Big Stories

Atal Setu: ప్రధాని ప్రారంభించిన అతి పొడవైన వంతెనలో పగుళ్లు.. కాంగ్రెస్ ఫైర్

Mumbai’s Atal Setu: భారత దేశంలోని అతి పొడవైన సముద్ర వంతెనగా పేరున్న అటల్ సేతు – ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రస్తుతం రోడ్డు పగుళ్ల సమస్యను ఎదుర్కొంటున్నది. నవీ ముంబైలోని ఉల్వే వైపు ఉన్నట్టువంటి తారు రోడ్డులో పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ వంతెనను 5 నెలల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పగుళ్లపై కాంగ్రెస్ మాట్లాడుతూ.. ప్రారంభించిన 5 నెలలకే ఈ విధంగా రోడ్ల పగుళ్ల సమస్య ఏర్పడుతున్నదంటే ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని స్పష్టంగా అర్థమవుతుందంటూ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అటల్ సేతుకు అనుసంధానంగా ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డులో చిన్నపాటి పగుళ్లు కనిపించాయని, ఇది ఫుట్ పాత్ ప్రధాన వంతెనలో భాగం కాదని తెలిపింది.

- Advertisement -

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శుక్రవారం అక్కడికి వెళ్లి పగుళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మేం చెబుతున్నది కేవలం ఆరోపణే కాదు.. నిజం. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో దీనిని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ప్రజలకు చూపించేందుకే ఇక్కడికి వచ్చాను. వారు జేబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల కోసం పని చేయడంలేదు. ఈ విధంగా వంతెనను నిర్మించి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎలా దించాలనేదానిపై ప్రజలు సిద్ధం కావాలి’ అంటూ నానా పటోలే అన్నారు.

- Advertisement -

‘ఈ వంతెనకు అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టారు. మనమందరం ఆయనను గౌరవిస్తాం. కానీ, బ్రిడ్జికి ఆయన పేరు పెట్టినప్పుడు ఇక్కడ అవినీతి జరగడం దురదృష్టకరం. ప్రధాని మోదీ వీటన్నిటినీ గమనించాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆరోపణలపై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) స్పందించింది. అటల్ సేతు ప్రధాన భాగంలో ఎటువంటి పగుళ్లు లేవని తెలిపింది. ‘అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్డులో చిన్నపాటి పగుళ్లు మాత్రమే కనిపించాయి. ఇది వంతెనలో భాగం కాదు.. కానీ, వంతెనను కలుపుతూ వెళ్లే సర్వీస్ రోడ్డు మాత్రమే. ప్రాజెక్టులో నిర్మాణ లోపాల వల్ల పగుళ్లు రాలేదు. ఆ పగుళ్ల వల్ల వంతెన నిర్మాణానికి ఎలాంటి ముప్పు వాటిళ్లదు’ అని ఎంఎంఆర్డీఏ స్పష్టం చేసింది.

ఇటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపై మాట్లాడారు. అటల్ సేతుపై ఎలాంటి పగుళ్లు లేవన్నారు. అటల్ సేతుకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ అసత్యపు ప్రచారం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సీఎం మమత క్లారిటీ, బరిలో ఉంటే ప్రియాంక తరపు ప్రచారం…

రూ. 17,840 కోట్లతో నిర్మించినటువంటి ఈ వెంతెనను ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇది ముంబై మరియు నవీ ముంబై మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు ఉద్దేశించబడినటువంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News