EPAPER
Kirrak Couples Episode 1

Margasira Masam : నేటి నుంచే మార్గశిరం ఆరంభం ..!

Margasira Masam : నేటి నుంచే మార్గశిరం ఆరంభం ..!
Margasira Masam 

Margasira Masam : కార్తీకమాసం పూర్తయి.. నేటి నుంచి మనం మార్గశిరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నెలలో పౌర్ణమినాడు.. చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కూడి ఉంటాడు కనుక దీనికి మార్గశిరం అనే పేరు వచ్చింది. ‘మాసానాం మార్గశీర్షోహం’(మాసాల్లో మార్గశిరం నేనే ) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటాన్ని బట్టి ఇదెంత పుణ్యకాలమో మనకు అర్థమవుతుంది. మార్గశిరం రాకతోనే హేమంత రుతువూ ఆరంభమవుతుంది.


మార్గశిర శుద్ధ తదియ నాడు *ఉమామహేశ్వర వ్రతం పేరుతో శివపార్వతులను ఆరాధిస్తారు. అలాగే.. మార్గశిర శుద్ధ పంచమిని నాగపంచమి పేరుతో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో దీనిని శ్రావణ, కార్తీక మాసాల్లో జరుపుకుంటారు.

ఈ మాసంలో అనేక పండుగలున్నాయి. మార్గశిర శుక్ల షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా జరుపుకుంటారు. శివపార్వతుల ముద్దుల బిడ్డ.. సుబ్రహ్మణ్యుడు అవతరించిన రోజు ఇదే. ఆయన దేవతలకు సేనా నాయకుడిగా నిలిచి తారకాసుర సంహారం చేసిన పర్వదినం కూడా ఇదే. ఈ రోజున స్వామిని ఆరాధించటంతో బాటు ప్రావరణ వ్రతం పేరుతో నిరుపేదలకు దుప్పట్లు, కంబళ్లు పంచుతారు. మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.


మార్గశిర శుక్ల అష్టమి నాడే కాలభైరవుడు అవతరించాడు. దీనిని కాలభైరవాష్టమిగా జరుపుకొంటారు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ముందుగా రుద్రుడి ఉగ్రాంశగా భావించే కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలన్నది పెద్దల మాట. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ.. కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవస్వరూపం. కనుక ఈ రోజు శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.

మార్గశిరంలో శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకొంటారు. భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఉన్నత స్థానంలో నిలిచే భగవద్గీత ఆవిర్భవించింది ఈ రోజే. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో తొలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.

ఇక మార్గశిర పౌర్ణమి దత్త జయంతిగా జరుపుకుంటారు. సద్గురువు గొప్పదనాన్ని లోకానికి తెలియజేసిన దత్తాత్రేయుడు అవతరించిన ఈ రోజున భక్తులు ‘గురు చరిత్ర’ను విధిగా పారాయణం చేస్తుంటారు. దీనినే కోరల పూర్ణిమ అనీ అంటారు. వైష్ణవులకు పవిత్రమైన ధనుర్మాసం వచ్చేదీ ఈ నెలలోనే. సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించింది మొదలు మకర సక్రాంతి వరకు ఉండే కాలమే.. ధనుర్మాసం. గోదాదేవి విరచిత.. తిరుప్పావై పాశురాలతో వైష్ణవ ఆలయాలన్నీ ఈ నెలరోజుల పాటు వేకువ జామునుంచే సందడిగా మారతాయి.

మార్గశిర మాసంలోని అన్ని గురువారాల్లో స్త్రీలు నియమానుసారం లక్ష్మీదేవిని పూజించి, పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం రోజున అమ్మవారి పూజ అనంతరం తమ శక్తిని బట్టి ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనిస్తే.. అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి.

ఇన్ని ఆధ్యాత్మిక విశేషాలున్న మహిమాన్విత మార్గశిరంలో మనమూ విష్ణువును ఆరాధించి.. ఆయన ఆశీర్వాదాలను అందుకుందాం.

Tags

Related News

Horoscope 2 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Engilipoola Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసింది, పువ్వులు ఎలా ఎంగిలి అవుతాయో తెలుసుకోండి

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Big Stories

×