EPAPER

Geeta Jayanti : భగవానుని వాక్కు .. గీతగా మారిన రోజు

Geeta Jayanti : భగవానుని వాక్కు .. గీతగా మారిన రోజు
Geeta Jayanti

Geeta Jayanti : నేడు మార్గశిర ఏకాదశి. సకల శాస్త్రాల సారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో అర్జునుడికి బోధించిన రోజు ఇదే. దీనినే గీతా జయంతిగా మనం జరుపుకుంటున్నాం. భగవద్గీత సాక్షాత్తు భగవద్వాణి. అంతేకాదు.. యుగయుగాలుగా మనిషికి అద్భుత విజయం, ఐశ్వర్యం, అసాధారణ శక్తి, నీతిని మనిషికి అందిస్తోన్న మార్గదర్శి కూడా.


భగవద్గీత 18 అధ్యాయాల యోగ గ్రంథము. ఇందులో 700 శ్లోకాలున్నాయి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా ‘షట్కత్రయం’గా విభజించబడింది. కొందరు జ్ఞానయోగంలో రాజయోగం కూడా చేరుస్తారు. నిజానికి ప్రతి అధ్యాయం యోగశాస్తమ్రే. అర్జున విషాదయోగంతో మొదలై మోక్ష సన్యాస యోగంతో ముగుస్తుంది.

‘యుద్ధమూ వద్దు.. రాజ్యమూ వద్దు’ అని నిరాశలో కూరుకుపోయిన అర్జునుడి వెన్ను తట్టిన భగవానుడు గీత ద్వారా కర్తవ్యబోధ చేశాడు. దీంతో అర్జునుడు ‘విజయుడు’ అయ్యాడు. భగవద్గీతను శ్రద్ధగా అర్థం చేసుకుంటే మోహం (అసలు పనిని వదిలి వేరే ఆలోచనలో పడిపోవటం) తొలగిపోయి.. మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యార్థుల నుంచి దేశాన్నేలే పాలకుల వరకు భగవద్గీత ఆయా స్థాయిల్లో మార్గనిర్దేశకం చేస్తోందంటే.. దీని విస్తృతి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది.


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా గాక.. ప్రపంచంలో ఎక్కడైనా పనికొచ్చే వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు సాధనంగా, లక్ష్యసాధకులకు మార్గదర్శిగా భావించాల్సి ఉంది. ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదింపబడిన ఈ గ్రంథంపై వందల మంది తమవైన భాష్యాలను రాశారు.

‘నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. కర్మఫలాన్ని ఆశించే అధికారం నీకు ఎన్నడూ లేదు. కర్మలకు నీవు కారణభూతుడవని భావించకు. ధర్మాన్ని నిర్వర్తించడంలో అనాసక్తుడవుగా ఉండకు’ అన్నాడు గీతాచార్యుడు. నీ పనిని శ్రద్ధతో చేసి కర్మఫలాన్ని అంటే కష్టసుఖాలను పరమాత్మకు వదిలిపెట్టడం అన్నమాట. తనకు సంక్రమించిన పనిని ప్రేమతో చేయాలి తప్ప ఆశతో కాదని అంతరార్థంగా వ్యాఖ్యా నిస్తారు. నేటి మాటల్లో చెప్పాలంటే ‘ఇష్టమైన పని’.

కొన్ని గీతా వాక్కులు

పిరికితనాన్ని వదలి లక్ష్యం దిశగా ధైర్యంగా సాగు. గతాన్ని తలచుకుని దు:ఖించక.. వర్తమానంలో జీవిస్తూ.. భవిష్యత్తుకు ప్రణాళికలు రచించు. అన్ని విజయాలకూ మన మనసే మూలం. అధైర్యం నిండిన మనసు ఏమీ చేయలేదు. అలాంటి మనసు అన్యాయాన్ని నిలదీయలేదు. కనుక.. మనో దౌర్బల్యాన్ని వదిలి సాహసాన్ని శ్వాసగా చేసుకో.

కష్టం వచ్చినప్పడు కుంగిపోని వాడు, సుఖం వచ్చినప్పడు సృహ లేనట్టుగా ప్రవర్తించే వాడే.. స్థిత ప్రజ్ఞుడు. ఇలాంటివాడు దేన్నైనా తట్టుకొని నిలబడగలడు. నీకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వర్తించు. నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తాయి.

సర్వ ప్రాణుల పట్ల సమదృష్టి కలవాడే పండితుడు. సమాజం నుంచి మనం ఏదైనా కోరుకుంటే.. మనవంతుగా మనమూ ఏదైనా సమాజానికి ఇవ్వాలి. ప్రపంచపు విషయాలపై అవసరమైన దానికంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాడు.. మానసిక శాంతిని ఎప్పటికీ పొందలేడు.

నువ్వు భగవంతుడిని ఏ రూపంలో ఉన్నాడనుకుంటావో.. ఆయన నీకు అదే రూపంలో కనిపిస్తాడు. పరమాత్మే సర్వం అని నమ్మినవారు తప్పక మోక్షాన్ని పొందుతారు. భగవంతుడిని ఏ దృష్టితో సేవిస్తే అలానే అనుగ్రహిస్తాడు. పరమాత్మే సర్వం అని నమ్మిన వారికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది.

నిస్వార్థంతో చేసే పనిలో పాపపుణ్యాల ప్రసక్తి ఉండదు.. ఇదే మానవ జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తుంది. ‘జీవితమంటేనే నిత్య సమరం. ఈ యుద్ధంలో ముందుకు సాగిపోవటమే తప్ప పారిపోవటం, విచారిస్తూ కూర్చోవటం పనికిరావు. ప్రతి వ్యక్తీ తనలోని ప్రత్యే్కతను, శక్తియుక్తులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మానసిక కల్లోలాలను జయించి, లక్ష్య దిశగా సాగిపోవాలి’ అనేదే గీతాచార్యుని దివ్యోపదేశం. కాగా, దీనిని అంతిమ సంస్కారాల వేళ వినిపించే దానిగా మార్చటం ఎంతో శోచనీయం. ఇది మానవుల జీవితాలను శోభింపజేసేదే తప్ప శోకింపజేసేది కాదని మనం తెలుసుకోవటమే భగవద్దీతకు, దానిని మనకు అందించిన భగవానుడికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×