Sleeping Daily 4 Hours| ప్రపంచంలో చాలామంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే కొంతమంది మాత్రం చాలా తక్కువ గంటలు నిద్రపోయినా ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. వాళ్లలో అలసట, ఆందోళన కనిపించదు. పైగా చురుగ్గా, చక్కగా తమ పనులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూస్తే అసూయగా అనిపించడమే కాకుండా, ఇదెలా సాధ్యమవుతుందంటూ ఆశ్చర్యం కలుగుతుంది.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ప్రతి మనిషిపై నిద్ర ప్రభావం ఒకేలా ఉండకపోవచ్చు. అయితే అందుకు కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా లభించలేదు. కానీ తాజాగా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన సమాధానాన్ని కనుగొన్నట్లు తెలిపారు.
కొంతమంది వ్యక్తులు రాత్రి కేవలం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే నిద్రపోయినా, ఉదయం చురుగ్గా, శక్తివంతంగా ఉండగలగడం వెనుక అసలైన కారణం — అరుదైన జన్యు మార్పు (Genetic Mutation) అని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. నిద్రపోవడం, నిద్రమేల్కొనే ప్రక్రియ (Sleep-Wake Cycle) పై ఈ జన్యుపరివర్తనం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాంటి వారికి తక్కువ సమయంలోనే గాఢ నిద్ర కలుగుతుంది. దీంతో శరీరానికి కావాల్సిన విశ్రాంతి పూర్తవుతుందని వెల్లడించారు.
సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకూ నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. లేదంటే అల్జీమర్స్, గుండె సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తారు. కానీ ఈ అరుదైన జన్యు మార్పు ఉన్న వ్యక్తులు మాత్రం తక్కువసేపు నిద్రపోయినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటం గమనార్హం. అందుకే ఇలాంటి వారిని ‘అదృష్టవంతులు’ అని శాస్త్రావేత్తలు అంటున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు శరీరం కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక జన్యు ఉన్న వ్యక్తుల శరీరంలో మాత్రం నిద్రలో ఉన్నప్పటికీ ఎక్కువ స్థాయిలో జీవక్రియలు సాగుతాయని కాలిఫోర్నియాలోని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు.
Also Read: రాత్రి నిద్రపట్టడం లేదా? కమ్మని నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి
అంతేకాదు, ఈ వ్యక్తుల్లో SIK3-N783Y అనే అరుదైన జన్యు మ్యూటేషన్ (mutation) ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల వారు తక్కువ సమయంలోనే గాఢనిద్రలోకి వెళ్ళగలుగుతారు.
ఈ మ్యుటేషన్‌పై పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. ఎలుకలలో ఈ జన్యు ప్రవేశపెట్టిన తర్వాత, అవి సాధారణ ఎలుకలతో పోల్చితే చాలా తక్కువ నిద్రపోతున్నాయని గుర్తించారు. ఉదాహరణకి, ఈ మ్యుటేషన్ ఉన్న ఎలుకలు సగటున 31 నిమిషాలే నిద్రపోతే, మిగిలిన ఎలుకలు 54 నిమిషాలు పైగా నిద్రపోయినట్టు గుర్తించారు.
అంతేకాకుండా.. ఈ మ్యూటేషన్ (NSS hSIK3-N783Y) వల్ల నిద్రపోయే సమయంలో మెదడు నుండి వచ్చే ఈఈజీ డెల్టా శక్తి స్థాయి పెరిగిందని కూడా పరిశోధకులు తెలిపారు. ఇది శరీరంలో నిర్మాణ మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ మ్యూటేషన్ ప్రోటీన్ కీ ఫాస్ఫేట్ అణువులను ఇతర ప్రోటీన్లకు బదిలీ చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ఈ అధ్యయన ఫలితాలు నిద్రలేమితో బాధపడే వారికి కొత్త చికిత్సా మార్గాలు చూపించగలవని, అలాగే నిద్ర నాణ్యతను మెరుగుపర్చే కొత్త అవకాశాలను తెరువగలవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.