EPAPER

ORR to Airport Metro : ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో అవసరమా?

ORR to Airport Metro | గచ్చిబౌలి, ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టుకు మంచి కనెక్టివిటీ ఉంది. మళ్లీ అదే రూట్ లో మెట్రో ఎందుకు? ఈ ప్రశ్నను రేవంత్ రెడ్డి లెవనేత్తె వరకు సగటు హైదరాబాదీకి డౌట్ ఎందుకు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం కావడం.. వెంటవెంటనే ఆ రూట్ లో పిలిచిన మెట్రో టెండర్లను రద్దు చేయడం జరిగిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఓల్డ్ సిటీ రూట్ ను డెవలప్ చేయాలన్న సీఎం నిర్ణయం వెనక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది.

ORR to Airport Metro : ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో అవసరమా?

ORR to Airport Metro : గచ్చిబౌలి, ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టుకు మంచి కనెక్టివిటీ ఉంది. మళ్లీ అదే రూట్ లో మెట్రో ఎందుకు? ఈ ప్రశ్నను రేవంత్ రెడ్డి లెవనేత్తె వరకు సగటు హైదరాబాదీకి డౌట్ ఎందుకు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం కావడం.. వెంటవెంటనే ఆ రూట్ లో పిలిచిన మెట్రో టెండర్లను రద్దు చేయడం జరిగిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఓల్డ్ సిటీ రూట్ ను డెవలప్ చేయాలన్న సీఎం నిర్ణయం వెనక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది.


సామాన్యుడి కోణంలోనే ప్రతి ఆలోచన..

ఇది తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌. ఏ నిర్ణయం తీసుకున్నా..ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యం. ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు తన పాలనను సాగిస్తున్నారు. అది సంక్షేమ పథకాలైన.. అభివృద్ధి కార్యక్రమాలైన తన మార్క్‌ పాలనను చూపిస్తున్నారు. తాజాగా రాయదుర్గం-శంషాబాద్‌ రూట్‌లో మెట్రో రద్దు, ఫార్మాసిటీని వేరేచోటుకు తరలించడం లాంటి ప్రతి నిర్ణయం వెనక రేవంత్‌ దూరదృష్టి ఉంది. ఇది ఆ ఏరియాలో వచ్చే మెట్రోతో లబ్ది పొందాలని చూసేవారికి మింగుడుపడని విషయమే. కానీ తప్పదు.. బడాబాబుల బాగు కోసం ఆలోచిస్తే.. ప్రజల జీవితాలు ఆగమైపోతాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కఠినమైన.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక ప్రణాళిక..

హైదరాబాద్‌ లో పొట్ట చేత్తో పట్టుకుని వచ్చి ఇక్కడ ఏదో ఒకపని చేసుకుంటూ ఉండేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దాంతో సిటీ పరిధి కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే హైదరాబాద్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. గత సర్కార్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు స్వస్తి పలుకుతూ సరికొత్త.. అభివృద్ధిని.. సరికొత్త హైదరాబాద్ ను ప్రజల ముందు ఉంచాలని ఆరాటపడుతున్నారు. అందులోభాగంగానే ఔటర్‌ మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రోను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాతబస్తీ మెట్రోనూ పూర్తిచేయడంపై ఫోకస్‌ పెట్టారు. భౌగోళిక పరిమితులు లేకుండా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందే సామర్థ్యం హైదరాబాద్‌కు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. అందుకే నగరం నలువైపులా డెవలప్‌మెంట్‌ జరగాలంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే 40 శాతం పట్టణీకరణ జరిగింది. ఔటర్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలన్నది రేవంత్‌రెడ్డి ప్లాన్. అక్కడికి చేరుకునేందుకు రవాణా వ్యవస్థ ఎంతో ముఖ్యమని అందులో మెట్రో కీలకమంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే రెండు మార్గాలను పరిశీలించాలని, ఒకటి.. చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్‌పల్లి, జల్‌పల్లి విమానాశ్రయం వరకూ… రెండోది చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్లను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

111 జీవో పరిధిలో అలైన్మెంట్ ఎలా? ORR ఉండగా అక్కడే మెట్రో ఎందుకు?

గత ప్రభుత్వ హయాంలో ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలూపిన అధికారులు.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి వేసే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మెట్రో రైల్‌పై సమీక్ష సందర్భంగా.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలో మెట్రో అలైన్ మెంట్ ఎలా చేస్తరన్న ప్రశ్నను సంధించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే అవుటర్ రింగు రోడ్డు లాంటి చక్కటి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు.. మళ్లీ మెట్రో సౌకర్యం ఎందుకు? అన్నది ముఖ్యమంత్రి ప్రశ్న. దానికి బదులుగా.. సెంట్రల్ హైదరాబాద్ తో పాటు ఈస్ట్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేలా మెట్రో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అందుకే గచ్చిబౌలి-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును పక్కనపెట్టమన్నారు.

MGBS-ఫలక్ నుమా మధ్య దూరం 5.5 కి.మీ.. గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయింది?

ఎల్‌.అండ్ టీ తో ఉన్న ఒప్పందం ప్రకారం.. పాతబస్తీలోనే మెట్రో పరుగులు పెట్టాలి. కానీ.. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు. ఇంతవరకూ పనులు ఎందుకు చేపట్టలేదన్నదానిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏళ్లు గడుస్తున్నా.. పాతబస్తీ వాసుల మెట్రో రైలు కల మాత్రం నెరవేరలేదు. మిగతా ఏరియాల్లో మెట్రో పరుగులు తీస్తున్నా.. పాతబస్తీలో మాత్రం అలైన్‌మెంట్‌ వివాదాన్ని పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. కేవలం 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పాతబస్తీకి మెట్రో విస్తరించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే.. ఓల్డ్‌ సిటీ అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టారు. గతంలో కారిడార్‌-2లో భాగంగా జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 15 కిలో మీటర్ల పనులు స్థానిక నేతల అభ్యంతరాలతో ఎంజీబీఎస్‌ వరకు మాత్రమే పూర్తి అయ్యాయి. ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులకు బ్రేక్‌ పడింది. మెట్రో అలైన్‌మెంట్‌ మార్చాలని స్థానిక నేతల డిమాండ్‌ నేపథ్యంలో అధికారులు పనులు నిలిపివేశారు. ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు. పాత అలైన్‌మెంట్‌ మార్చి పనులు పూర్తి చేసేందుకు 2021 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్లు, 2022 బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించినప్పటికీ.. నిధులను మాత్రం విడుదల చేయలేదు.

పాతబస్తీ మీదుగానే ఎందుకు వెళ్లాలి.?

దానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సమాధానం ఉంది. హైదరాబాద్ కీ షాన్ ఓల్డ్ సిటీ. కానీ ఆ ఏరియా మాత్రం అభివృద్ధికి ఎల్లవేళలా దూరంగానే ఉంటుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. అక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చింది మాత్రం లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ ఓల్డ్ సిటీపై పెట్టారు. పాతబస్తీకి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించారు. ముఖ్యంగా ఆ రూట్ లోనే ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో సేవలు ఉండటంతో ఆ ఏరియాలో అభివృద్ధి చాలా వేగంగా జరిగిపోతోంది. ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాలే కాకుండా.. ఓల్డ్ సిటీ లాంటి ఏరియాను అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజల జీవినవిధానంలో అనేక మార్పులు వస్తాయి.

రాయదుర్గం-ఎయిర్ పోర్టు మెట్రోతో ఎవరికి లాభం?

బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ను 2019లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపుగా 6250 కోట్ల అంచనా వ్యయంతో ఢిల్లీ మెట్రో రైలు అధికారులు కూడా డీపీఆర్‌ రెడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కేసీఆర్‌. కానీ ఈ మెట్రోతో ఎవరికి ఉపయోగం అన్నదే చర్చనీయాంశం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ రూట్‌లో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే రియల్‌ ఎస్టేట్ వ్యాపారుల లబ్ది కోసమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మెట్రో నిర్మాణంతో ఆ రూట్లో భూముల ధరలు.. అపార్ట్‌మెంట్ల ధరలు భారీగా పెరుతాయి. దీనివల్ల వెంచర్లు వేసిన రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు భారీగా లాభం జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వంపై మాత్రం భారీగా భారం పడుతుంది. ఔటర్‌రింగ్‌రోడ్‌ ద్వారా అరగంటలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వీలున్నప్పుడు..మళ్లీ అంతే సమయం పట్టే మెట్రో అదే దారిలో ఎందుకంటూ గతంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కానీ బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎవరి మాట వినకుండా ఆ ప్రాజెక్టుకు టెండర్లు కూడా పిలిచింది. ప్రస్తుతమైతే ఆ టెండర్లను రద్దు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేవంత్‌ ఆదేశాలను సరిగ్గా గమనిస్తే.. అందులో చాలా కారణాలు కనిపిస్తాయి. రాయదుర్గం రూట్‌లో ఇప్పటికే ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్‌ఆర్‌ అందుబాటులో ఉంది. గచ్చిబౌలి వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎంటర్‌ అయితే.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వద్ద ఎగ్జిట్‌ అవుతారు. ఎక్కడా కూడా ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా ఉండవు. అలాంటి రూట్‌లోనే మళ్లీ మెట్రోను ఎక్స్‌ప్యాన్షన్‌ చేయడం కరెక్టు కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. అందుకే ఆ పాత టెండర్లను రద్దు చేశారు. అంతేకాదు.. ఎల్ అండ్ టీ మెట్రో రైలు.. జీఎంఆర్ ఎయిర్ పోర్టు రాయితీ ఒప్పందాల్ని పరిశీలించాలని.. మూసీ వెంట రోడ్ కం మెట్రో కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో రైలు డెవలప్ మెంట్.. ఇతర అంశాలపై సీఎం జరిపిన సమీక్ష అద్యంతం సంచలనంగా మారింది.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ కూడా రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌ అవుతుందా అంటే నో అనే చెప్పాలి. కేవలం అప్పా, నార్సింగి, కిస్మిత్‌పుర, ఎయిర్‌పోర్టు వైపు మాత్రమే రియల్‌ బూమ్‌ కనిపిస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. ఈ ఏరియాలనే భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కానీ ఓఆర్‌ఆర్‌ చుట్టు ఉన్న మిగతా ప్రాంతాల్లో ఎందుకు ల్యాండ్ రేట్స్ పెరగడం లేదు. అంటే అభివృద్ధి మొత్తం కూడా రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వైపే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. సమాంతర అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అన్నివిధాలా డెవలప్‌ అవుతుందన్నారు. ప్రజల జీవనవిధానం కూడా మెరుగవుతుంది. అందుకే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు చీఫ్ మినిస్టర్.

.

.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×