళ్లే వీధి మెట్ల దగ్గర ఆ ఆలయం ఉంటుంది. ఆలయంలో.. ఒక రాతి పలక, దానిమీద ఒక సూర్యుని విగ్రహం, ఆ విగ్రహం మీద రెండు శివలింగాలుంటాయి. ఈ ఆలయంలో పూజారులు ఉండరు. ఎవరికి వారే పూజ చేసుకోవాలి. కార్తీకమాసం, మంగళవారం, చతుర్ధశి భరణి నక్షత్రం కలసిన రోజున ఇక్కడి ఆదిత్యుడిని పూజిస్తే.. విశేష ఫలితం లభిస్తుందని కాశీఖండం చెబుతోంది.

2) వృద్ధాదిత్యుడు: పూర్వం కాశీలో ఓ వృద్ధుడు.. తాను జీవితాంతం తాపసిగా ఉండేలా సూర్యుడి నుంచి వరాన్ని పొందాడనీ, ఆ వృద్ధుడిని ఆదిత్యుడు కరుణించిన ప్రదేశమే నేటి వృద్ధాదిత్య ఆలయమని స్థలపురాణం. విశాలాక్షి ఆలయం నుంచి కొంచెం ముందకు పోతే.. ఒక పెద్ద ఆంజనేయుని విగ్రహం వీధిలోకి కనబడేలా ఓ గుడి కనిపిస్తుంది. దానికి సమీపంలోనే ఆ ఆలయం ఉంది. ఇక్కడ శివలింగం, దాని పక్కనే చిన్న వృద్ధాదిత్యుని విగ్రహం ఉంటాయి. పూజారి ఉదయం, సాయంత్రం పూజ చేసి వెళ్లిపోతారు. మిగిలిన సమయంలో భక్తులే స్వామిని నేరుగా అర్చించుకుంటారు.


3) విమలాదిత్యుడు: విమలుడు అనే కొండరాజు కుష్టు రోగ పీడితుడై కాశీ నగరానికి వచ్చి, సూర్యుడిని ఆరాధించి.. రోగ విముక్తిని పొందుతాడు. నాడు విమలుడు సూర్యుని పూజించిన ప్రదేశంలోనే సూర్యుడు.. విమలాదిత్యుడిగా స్వయంభువుగా ఉద్భవించేడు. జంగంబాడి పక్కసందులోంచి వెళితే ముందుగా ఎర్రరంగులో ఉన్న చిన్న మందిరం వస్తుంది. దాని పక్కనున్న చిన్న గదిలో విమలాదిత్యుని విగ్రహం వుంటుంది. ఇక్కడా భక్తులు స్వయంగా పూజలు చేసుకుంటారు.

4) సాంబాదిత్య: శ్రీకృష్ణుడు, జాంబవతి కుమారుడే సాంబుడు. ఒకరోజు ద్వారకకు వచ్చిన నారదుడికి స్వాగతం పలకటంలో నిర్లక్ష్యం వహించిన సాంబుడి తీరుకు నొచ్చుకున్న నారదుడు.. అతడిని ఆటపట్టించాలనుకుంటాడు. ఓ రోజు శ్రీకృష్ణుడు ఏకాంత మందిరంలో ఉండగా వచ్చిన నారదుడు.. ‘నేను మీ నాన్నతో మాట్లాడాలి. పిలువు’ అంటాడు. నారదుని మాటను కాదనలేక.. వెళ్లి తండ్రిని పిలవగా.. తన ఏకాంతానికి భంగం కలిగించినందుకు గానూ కుష్టురోగివి కమ్మంటూ కృష్ణుడిని శపిస్తాడు. కానీ.. ఇదంతా నారద మాయగా తెలుసుకుని, కాశీలో ఆదిత్య ఆరాధనతో రోగ విముక్తి పొందగలవని వరమిస్తాడు. నాడు సాంబుడు.. ఆదిత్యుని సేవించిన స్థలమే నేటి సాంబాదిత్య మందిరం. సూరజ్ కుండ్ మందిరం పేరుతో ఇది కాశీలో ప్రసిద్ధి చెందింది.

5) ఉత్తరార్కాదిత్య: పూర్వం కాశీలో ప్రియవర్తుడు అనే బ్రాహ్మణుడికి సుకన్య అనే కుమార్తె ఉండేది. కుమార్తెకు పెళ్లియోగం లేదని జాతకం ద్వారా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు దిగులుతో చనిపోగా, సుకన్య పెద్దల అంత్యక్రియలు జరిపించి, నిరంతరం సూర్యారాధన చేస్తుంది. ఇదే సమయంలో రోజూ ఆమెతో బాటు ఓ మేక కూడా గంగాస్నానం చేసి, సుకన్య పక్కనే కూర్చొని సూర్యుడిని మనసులో తలచుకునేది. ఉపవాస దీక్షతో కృశించిన సుకన్య భక్తికి మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై.. వరం కోరుకోమనగా, తనకే కోరికా లేదనీ, తనతో బాటు ఆదిత్యుడిని ఆరాధిస్తున్న నోరులేని మేకను కరుణించమని కోరగా మేకకు మోక్షం, సుకన్యకు మరుజన్మలో కాశీ రాజు కుమార్తెగా పుట్టేలా వరాన్నిస్తారు. నాడు.. సుకన్య సూర్యుని ‘ఉత్తరార్కునిగా’ పూజించినచోట వెలసిన ఆలయాన్ని నేడు ‘బకరియా కుండ్’ అని పిలుస్తున్నారు. కాశీ స్టేషనుకు దగ్గరగా ఉండే ఈ మందిరం ఉదయం 5 – 12, తిరిగి సాయంత్రం 5- 10 వరకు తెరిచి ఉంటుంది. ఈ మందిరం సిటీ స్టేషనుకి దగ్గరగా ఉంటుంది ,

6) మయూఖాదిత్య: పూర్వం ఆదిత్యుడు.. శివపార్వతులకై తీవ్ర తపస్సు చేశాడట. సూర్యుని ధాటికి తట్టుకోలేక ముల్లోకాలు తగలబడటం మొదలైందట. దీంతో దేవతల ప్రార్థన మేరకు శివుడు.. ఆదిత్యుడి మీద చేయిపెట్టగానే.. ఆయన ఒక్కసారిగా సూర్యుడు చల్లబడిపోయాడట. దీనికి రుజువుగా ఈ గుడిలోని సూర్యుని విగ్రహాన్ని ముట్టుకుంటే తేమగా ఉంటుంది. సూర్యుడు తీవ్ర అగ్నిగోళంలా కనిపించిన కారణంగా ఇక్కడి సూర్యుని మయూఖాదిత్యుడు అంటారు. ఆదివారం మయూఖాదిత్యుని దర్శనంతో శరీరం తేజోవంతమౌతుందని కాశీఖండం చెబుతోంది. పంచగంగా ఘాట్ వరకు బోటులో వెళ్లి.. అక్కడి మెట్లెక్కి ఈ గుడికి చేరుకోవచ్చు. స్థానికులు దీనిని ‘మాంగళ్యగౌరీదేవి మందిరం’ అని పిలుస్తున్నారు. ఈ కోవెల పగలు 5 నుంచి 1 గంటవరకు తిరిగి 3 గంటలనుంచి రాత్రి 10 వరకు తెరచి ఉంటుంది . ఈ మందిరానికి సమీపాన గల ‘బిందుమాధవుని’ మందిరంలో 3 వేల ఏళ్లనాటి రుద్రభైరవుని విగ్రహం ఉంది.

7) లోలార్కాదిత్యుడు: కాశీ రాజైన దివోదాసు.. గొప్ప ధర్మపాలనను పరిశీలించి, ఆయన ధర్మాన్ని తప్పిన మరుక్షణం.. కాశీని భస్మం చేయమని, అనంతరం ఆ మహాస్మశానంలో తాను నివసిస్తానని పరమేశ్వరుడు సూర్యుడికి చెబుతాడు. దీంతో సూర్యుడు పలువేషాల్లో కాశీలో తిరిగి, రాజు ధర్మపాలనకు మురిసిపోయి అక్కడే ఉండాలనే కోరిక(లోల) కలిగిన సూర్యుడు కాశీలోనే ఉండిపోతాడు. అందుకే ఇక్కడి ఆదిత్యుడికి లోలార్క ఆదిత్యుడని పేరు. లోలార్క కుండంలో ప్రవేశద్వారానికి కుడిచేతి వైపు ఉన్న మెట్లు వైపుగా దిగి క్రిందకి వెళ్తే లోలార్కాదిత్యుని చూడొచ్చు. ఈ గుడి రోజంతా తెరచే ఉంటుంది. లోలార్కాదిత్య కుండం బయట ఉండే సంతానేశ్వర మందిరలోని సంతానేశ్వరుని పూజిస్తే.. ఏడాదిలో మగసంతానం కలుగుతుందని ప్రతీతి.

8) ఖఖోల్కాదిత్య: పక్షిరాజైన గరుత్మంతుడు.. దేవతలతో పోరాడి తల్లి అయిన వినత శాపాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే.. ఏ పాప కారణం చేత తాను దాస్యం చేయాల్సి వచ్చిందో తెలుసుకునేందుకు వినత.. సూర్యుడి గురించి తపస్సు చేయగా, ఆదిత్యుడు ప్రత్యక్షమై ఆమె పూర్వజన్మ పాపాలను తొలగించి, ఆమె కుమారుడైన ‘అనూరుడిని’ తన రథసారధిగా నియమించుకుంటాడు. నాడు..ఈ స్థలంలో వినత ప్రతిష్టించుకున్న ఈశ్వరుని ‘కామేశ్వరుడు’గా, అమ్మవారిని ‘ఇష్టకామేశ్వరి’ గా భక్తులు పూజిస్తారు. ఈ గుడి పగలు 5- 12 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటలవరకు తెరచి వుంటుంది. ఈ మందిరాన్ని ‘మచ్చోదరి’ లేదా ‘బిర్లామందిరం’ దగ్గరవున్న ‘కామేశ్వర మహదేవ్ మందిర్ అని చెబితే ఆటో వాళ్లు తీసుకు వెళతారు.

9) కేశవాదిత్య: ఓరోజు కాశీలో శివుడిని పూజిస్తున్న విష్ణువుని చూసిన సూర్యుడు.. ‘మీరు లోకాధిపతి కదా.. మరి మీరూ శివుడిని పూజిస్తున్నారే’ అని అడిగాడట. దీనికి విష్ణువు.. ‘కాశీలోని ప్రతి పూజా.. శివుడికే చెందుతుంది’ అనగా, విష్ణువును గురువుగా భావించి, ఆయన మాట మేరకు ఆదిత్యుడూ శివారాధన చేయగా, వరం కోరుకోమని శివుడు కోరాడట. ‘నేను నిన్ను పూజించిన చోట పూజచేసే భక్తులను పాపాల నుంచి విముక్తి చేయి’ అని ఆదిత్యుడు.. శివుడిని వరంగా కోరాడట. అదే నేటి కేశవాదిత్య క్షేత్రం. ఆదివారం నాడు వచ్చిన రథసప్తమి వేళ.. పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. పడవలో రాజఘాట్ వద్ద దిగి ఈ గుడికి వెళ్లొచ్చు. స్థానికులు దీనిని ఆదికేశవ మందిరంగా పిలుస్తారు. ఉదయం 6 – 12, తిరిగి సాయంత్రం 4 నుంచి 10 వరకు ఈ గుడి తెరచివుంటుంది.

10) గంగాదిత్య: సూర్యుడు రోజూ గంగాదేవిని దర్శించుకొని పూజించుకుంటాడని, కనుక రోజూ ఉదయాన్నే గంగాస్నానం చేసి.. ఇక్కడి సూర్యుడిని దర్శించుకుంటే రోగాలు తొలగి, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. కాశీలోని ‘నేపాలీ పశుపతినాథ్ మందిర్’ నుంచి గంగానదికి ఎదురుగా వెళ్లే దారిలో చిన్న గూడులా కట్టిన ఆలయంలో గంగాదిత్యుని విగ్రహం ఉంటుంది. ఈ మందిరం రోజంతా తెరిచేవుంటుంది.

11) అరుణాదిత్యుడు: కశ్యప ప్రజాపతి పత్ని వినత తొందరపాటు వల్ల వికలాంగుడిగా జన్మించిన ‘అనూరుడు’ సూర్యుని గురించి తీవ్ర తపస్సు చేసి ఆదిత్యుని ప్రసన్నుని చేసుకుని, ఆయన సారథిగా అవకాశం పొందుతాడు. ఈ గుడి వెళ్లేవారు… ‘మచ్చోదరి’ వరకు ఆటోలో వెళ్లి అక్కడ స్థానికులు ఈ ఆలయాన్ని ‘త్రిలోచనేశ్వర మందిర్’ అంటారు. పగలు 6-30 – 12 వరకు, సాయంత్రం 5 – రాత్రి 11 వరకు తెరచివుంటుంది. రాత్రి గుడి మూసే ముందు.. స్వామికి శయనహారతి ఇస్తారు. అరుణాదిత్యుని పూజించుకున్నవారికి ఆహార ఆరోగ్యాలకు కొరత ఉండదని కాశీఖండం లో చెప్పబడింది.

12) ద్రౌపదాదిత్యుడు: వనవాస కాలంలో అతిథులకు అన్నం పెట్టలేకపోతున్నానని బాధపడిన ద్రౌపదీ దేవి.. ఆదిత్యడిని ప్రార్థించగా, ఆయన అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. నాడు ద్రౌపతిచే పూజలందుకున్న సూర్యుడే నేడు కాశీలో ద్రౌపదాదిత్యగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ద్రౌపదాదిత్యుని పూజించు కున్నవారికి ఏ జన్మలోనూ ఆకలిబాధలుండదని కాశీఖండం చెబుతోంది. కాశీవిశ్వేశ్వరుని ప్రధాన మందిరం పక్కనే ఉన్న ‘జ్ఞానవాపి’ మసీదు సందులో ఈ గుడి ఉంటుంది. స్థానికులను అడిగి కనుక్కుంటూ వెళ్లాలి. ఈ కోవెల రాత్రి పదివరకు తెరిచే ఉంటుంది.

Related News

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Big Stories

×