TDP Politics: యనమల రామకృష్ణుడు టీడీపీలో కురువృద్ధుడు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో సమానంగా రాజకీయాలు చేసిన వ్యక్తి … టిడిపిలో కీలకంగా వ్యవహరించి, చంద్రబాబుకు అండగా 43 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న నాయకుడు… టిడిపి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పదవిలో కొనసాగుతూ అవసరమైన సమయంలో నేనున్నా అంటూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ … 1983 నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేసిన ఆ నాయకుడికి తీరని కోరిక ఉండిపోయిందంట … కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా రిటైర్ అయిన యనమల రాజ్యసభ సీటు ఆశించారంట.. అది దక్కకపోవడంతో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి గౌరవంగా పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారంట. కానీ ప్రస్తుతం ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టి నీ అవసరం లేదన్నట్లు టిడిపి అధిష్టానం వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
1983 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన యనమల
టీడీపీ ఆవిర్భావంతో 1983లో రాజకీయాల్లో అడుగుపెట్టి తొలిసారి ఎమ్మెల్యే అయ్యి ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు.. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి మంత్రి పదవి చేపట్టారు… అప్పటినుండి వరుసగా 2004 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపించారు. 1983లో ఎన్టీఆర్ తొలి క్యాబినెట్లో న్యాయ, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన యనమల,1985-89 మధ్య రెండో సారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా బాధ్యతలు
1989-94 కాలంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా, తర్వాత టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ స్పీకర్ గా యనమల పనిచేసి తనదైన మార్క్ వేసుకున్నారు. 1999-2004 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా తిరిగి 2004 నుండి పీఏసీ చైర్మన్‌గా పదవులు నిర్వహించారు. 2013 నుండి 2025 మార్చి నెల వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన యనమల రామకృష్ణుడు 2014- 19 మధ్య మరోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు… 2014లో టిడిపి విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యి ఢిల్లీ వెళ్లాలని ఎన్నో కలలు కన్నారు. రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా అత్యంత కీలకమైన పోర్టుఫోలియో చూసిన యనమల రామకృష్ణుడికి అప్పుడు ఆ అవకాశం దక్కలేదు.
గవర్నర్‌గా గైరవప్రదనమైన రిటైర్ మెంట్ కోరుకుంటున్నారా?
ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం చేసిన యనమల రామకృష్ణుడు రాజ్ భవన్ లో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించి గౌరవప్రదమైన పదవి విరమణ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. దేశ పరిపాలనకు రాష్ట్రపతి ముద్ర ఎంత ముఖ్యమో రాష్ట్ర పాలల్లో గవర్నర్ కూడా అంతే ముఖ్యం… రాష్ట్రంలో అధికారాన్ని చలాయించేది ముఖ్యమంత్రి అయినా రాజభవన్ లో ఉండి రాజ్ పాల్ గా ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలకు ముద్రవేయాల్సింది మాత్రం రాష్ట్ర గవర్నరే … అలాంటి అత్యంత గౌరవప్రదమైన గవర్నర్ పదవిని రాజకీయాలను వీడి రాజ్యాంగ పరిరక్షకుడిగా పదవిని అందుకుంటే యనమల రామకృష్ణుడు జీవితంలో తాను కన్న కలను నెరవేర్చుకున్న వారు అవుతారు.. అయితే ఇప్పట్లో యనమల రామకృష్ణుడు కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు..
అశోక్‌గజపతి రాజుని గవర్నర్ చేసిన టీడీపీ
ఎందుకంటే టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి బిజెపితో జతకట్టి కేంద్రంలో భాగస్వామిగా కీలకంగా మారడంతో ఇప్పటికే ఒక గవర్నర్ పదవిని కేంద్రం ఆ పార్టీకి కేటాయించింది. టీడపీలో సీనియర్ నాయకుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన పూసపాటి సంస్థానాధీసుడు, దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతి రాజును గవర్నర్ ను చేసింది టిడిపి.. పార్టీకి రాయల్ గా ఉండడమే కాకుండా, మృదు స్వభావిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గవర్నర్ పదవిని కట్టబెట్టారు… ఇప్పుడు ఇదే యనమల రామకృష్ణుడుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంట.. ఆశగా ఎదురుచూసిన గవర్నర్ పదవి అశోక్ గజపతిరాజుకు వెళ్లిపోవడంతో తన పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో యనమల రామకృష్ణుడు ఉన్నట్లు తెలుస్తోంది
టీడీపీకి సమస్య వచ్చినప్పుడు అడ్డుగోడగా నిలబడ్డారన్న గుడ్‌విల్..
43 సంవత్సరాలుగా టిడిపితో సుదీర్ఘమైన అనుబంధాన్ని పెంచుకుని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఏ పదవిలో ఉన్నా సరే టిడిపికి సమస్య వచ్చినప్పుడు అడ్డుగోడగా నిలబడ్డారన్న గుడ్‌విల్ యనమల రామకృష్ణుడికి ఉంది.. 1996లో ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి, చంద్రబాబుకు పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా రావడం వెనక అప్పుడు స్పీకర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు కీలకంగా వ్యవహరించారు.. అప్పటి నుండి ఇప్పటివరకు చంద్రబాబు టిడిపిలో కీలకమైన పదవులలో యనమల రామకృష్ణుడును నియమిస్తూనే వచ్చారు.. అయితే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలనుకున్న యనమల రామకృష్ణుడు కోరిక విజయనగరం కోట వైపు వెళ్లిపోవడంతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సన్నిహితులు దగ్గర యనమల రామకృష్ణుడు వాపోతున్నారంట
టీడీపీకి మరో గవర్నర్ పదవి ఇప్పట్లో కష్టమేనా?
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేపట్టడంలో టీడీపీ పార్టీ కీలకంగా మారింది.. దీంతో టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అవకాశం ఉన్నచోట ఆ రాష్ట్ర గవర్నర్లుగా నియమించడానికి మోడీ సర్కార్ సానుకూలంగా ఉంది.. దీనిలో భాగంగానే ఏపీ కోటాలో టీడీపీకి అశోక్ గజపతిరాజును గవర్నర్ గా అవకాశం ఇచ్చింది.. టీడీపీకి మరో గవర్నర్ పదవి అంటే అది ఇప్పట్లో జరగకపోవచ్చు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకుల ఆలోచనలు ఎప్పుడూ కూడా అవసరమైతే తప్ప మిత్రపక్షాలకు కీలకమైన పదవులను ఇవ్వరు.. ప్రస్తుతం కేంద్రానికి టిడిపి మద్దతు ఆక్సిజన్ లా ఉండడంతో ఇప్పటికే ఒక గవర్నర్ పదవి ఇచ్చారు..
మరో గవర్నర్ పదవి దక్కితే రాయలసీమ నేతకు అవకాశం
75 సంవత్సరాల వయసు దాటిన యనమల రామకృష్ణుడు ఈ ఏడాది మార్చి నెల వరకు ఎమ్మెల్సీగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న యనమల రామకృష్ణుడు టిడిపి పార్టీ పదవులకు మాత్రం పని చేస్తున్నారు.. 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న యనమల రామకృష్ణుడు గౌరవప్రదమైన పదవీ విరమణ చేయడానికి గవర్నర్ పదవిని బలంగా ఆశిస్తున్నారంట. కానీ ఇప్పటికే గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజును నియమించడం, మరో గవర్నర్ పదవికి టిడిపికి అవకాశం వస్తే రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు ముందు వరుసలో ఉన్నారనే ప్రచారం జరుగుతుండడంతో యనమల రామకృష్ణుడు వర్గం కలవరపడుతుందంట.
Also Read: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. డేంజర్‌లో విజయవాడ
43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పార్టీకి ఎన్నో సేవలు చేశానని యనమల రామకృష్ణుడు సన్నిహితులు దగ్గర అంటున్నా.. టిడిపి కూడా అదే స్థాయిలో యనమలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.. అంతేకాకుండా ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు కుమార్తె, ఏలూరు ఎంపీగా యనమల అల్లుడు, రాయలసీమలో ఎమ్మెల్యేగా యనమల వియ్యంకుడు సుధాకర్ నాయుడు ఇలా యనమలకు చెందిన ఒకే కుటుంబం వాళ్లకు పదవులు ఉండడంతో యనమలకు ప్రస్తుతం గవర్నర్ పదవి కానీ, ఒక రాజ్యసభ సీటు కానీ దగ్గర్లో కనిపించడం లేదంటున్నారు.. అయితే యనమలు మాత్రం సీఎం చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో తాను అండగా ఉండడం మాత్రమే కాక అవసరం ఉన్న ప్రతిసారి అడ్డుగోడలా నిలబడ్డాను కాబట్టి తనను రాజ్ భవన్ కు పంపాలా లేదా అనేది చంద్రబాబు నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని సన్నిహితులు దగ్గర అంటున్నారంట.. మరి యనమల రామకృష్ణుడు రాజభవన్ లో రాజ్ పాల్ గా అడుగు పెడతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
Story By Vamshi Krishna, Bigtv