EPAPER

Potti Sriramulu : ఆంధ్రరాష్ట్రపు అవతార పురుషుడు .. అమరజీవి

Potti Sriramulu : ఆంధ్రరాష్ట్రపు అవతార పురుషుడు .. అమరజీవి
Potti sriramulu life history

Potti sriramulu life history in telugu(Telugu news updates) : ఆయన ఒక సామాన్యుడు. నిరుపేదగా జన్మించాడు. కులబలం, అంగబలం, అర్థబలం లేనివాడు. నికార్సైన గాంధీయవాది. అందరినీ ప్రేమించటమే తప్ప మరొకటి ఎరగని అమాయకుడు. ఆడిన మాట తప్పని సత్యనిష్టాపరుడు. పట్టినపట్టు విడవని యోధుడు. ఏనాడూ ఎవరినీ చేయి చాచి ఆశించని స్వాభిమాని. తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి. ఆయనే.. పొట్టి శ్రీరాములు. నేడు ఆయన జయంతి.


1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు పొట్టి శ్రీరాములు. నాటి మద్రాసు నగరంలోని అణ్ణాపిళ్ళై వీధిలోని 163వ నెంబరు అద్దె ఇంట్లో ఆయన బాల్యం గడిచింది. గోవిందప్ప నాయకర్‌ వీధిలోని ‘బంగాపల్లి కూటం’లో శ్రీరాములు చదువు ఆరంభమైంది. ఏడవ ఏటనే తండ్రిని కోల్పోయారు.

కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి సహకారంతో ప్రోగ్రెసివ్‌ యూనియన్‌ పాఠశాలలో, ఆరు, ఏడు తరగతులు, హిందూ ధియోలాజికల్‌ ఉన్నత పాఠశాలలో పై తరగతులు చదివారు. ఇక్కడే ఎ.వి. దొరస్వామి అయ్యర్‌ అనే టీచర్ ప్రోత్సాహంతో ఆంగ్ల నాటకాల్లో వేషాలు వేసి మంచి నటుడిగా పేరు సంపాదించారు. అదే సమయంలో బాడ్మింటన్, బిలియర్డ్స్ ఆటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. శ్రీరాములు తన 16వ ఏట అన్న నారాయణను, ఆ తర్వాత కొంతకాలానికి సోదరి గురమ్మను కోల్పోయారు.


Also Read : ఆదర్శ నాయకుడు.. మన బూర్గుల..

వరుస కుటుంబ విషాదాలు, దారుణ దారిద్య్రంతో కుటుంబ బాధ్యతను మోసే క్రమంలో పరీక్షల్లో ఫెయిలయ్యారు. కానీ.. ముంబైలోని విక్టోరియా జూబిలీ విద్యాసంస్థలో శానిటరీ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశం ఇస్తారని తెలుసుకుని వెళ్లి, ఆ కోర్సులో చేరారు. ఆ సమయంలోనే మేనమామ కూతురు సుబ్బమ్మతో ఆయన వివాహం జరిగింది. పెళ్లిలో ఆమె పేరును సీతగా ఆయన మార్చారు.

శానిటరీ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తయ్యాక.. రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్ ఉద్యోగం వచ్చింది. అయితే.. పై అధికారులు.. రైల్వే కుళాయిలు కాజేసి, బయట అమ్మి డబ్బు తెచ్చివ్వమని ఒత్తిడి చేయటంతో కొంతకాలం మానసిక సంఘర్షణను అనుభవించి, ఉద్యోగం నుంచి వైదొలగారు. ఈ సమయంలోనే ఆయన తల్లి కన్నుమూయటం, ముద్దులు మూటగట్టే ఏడాది కొడుకు చనిపోవటం జరిగాయి. చివరికి శ్రీరాములు ధర్మపత్ని సీత కూడా క్షయవ్యాధితో మరణించింది. ఇలా.. 28 ఏళ్ల వయసుకే జీవితంలో ‘నా’ వాళ్లంతా ఒక్కక్కరే తనువు చాలించటంతో శ్రీరాములు ఒంటరివాడైపోయాడు.

దీంతో తనకున్నవన్నీ పేదలకు పంచి, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనడానికి, సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. 1930 ఏప్రిల్‌ 1న గాంధీజీని కలిసి, సత్యాగ్రహిగా శిక్షణ పొందాడు. అక్కడే రాట్నం వడకడం, చెప్పులు కుట్టటం చేసేవాడు. అదే సమయంలోనే సబర్మతి ఆశ్రమంలోని సత్యాగ్రహులందర్నీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. అలా తొలిసారి నాసిక్‌లో కారాగారవాసం అనుభవించారు. జైలులోనూ ఆయన సత్యాగ్రహిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

1934 జనవరి 15న ఉత్తర బీహార్‌‌లో వచ్చిన భూకంపం కారణంగా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు మేనల్లుడు నరసింహ గుప్తాతో కలిసి శ్రీరాములు బీహార్‌ వెళ్లి.. అక్కడి సీతామోర్‌ తాలూకాలో నెలల తరబడి సేవాకార్యక్రమాలు చేశారు. తిరిగి గుజరాత్‌ చేరి.. సత్యాగ్రహ ఆశ్రమంలో సేవలందించి.. కొన్నాళ్ళకి తారవాడలోని శ్రమజీవి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకొని, వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించాడు. ఇంతలో మారెళ్ళ గ్రామంలో మేనమామ అవసానదశలో ఉన్నట్లు వార్త రావటంతో శ్రీరాములు అక్కడకు చేరాడు.

Also Read : మార్చి 17న హోలాష్టక్ ప్రారంభం.. ఈ రాశుల వారికి గడ్డుకాలం!

అక్కడే ఆయన తొలిసారి.. నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు 1943 జనవరి 26న మరోసారి అరెస్టై కొన్నాళ్లు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో, మరొకొంత కాలం బళ్ళారి సెంట్రల్‌ జైలులో, ఆలీపూర్‌ క్యాంప్‌ జైల్లో శిక్షలు అనుభవించారు. జైలులో ఉండగా, స్వయంగా ఖైదీల మల మూత్రాల్ని ఎత్తి, మరుగుదొడ్లు కడిగి, జైలును శుభ్రపరచి, సత్యాగ్రహానికి కొత్త అర్థం చెప్పాడు. జైల్లో ఆయన అందరికీ మరో గాంధీ అయ్యారు.

జైలు నుండి విడుదలయ్యాక నెల్లూరు జిల్లాలో అంటరానితన నిర్మూలనకు శ్రీరాములు పూనుకున్నారు. ‘అంటరానితనం వద్దు’ అనే స్లోగన్లు రాసిన అట్టలను మెడలో కట్టుకుని వీధుల వెంట తిరిగి ప్రచారం చేసేవారు. జనం పిచ్చివాడని ఎగతాళి చేసినా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో వితంతు పునర్వివాహం, యానాదులకు సహపంక్తి భోజనాలు, కులాలకు అతీతంగా అనాధల అంతిమ సంస్కారాలు చేశారు. నెల్లూరు వేణుగోపాల స్వామి గుడిలో హరిజనులకు ప్రవేశం కావాలంటూ 1946 మార్చి 7న నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఈ సంగతి గాంధీజీ వరకూ చేరింది. చివరకు ధర్మకర్తలు అంగీకరించడంతో మార్చి 16న తన దీక్ష విరమించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా శ్రీరాములు పేదల పక్షాన పోరాటాలు చేశారు. రేషనింగ్‌ విధానంలో లోపాలని తొలగించమని ప్రభుత్వాన్ని కోరిన కారణంగా.. 1947 అక్టోబర్‌లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపించింది. మహాత్ముడి వర్థంతి(జనవరి 30)ని ‘పీడిత జన సేవాదినంగా’గా ప్రకటించాలని మద్రాసు ప్రభుత్వాన్ని శ్రీరాములు డిమాండ్ చేయగా, ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో 1948 సెప్టెంబర్‌ 10న నిరాహారదీక్షకు దిగాడు. దీంతో శాంతిభద్రతలకు భంగం కలిగించాడనే నెపంతో దీక్ష 11వ రోజున ఆయనను ప్రభుత్వం సి- క్లాసు ఖైదీగా జైలుకు పంపింది.

జైలు నుండి విడుదలయ్యాక సేవాగ్రాం ఆశ్రమానికి వెళ్లి.. 1949 జనవరి 12 నుండి తిరిగి నిరాహారదీక్ష చేశారు. అయితే.. 28 రోజుల తర్వాత డా. బాబూ రాజేంద్రప్రసాద్‌ జోక్యంతో నాటి మద్రాస్‌ ప్రభుత్వం శ్రీరాములు కోరిక మేరకు జనవరి 30ని పీడిత సేవాదినంగా అంగీకరించింది.

ఇక.. శ్రీరాములు సాగించిన సత్యాగ్రహ పోరాటాలలో చివరిది ఆంధ్రరాష్ట్ర సాధనా పోరాటం. ప్రఖ్యాత దేశభక్తుడైన బులుసు సాంబమూర్తి అద్దె ఇంట్లో 1952 అక్టోబర్‌ 19న శ్రీరాములు దీక్ష ఆరంభమైంది. 58 రోజుల పాటు ఈ దీక్ష నిరాటంకంగా సాగింది. చివరకు.. 1952 డిసెంబర్‌ 15 రాత్రి 11. 23 నిముషాలకు శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధనా మహాయజ్ఞంలో తుదిశ్వాస విడిచారు. ఆయన బలిదానం తర్వాత అంతిమంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది.

నికార్సైన సత్యాగ్రహి, పీడిత ప్రజల పక్షపాతి, సమాజసేవకుడు, అసలైన గాంధేయవాది.. అన్నింటికీ మించి గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు జీవితం నేటి తరానికి గొప్ప ఆదర్శం. అమరజీవి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×