EPAPER

Margasira Lakshmi Puja : ఐదు గురువారాల అద్భుత వ్రతంతో అన్నీ శుభాలే..!

Margasira  Lakshmi Puja :  ఐదు గురువారాల అద్భుత వ్రతంతో అన్నీ శుభాలే..!

Margasira Lakshmi Puja : శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన మార్గశిరం.. లక్ష్మీదేవికీ అత్యంత ఇష్టమైనదే. ఈ మాసంలో వచ్చే తొలి లక్ష్మీవారం(గురువారం) నుంచి ఐదు గురువారాల పాటు భక్తితో తనను కొలిచే వారిని ఆ మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో మహిళలు.. లక్ష్మీవార వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు. దీనినే కొందరు లక్ష్మీపూజ, లక్ష్మీవ్రతం అని కూడా అంటారు. మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఒకవేళ.. మార్గశిర మాసంలో నాలుగు గురువారాలే వస్తే.. ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.


ఈ వ్రతం చేసేవారు.. గురువారం వేకువనే ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానాదికాలయ్యాక వాకిట ముగ్గులు పెట్టాలి. పూజా మందిరంలో బియ్యం పిండితో ముగ్గువేసి, లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించుకుని పూలతో అలంకరించుకోవాలి. వ్రతం నిర్విఘ్నంగా జరగాలంటూ గణపతిని స్మరించుకుని, మహాలక్ష్మికి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని ఇచ్చి పూజ చేయాలి. అనంతరం లక్ష్మీ అష్టోత్తరం చదవి, నైవేద్యం సమర్పించి, లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని, తలపై అక్షతలు వేసుకుని, చివరగా క్షమా ప్రార్థన చేయాలి.

ఇక.. ఈ వ్రతం చేసేవారు తొలి గురువారం అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండవ గురువారం అట్లు, రెండవవారం అట్లు, కొబ్బరి పాయసాన్ని నివేదిస్తారు. మూడవ వారం అప్పాలు, పరమాన్నాన్ని, నాల్గవ గురువారం చిత్రాన్నం, గారెలు నివేదిస్తారు. ఆఖరి గురువారం పూజలో అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. చివరి గురువారం రోజు.. వ్రతం పూర్తి కాగానే.. ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే.


గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. ఆ రోజుల్లో తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కు తీసుకోవడం నిషిద్ధం. అలాగే తొలిసంధ్య, మలిసంధ్య నిదుర పోకూడదు. అబద్ధాలాడటం పనికి రాదు.

ఇక.. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ విషయానికొస్తే.. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు తొలి భార్య చనిపోగా, మరో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య సంతానంగా కలిగిన పాప పేరు సుశీల. సవతి తల్లి పసివారైన తన కుమారులను ఆడించే బాధ్యతను సుశీలకు అప్పజెప్తూ, ఆ సమయంలో తినేందుకు సుశీలకు బెల్లం ముక్కలు ఇచ్చేది.

సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసిన సుశీల.. తాను కూడా మట్టితో లక్ష్మీ దేవి ప్రతిమను చేసి, జిల్లేడు పూలతో పూజించి, సవతి తల్లి తనకు తినమని ఇచ్చిన బెల్లం ముక్కలను నివేదించేది. ఇలా.. కొన్నాళ్లకు సుశీలకు వివాహమవుతుంది. ఆమె అత్తారింటికి వెళ్తూ వెళ్తూ.. తాను పూజించే మట్టి లక్ష్మీదేవి బొమ్మనూ తీసుకుపోతుంది. ఆమె అత్తారింటికి పోగానే పుట్టింటివారంతా కటిక దరిద్రులయ్యారు. దీనికి సుశీల కూడా బాధపడుతుంది.

ఆ సమయంలో సవతి తల్లి తన కుమారుడిని పిలిచి.. ‘ నాయనా.. నీవు వెళ్లి.. మీ సుశీల అక్కకు మన పరిస్థితి చెప్పి.. ఏదైనా ఇస్తే తీసుకురా’ అని పంపుతుంది. తమ్ముడు రాగానే ఆహ్వానించి, ఆదరించిన సుశీల.. ఒక కర్రలో బంగారు నాణేలను దాచి, దానిని జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పగా.. ఆమె తమ్ముడు దానిని దారిలో ఎక్కడో పెట్టగా, దారిన పోయేవాడు చేతబుచ్చుకుని పోతాడు. ఇంటికి వెళ్లిన కుమారుడు తానేమీ తేలేదని చెప్పగా సుశీల సవతి తల్లి బాధపడుతుంది.

కొన్నాళ్లకు మళ్లీ వచ్చిన తమ్ముడి ద్వారా పుట్టింటి వారి పరిస్థితిలో ఏ మార్పు రాలేదని తెలిసుకున్న సుశీల.. ఈసారి అతనికి తోలు చెప్పులు కుట్టించి, ఆ చెప్పుల్లో బంగారు నాణాలు కుక్కి, ఒక వస్త్రంలో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోమనగా, వాడు దారిలో దాహం వేసి చెరువులోకి దిగుతూ ఒడ్డున ఆ గుడ్డ మూట పెట్టి వెళ్తాడు. ఈలోగా ఓ బాటసారి వాటిని తీసుకుపోతాడు. దీంతో రెండోసారీ ఇంటికి ఒట్టిచేతుల్తోనే వెళ్లాల్సి వస్తుంది. కొన్నాళ్లకు మళ్లీ వచ్చిన తమ్ముడికి గుమ్మడికాయ నిండా బంగారు నాణేలు కుక్కి.. ఇచ్చి పంపుతుంది సుశీల. దానినీ ఆ బాలుడు దారిలో పోగొట్టుకుంటాడు.

ఇదిలా కాదని.. ఈసారి పిల్లలను ఇంటివద్ద ఉంచిన సుశీల సవతి తల్లి తానే స్వయంగా బయలుదేరి సుశీల ఇంటికొస్తుంది. జరిగిన సంగతి తెలుసుకుని.. ‘నాతో బాటు నువ్వు కూడా లక్ష్మీవార వ్రతం చేద్దువు’ అని తల్లితో చెప్పి తన పిల్లలకు చద్దన్నం తినిపించే పనిని తల్లికి అప్పగించి వెళ్తుంది. కానీ.. పిల్లలకు చద్దన్నం పెట్టే క్రమంలో మిగిలిన చివరి ముద్దను పెద్దావిడ తినేయటంతో.. తొలివారం, మరచిపోయి తలకు నూనె రాసుకోవటం వల్ల రెండవవారం, దువ్వెనతో తల దువ్వుకోవటం వల్ల మూడవవారం వ్రతం చేయలేకపోగా, సుశీల మాత్రం ఆ మూడువారాలు యధావిధిగా వ్రతం చేసుకుంటుంది.

కనీసం నాలుగోవారమైనా తల్లితో వ్రతం చేయించాలనుకున్న సుశీల.. తల్లి ఏ పొరబాటు చేయకుండా ఉండేందుకు ముందురోజే ఆమెను ఓ గుంతలో కూర్చోబెడుతుంది. కానీ.. మనుమలు అరటి పండు తిని తొక్కను అమ్మమ్మ మీదకు విసిరేయగా.. ఆమె ఏమీ తోచక ఆ తోలు తినేయటంతో నాలుగోవారమూ వ్రతం చేయలేకపోతుంది. దీంతో నాలుగోవారమూ సుశీల ఒంటరిగా వ్రతం చేస్తుంది.

ఇలాకాదని భావించిన సుశీల.. ఐదవ గురువారం తల్లిని చీర కొంగుకు కట్టుకుని, ఆమెచేత కూడా వ్రతం చేయించి.. పూర్ణాలను నైవేద్యంగా నివేదించగా.. మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై వాటిని స్వీకరించకుండా బయటికి పోతుంది. అప్పుడు సుశీల ‘తల్లీ మా నేరమేమిటి’ అని లక్ష్మీదేవిని అడగగా, ‘చిన్నతనంలో నీ తల్లి నీవు ఆడుకుంటుండగా నిన్ను చీపురుతో కొట్టింది. ఆమెకు నా కటాక్షం కలగాలంటే మరోమారు ఈ ఐదువారాల వ్రతం చేయించు’ అని చెప్పి అదృశ్యమైంది. ఆ ప్రకారమే సుశీల తల్లిచే శ్రద్ధగా 5 వారాల గురువార వ్రతం చేయించగా.. ఆమె పుట్టింటి వారికి లక్ష్మీ కటాక్షం కలిగింది.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×