Tamil Nadu Governor Case: కాదేదీ రాజకీయలకు అనర్హం.. ఎవ్రిథింగ్ ఈజ్ పొలిటికల్ అన్నట్లే ఇంతకాలం నడిచింది. అయితే, తాజాగా సుప్రీం కోర్డు దీనికి చెక్ పెట్టింది. దేశానికి రాష్ట్రపతి ఎంత కీలకమో రాష్ట్రాలకు గవర్నర్ పదవి అంతే కీలకం. వీళ్లద్దరూ భారత రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయో లేదో చూడాలి తప్ప రాజకీయ పార్టీల్లా పాలిటిక్స్ చేస్తే పనిచేయదని క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ల విచక్షణాధికారానికి కత్తెర వేసింది. ఇంతకీ, సుప్రీమ్ సంచలన తీర్పు ఏం చెప్పింది..? దీని ప్రభావం ఇకపై ఎలా ఉండబోతోంది..? ప్రజలెన్నుకున్న పాలకులు చెప్పినట్లు, గవర్నర్ నడుచుకోవాల్సిందేనా..?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాజ్‌భవన్‌లో హాల్ట్
ఇండియాలో పాలిటిక్స్ ఎంత పీక్స్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, పాలనలో మాత్రం స్వార్థపూరిత రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజ్‌భవన్‌కు కూడా రాజ్యాంగం అధికారాలు ఇచ్చింది భారత రాజ్యాంగం. ఒకవేళ, ప్రజా ప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నా.. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు సక్రమమైన సలహాలు ఇవ్వడానికి రాజ్‌భవన్‌లో ఉండే రాష్ట్రపతికి, గవర్నర్లకు విచక్షణాధికారాలు కూడా కట్టబెట్టింది. అయితే, ఇక్కడ కూడా పొలిటికల్ వ్యవహారాలకే పెద్దపీట వేస్తున్న పరిస్థితి. “నా ప్రభుత్వం ఫలానా పని చేసిందని గర్వగా చెబుతున్నాను” అనాల్సిన గవర్నర్లు ఆ ప్రభుత్వాలతోనే ఫైట్ చేస్తున్నారు.
బిల్లులు ఇష్టమొచ్చినట్లు ఆపేస్తే కుదరదన్న సుప్రీం కోర్టు
వివాదాస్పద బిల్లులైతే ఓకే గానీ.. పాలనా పరమైన కీలక బిల్లుల్ని కూడా పక్కనపెట్టేస్తోంది రాజ్‌భవన్. కొన్ని సందర్భాల్లో పాలనకు కూడా అడ్డొస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని రాజ్‌భవన్‌లోనే తొక్కి పెట్టి, కక్ష్యపూరింతంగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌లను రాజకీయంగా ఉపయోగించుకునే దుస్థితి ఇప్పటిది కాకపోయినప్పటికీ… ఇటీవల కాలంలో ఇది మరింత దిగజారింది. అందుకే, సుప్రీం కోర్టు ఫైనల్ రూల్ ఇచ్చేసింది. ఇకపై బిల్లులను ఇష్టం వచ్చినట్లు ఆపేస్తామంటే కదరదనీ.. గవర్నర్ల విచక్షణాధికారానికి సుప్రీం కోర్టు కత్తెర వేసింది. ప్రజాస్వామ్యాన్ని దాటి గవర్నర్లకైనా… రాష్ట్రపతికైనా సూపర్ అధికారాలు లేవంటూ కుండబద్దలు కొట్టింది.
రాష్ట్రాల గవర్నర్ల తీరుపై సుప్రీం కోర్టుకు ఫిర్యాదులు
గత దశాబ్ధంగా దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్ల తీరుపై సుప్రీం కోర్టుకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అసెంబ్లీలో ఆమోదించి, రాజ్‌భవన్‌కు పంపుతున్న బిల్లులను సంవత్సరాల తరబడి ఆపేస్తున్నారంటూ ఆందోళనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి కేరళ, తమిళనాడు, తెలంగాణా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జార్ఖండ్ వరకు… తమ గవర్నర్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు గుప్పించాయి. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి గవర్నర్‌ను తొలగించమని వినతులు కూడా పెట్టారు. ఆయా రాష్ట్రాలు..’తమ గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల కొమ్ముకాస్తున్నారని’ చెబితే… ‘గవర్నర్ ఎందులోనైనా కలుగచేసుకుంటారు’ అనే స్థాయిలో గవర్నర్లు మాట్లాడారు.
గవర్నర్ పదవి అసంబద్ధం, రద్దు చేయాలని కొందరు డిమాండ్
అయితే, ఈ పరిస్థితి నాన్ బిజెపి ప్రభుత్వం ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే కేంద్రం నామినేట్ చేసిన గవర్నర్‌దే రూలింగ్ అనే లెవల్‌కు వెళ్లింది. దేశంలోని మాజీ న్యాయమూర్తులు కూడా ఈ ధోరణిని రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలైతే… గవర్నర్ పదవిని “అసంబద్ధం”గా పేర్కొంటూ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. ఇక, ఈ యుద్ధానికి ఇప్పుడు ముగింపు వచ్చింది. ఇటీవల, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్లగా.. అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 11న ఈ తీర్పు కాపీని బహిరంగపరిచింది కోర్టు.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి Vs తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లులను ఆమోదించకుండా పక్కన పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తేల్చి చెప్పింది. అలాంటి వీటో అధికారాలు గవర్నర్‌కు ఉండబోవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. తమిళనాడు అసెంబ్లీ తీర్మానించి రాజ్‌భవన్‌కు పంపించిన 10 బిల్లులకు సంబంధించి 2020 నుండీ గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్టవిరుద్ధమని ప్రకటించింది.
దీనివల్ల రాష్ట్రంలో చట్టాల రూపకల్పన ప్రక్రియ ఆలస్యం
సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బిల్లులు ఉంటేనే గానీ వాటిని పునఃపరిశీలనకు పంపించే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను గవర్నర్ రవి ఆమోదించకుండా ఉద్దేశపూరకంగా అడ్డుకుంటున్నారనేది ప్రభుత్వం వాదన. దీన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయగా… రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ తన విధులను నిర్వర్తించడానికి స్పష్టంగా కాలపరిమితి లేదని, ఎలాంటి సమయ పరిమితులు లేనప్పటికీ, తనకు అందిన బిల్లులను ఆమోదించకపోవడం, దీనివల్ల రాష్ట్రంలో చట్టాల రూపకల్పన ప్రక్రియను ఆలస్యం చేయడానికి అంగీకరించినట్టయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆర్టికల్ 200ని ఆర్టికల్ 163తో పాటు చదవాలన్న కోర్టు
అయితే, శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్ధేశిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రధమం. ‘బిల్లులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసన నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చన్న అర్థం వచ్చేలా రాజ్యాంగంలోని 200వ అధికరణాన్ని చదువుకోకూడదు’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టికల్ 200ని ఆర్టికల్ 163తో పాటు చదవాలని కోర్టు వెల్లడించింది. దీని ప్రకారం.. క్యాబినెట్ సలహా మేరకు గవర్నర్ చర్యు తీసుకోడానికి కట్టుబడి ఉండాలని” పేర్కొంది.
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విధులైనా న్యాయ సమీక్షకు లోబడే
ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును.. మళ్లొకసారి అసెంబ్లీ ఆమోదిస్తే… రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం తెల్చిచెప్పింది. ఈ సందర్భంగా.. భారత రాష్ట్రపతికి కూడా దీన్నే వర్తింపజేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలలలోపు కచ్ఛితంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసింది. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విధులు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉన్నట్లు పేర్కొంది.
ఆర్టికల్ 201 కింద, రాష్ట్రపతికి “పాకెట్ వీటో” లేదు -సుప్రీమ్
ఆర్టికల్ 201 ప్రకారం, ఒక బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రిజర్వ్ చేసినప్పుడు.. రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలిపారనో.. లేదంటే, ఆమోదించకుండా నిలిపివేశారనో ప్రకటించాలి. అయితే, రాజ్యాంగంలో దీనికి ఎటువంటి కాలపరిమితి లేకపోవడం గవర్నర్లకు లూప్ హోల్‌గా దొరికింది. “చట్టం ప్రకారం ఏదైనా అధికారాన్ని వినియోగించడానికి కాలపరిమితి నిర్దేశించబడనప్పటికీ.. దానిని సరైన సమయంలోపు వినియోగించాలని చట్టం చెబుతోంది. కాగా.. ఆర్టికల్ 201 కింద, రాష్ట్రపతికి “పాకెట్ వీటో” లేదని కూడా సుప్రీమ్ కోర్టు ధర్మాసనం వెల్లడించింది.
బాధిత రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చన్న కోర్టు
మూడు నెలల వ్యవధికి మించి ఆలస్యం జరిగితే, తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియజేయాలని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. గడువులోపు ఎటువంటి చర్య తీసుకోకపోతే, బాధిత రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చని కోర్టు వెల్లడించింది. ఇక, రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన ప్రశ్నల కారణంగా బిల్లును రిజర్వ్ చేస్తే.. కార్యనిర్వాహకులు కోర్టుల పాత్రను పోషించకూడదనీ.. అలాంటి ప్రశ్నలను ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు సూచించాలని పేర్కొంది.
రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య గొడవలు సమసిపోతాయా..?
సుప్రీమ్ కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత..తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇదొక సైద్ధాంతిక విజయమని అన్నారు. ఈ తీర్పు ఒక్క తమిళనాడుకు మాత్రమే కాదు… భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విజయంగా పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, సమాఖ్యవాదాన్ని సపోర్ట్ చేసేదని అన్నారు. అయితే, ఈ తీర్పుతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం తగ్గుతుందా…? రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య గొడవలు సమసిపోతాయా..?
రాజ్‌భవన్ “పాకెట్ వీటో” చట్టవిరుద్ధం, తప్పు” -సుప్రీం
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజ్‌భవన్‌కు మధ్య సంబంధం మెరుగవుతుందా.. మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందా అనే చర్చ నడుస్తుంది. అయితే, కోర్టు తీర్పును బట్టి… రాజ్‌భవన్‌కు ఉన్న వర్చువల్ “పాకెట్ వీటో”ను “చట్టవిరుద్ధం, తప్పు” అనేది స్పష్టం అవుతుంది. ఈ తీర్పు ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రానికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన శాసనసభ ద్వారా వచ్చిన ప్రజల అభీష్టాన్ని గౌరవించాలని ఈ తీర్పు క్లారిటీ ఇచ్చింది. అయితే, గత దశాబ్ధ కాలంగా బిజెపి యేతర రాష్ట్రాల్లో.. గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్య గొడవల మధ్య ఇలాంటి తీర్పు రావడం కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
పంజాబ్ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు
ఇకపైన, గవర్నర్ పదవి రాజ్యాంగపరంగా ముఖ్యమైందే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే అధికార కేంద్రంగా ఉండకూడదని ఈ తీర్పు స్పష్టం చేసింది. అయితే, గవర్నర్లను అతిగా వ్యవహరించవద్దని కోర్టులు హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. పంజాబ్ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించి నాలుగైదేళ్ల తర్వాత బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీనిపై స్పందించిన కోర్టు… ‘గవర్నర్‌కు రాజ్యాంగం పట్ల కానీ సుప్రీం కోర్టు పట్ల కానీ వీసమెత్తు గౌరవం లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
రాష్ట్రాల్లో గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం
అయితే, తమిళనాడు కేసులో తీర్పు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపడం ఖాయం. ఇప్పటికే.. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు సుప్రీమ్ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అప్పటి గవర్నర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. అలాగే, కర్ణాటక, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు చెలరేగాయి. గతంలో తెలంగాణలోనూ కేసీఆర్, తమిళిసై సౌందర్‌రాజన్ మధ్య విబేధాలు వచ్చాయి. నిజానికి, గవర్నర్.. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి.
స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా ఉండాల్సిన గవర్నర్
కేంద్రానికి రాష్ట్ర వ్యవహారాల గురించి తెలియజేస్తూ ఉండాలి. అలాగే, రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వం దాని నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నిర్ధారించడం వంటివి గవర్నర్ బాధ్యతలుగా ఉంటాయి. అలా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తొత్తులుగా ఉండటమే పరిస్థితిని ఇక్కడి వరకూ తెచ్చింది. అందుకే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు చాలా చురుకుగా పనిచేయాలని కోర్టు పేర్కొంది. ఓ స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు సూచించింది. రాజకీయ ప్రేరణతో గవర్నర్ పనిచేయకూడాదని ధర్మాసనం తెలిపింది. సమస్యలు పరిష్కరించడంలో గవర్నర్ ఓ దూతలా ఉండాలనీ… ఓ ఉత్ప్రేరకంగా పనిచేయాలని కోర్టు చెప్పింది. రాజ్యాంగ విలువల్ని గవర్నర్లు రక్షించాలని కోర్టు తెలిపింది.
కోర్టు స్టే విధిస్తే దానితో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదు
గతంలో కూడా తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మండిపడ్డారు. ఓ క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్ముడిని తిరిగి నియమించకపోవడంపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఒక నేరాభియోగంపై కోర్టు స్టే విధించినప్పుడు దానితో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
గతేడాది మార్చి 11న సుప్రీంకోర్టు స్టేపై విరుద్ధంగా గవర్నర్ నిర్ణయం
పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించేలా గవర్నర్‌కు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం స్టాలిన్ పిటిషన్‌లో కోరారు. పొన్ముడికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై గతేడాది మార్చి 11న సుప్రీంకోర్టు స్టే విధించింది. మూడేండ్ల జైలు శిక్ష నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. అయితే, గవర్నర్ దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు… “ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఇలా ఎలా చేస్తారని” ప్రశ్నించింది. “గవర్నర్.. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే రాజ్యాంగబద్ధ అధిపతి మాత్రమేననీ… ఆ పదవికి కేవలం సలహాలిచ్చే అధికారం మాత్రమే ఉంది” అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు
అయితే, ఒకప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో.. రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలను, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను, నిష్పాక్షికంగా ఉన్న వ్యక్తులను గవర్నర్లుగా నియమించడం ఉండేది. అప్పట్లో.. రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా ఉన్న బి.ఎన్.రావు, గవర్నర్‌ను ప్రాంతీయ శాసనసభలు రహస్య ఓటు ద్వారా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. ఇక, ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్ మరో అడుగు ముందుకేసి… గవర్నర్‌ను రాష్ట్ర ప్రజలు నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నుకోవాలనీ.. “దుష్ప్రవర్తన” ఉంటే అభిశంసించవచ్చని సిఫార్సు చేశారు. నాడు, జయప్రకాష్ నారాయణ్ కూడా ఒక సూచన చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ నియామకాన్ని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులు ఎంపిక చేసిన నలుగురు వ్యక్తుల ప్యానెల్ నుండి తీసుకోవాలని అన్నారు. అయితే, తర్వాత కాలంలో… అనేక కారణాల వల్ల నామినేటెడ్ గవర్నర్‌కు ప్రాధాన్యత ఇస్తూపోయారు.
“గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతి..
ఇప్పుడు, నిజాయితీ లోపిస్తున్న రాజకీయాలతో పాటు ఎన్నికైన గవర్నర్ కూడా ముఖ్యమంత్రితో విభేదించే పరిస్థితులు వచ్చాయి. ప్రజాదరణ కారణంగా, గవర్నర్ అంతటి వ్యక్తి… వేర్పాటువాద ధోరణులను ప్రోత్సహించడం.. లేదంటే, ముఖ్యమంత్రితో చేతులు కలిపి కేంద్రం ఆదేశాలను ధిక్కరించే పరిస్థితుల కనిపించాయి. అయితే, గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతి కాబట్టి.. ఈ పదవిని ఎన్నుకోవడానికి సమయాన్ని, డబ్బును ఖర్చు చేయకూడదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ సమస్యను పరిష్కరించారు. అయితే, గవర్నర్లు కేంద్రంలోని పాలక పార్టీకి ప్రాతినిధ్యం వహించరనీ… రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టంగా చెప్పారు.
1983లో సర్కారియా కమిషన్ సిఫార్సులు
గవర్నర్లను నియమించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముఖ్యమంత్రులను సంప్రదిస్తుందని కూడా అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి వీటో అధికారం ఉంటుందని టి.టి. కృష్ణమాచారి సూచించారు. ఇక, 1983లో సర్కారియా కమిషన్ కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేసింది. ఉపాధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌ను కూడా సంప్రదించాలని చెప్పింది. అయితే, ఈ సిఫార్సులలో ఏవీ కేంద్రంలోని ఏ పాలక పార్టీ కూడా అనుసరించలేదు. అందుకే, ఈ దుస్థితి వచ్చిందనేది నిపుణుల అభిప్రాయం.
తాము అతీతులమన్న తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్లు
నిజానికి, గవర్నర్ స్థాయిలో ఉన్నవారికి కోర్టుల నుండి మొట్టికాయలు పడటం.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పదేపదే చెప్పాల్సిరావడం ఆ పదవికి, మొత్తంగా రాజ్‌భవన్‌కే అవమానంగా మారుతున్న పరిస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, రాష్ట్రాల అధికారాలకు తాము అతీతులమన్న తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్లకు ఈ తీర్పు స్పష్టమైన హెచ్చరికే అనుకోవాలి. కాలపరిమితులను దాటితే గవర్నర్ల నిర్ణయాలు కూడా న్యాయసమీక్ష ముందు నిలవాల్సివస్తుందన్న సూచన చాలా మార్పులను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.
సుప్రీం తీర్పుతో గవర్నర్లు దారిలోకి వస్తారనే అభిప్రాయం
రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న గవర్నర్ల వల్ల అత్యున్నతమైన ఆ ఉన్నత వ్యవస్థకు ఇలాంటి నిబంధనలు విధించాల్సి వచ్చింది. అయితే, ఇకపై ఇలాంటి పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఆశీస్తున్నారు. గవర్నర్ల నియామకంలో మార్పులు వచ్చినా రాకపోయినా.. ఇప్పుడు, సుప్రీం తీర్పుతో.. గవర్నర్లు దారిలోకి వస్తారనడంలో సందేహం లేదు. ఇక, ఎలాగూ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి కూడా దాదాపు హెచ్చరికలు వెళ్లినట్లే భావించాలి గనుక.. సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకునే సాహసం అయితే చేయరనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది, ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య సఖ్యతను కుదురుస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.