EPAPER

Tiruttani Murugan Temple : తన్మయాన్ని కలిగించే క్షేత్రం .. తిరుత్తణి

Tiruttani Murugan Temple : తన్మయాన్ని కలిగించే క్షేత్రం .. తిరుత్తణి
Tiruttani Murugan Temple

Tiruttani Murugan Temple : సుబ్రహ్మణ్యుడు కొలువైన ఆరు ప్రధాన క్షేత్రాల్లో తిరుత్తణి ఒకటి. తిరుచెందూరు, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొళై, పళని, స్వామిమలై, తిరుత్తణి.. ఈ 6 దివ్య క్షేత్రాలను తమిళనాడులో ఆరుపడై వీడు అంటారు. వీటిలో ఆరవది.. తిరుత్తణి. తారకాసుర సంహారం తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ఆగి.. విశ్రాంతి తీసుకున్నాడని పురాణ కథనం. కార్తికేయుడిని తనికేశన్ అని పిలుస్తారు.


పూర్వం బ్రహ్మ కైలాసం వైపుగా వెళుతుండగా.. సుబ్రహ్మణ్యుడు కనిపించి.. ‘బ్రహ్మము’ అంటే ఏమిటి అని అడిగాడట. దానికి బ్రహ్మ.. ‘అది నేనే’ అని జవాబిచ్చాడట. దీంతో సుబ్రహ్మణ్యడు ఆగ్రహించి.. నాలుగు ముఖాలతో వేదాలను బోధించే మీకే ఈ విషయం తెలియదా.. అంటూ బ్రహ్మను బంధించాడట. వెంటనే పరమశివుడు వచ్చి మందలించగా.. కుమారస్వామి ఆయనను విడుదల చేస్తాడు. తన తొందరపాటు చర్యకు చింతించిన సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో భూలోకానికి రాగా, జనం తెలియక రాళ్లతో కొట్టారట. గాయాల పాలవుతున్న కుమారుడిని చూసిన పార్వతీదేవి ఆయనచేత షష్ఠీ వ్రతం చేయించగా.. సర్పరూపం పోయి.. తేజోమయమైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని పురాణ గాథ.

సూరపద్ముడి సంహారం అనంతరం సుబ్రహ్మణ్యుడు ఈ తిరుత్తణి కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. స్కంద షష్టి రోజున ఇక్కడ యుద్ధ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున 1000 కేజీల పూలతో స్వామిని అభిషేకిస్తారు. తిరుత్తణిలో స్వామివారి వాహనంగా నెమలికి బదులు ఏనుగు ఉంటుంది. పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేసేవేళ.. ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడని, దేవలోకం నుంచి ఐరావతం పోగానే.. అక్కడి సంపదలన్నీ హరించుకుపోగా.. సుబ్రహ్మణ్యడు దీనిని మామగారికి తిరిగివ్వబోగా.. వద్దని వారించిన ఇంద్రుడు.. దానిని తూర్పు వైపు నిలబెడితే చాలని చెబుతాడు. ఇందుకు గుర్తుగా ఇక్కడి స్వామివాహనంగా ఉండే ఐరావతం తూర్పు ముఖంగా కనిపిస్తుంది.


దేవసేనతో కార్తికేయుడి వివాహం సందర్భంగా.. మామగారైన ఇంద్రుడు చందనాన్ని అందించాడనీ, దానికి గుర్తుగా నేటికీ స్వామికి చందనాన్ని నివేదిస్తారు. దీనిని నుదిటిపై ధరించటానికి బదులుగా నీటిలో కలిపి సేవిస్తే.. రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యమైన పండుగల వేళ.. ఈ చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ ఆలయంలో కాలభైరవుడు 4 వేదాలను పరిరక్షకుడిగా.. నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. భైరవుడి పీఠం ముందు 3 శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనే నమ్మకం ఉంది.

ఇక్కడి ఆలయం క్షణికాచలం(తమిళంలో తనికాచలం) అనే చిన్న గుట్ట మీద ఉంటుంది. దీనికి ఉన్న 365 మెట్లు ఎక్కి భక్తులు కొండపై ఉన్న తనికేశుడిని దర్శించుకుంటారు. తిరుత్తణిలో నిశ్చలమైన మనసుతో స్వామిని ఆరాధించిన వారి కోరిక తప్పక తీరుతుందని, మానసిక ఆందోళనలు నశించి ప్రశాంతతను పొందుతారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో 5 రోజులు నివాసముండి, నిత్యం స్వామిని సేవిస్తే తీరని కోరిక ఉండదని భక్తుల విశ్వాసం.

త్రేతా యుగములో రావణ వధ మూలంగా అపరాధ భావనకు గురైన శ్రీరాముడు.. రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అక్కడే.. పరమశివుని ఆదేశం మేరకు తిరుత్తణిని సందర్శించాకే.. అశాంతికి, అలజడికి లోనైన శ్రీరాముడి మనసు కుదుట పడిందని చెబుతారు. తారకాసురుడు.. తన నుంచి చేజిక్కించుకున్న శంఖ, చక్రాలను ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని పూజించాకే.. శ్రీమహా విష్ణుడు తిరిగి పొందాడని, అలాగే.. దక్షిణ దేశ యాత్రా క్రమంలో అర్జునుడు ఇక్కడ కొంతకాలం నివసించి.. ఇక్కడ కొలువైన స్వామిని ఆరాధించాడనే కథనం ఉంది.

బ్రహ్మ, ఇంద్రుడు ఇక్కడ తనికేశుడిని పూజించారని, అలాగే.. క్షీర సాగర మథనం వల్ల గాయాలపాలైన వాసుకి.. ఇక్కడ స్వామిని దర్శించగానే ఆయన గాయాలు మానిపోయాయనే గాథ ఉంది. అగస్త్య మహాముని ఈ క్షేత్రాన్ని దర్శించాకనే.. తమిళ భాష ఆవిర్భవించిందనీ చెబుతారు. కర్ణాటక సంగీతపు త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్.. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యుడి అవతారంగా చెబుతారు. దీక్షితార్ పూర్వం ఈ క్షేత్ర పర్యటన చేసినప్పడు సుబ్రహ్మణ్యడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి .. దీక్షితార్ నోటిలో పటికబెల్లం ముక్క వేశాడనీ, నాటి నుంచి ఆయన నోటి నుంచి అనేక కీర్తనలు వెలువడ్డాయని చెబుతారు.

తిరుత్తణి క్షేత్రం.. చెన్నై నుండి 84 కి.మీ, తిరుపతి నుండి 68 కి.మీ, అరక్కోణం(పెద్ద రైల్వే జంక్షన్) నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. తిరుపతి నుంచి తిరుత్తణికి రోజూ అనేక బస్సులున్నాయి. చెన్నై నుండి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి. ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అలాగే.. ఏటా ఆడి కృత్తిక సందర్భంగా మూడు రోజుల పాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. దీనికి సుమారు 2 లక్షల మంది భక్తులు స్వగ్రామాల నుంచి కాలినడకన కావళ్లను మోస్తూ వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×