Big Stories

Deputy CM Pawan Kalyan: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. యాక్షన్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Deputy Chief Minister Pawan Kalyan Responsibilities: బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే వరుసగా చేసిన సమీక్షలతో పవన్ యాక్షన్ ప్లాన్‌పై క్లారిటీగా ఉన్నారనే సంకేతాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయా శాఖల ప్రగతి, జరిగిన పనులు, చేయాల్సిన అభివృద్ధిని పవన్ సమీక్షిస్తున్న తీరు, శాఖాపరమైన పాలనలో కొత్త ఉత్సాహం తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు గ్రామాల భవితకు కొత్త మార్గాలు వేస్తుందనే భావన అందరిలోనూ కలిగించినట్లు పలు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

- Advertisement -

రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ పరిథిలోని ఐదు శాఖలపై పట్టు సాధించే దిశగా తొలి అడుగులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, అటవీ, శాస్ర్త సాంకేతిక శాఖల కీలక బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆ శాఖల పనితీరుపై దృష్టి సారించారు. శాఖల పనితీరును, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను ఆసాంతం వింటూ వాటిలోని సందేహాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్‌కు స్వతహాగా తెలిసిన అంశాలను అధికారుల వద్ద ప్రస్తావిస్తూ.. శాఖల్లోని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

విద్యార్థిలా అన్నీ తెలుసుకుంటాను మీరే అన్ని వివరించాలి అని మొదటి సమీక్షలోనే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూడీ సీఎం పవన్ చెప్పారట. అలాగని, అధికారుల దగ్గర అమాయకంగానూ లేరూ.. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవిన్యూ అధికారులను పవన్ ఆదేశించారు.

Also Read: “రాష్ట్రం నీ తాత జాగీరా” : జగన్ పై మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్ధిక సంఘం నిధులు CFMSకు ఎందుకు మళ్లించారని అధికారులను నిలదీశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఛీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపు పై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కేంద్రం పంపిన నిధులు మళ్లింపుపై నిలదీయడంతో నీళ్లు నమిలిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏయే ఆర్థిక సంవత్సరం, ఎంత మేర నిధులను మళ్లించారనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను కోరారు. అయితే, గ్రామాల్లో నీటి కాలుష్యాన్ని గుర్తించామని ఒప్పుకున్న అధికారులు గ్రామాల్లో ప్రతి బుధవారం కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా తాగు నీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తున్నారో అక్కడ శాంపిళ్లు తీసి పరీక్షించే వ్యవస్థ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో 10,047 శాంపిళ్లు తీస్తే 217 శాంపిళ్లలో బాక్టీరియా వల్ల కలుషితం అయినట్లు గుర్తించామని తెలిపారు.

అయితే, తాగు నీటి కాలుష్యం మూలంగానే డయేరియా, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని, శుద్ధమైన జలం అందించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏటా వర్షా కాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయని, వారి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి గ్రామాల్లో అతిసారం కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల భయం లేకుండా చూడాలని అధికారులను సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని, తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Also Read: Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

ఈ మేరకు కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా ప్రబలడంతో పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, RWS, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కూడా అధికారులను డిప్యూటీ సీఎం కోరారు. రక్షిత మంచి నీటి సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి వేయించి నీటిని సరఫరా చేయడం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని పని చేయాలని స్పష్టంగా చెప్పారు.

అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్డు అనుసంధానం మెరుగుపడాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. దాదాపు ఆయా శాఖల్లోని అన్ని విషయాల మీద అధికారులు చేస్తున్న ప్రజెంటేషన్‌ను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిని కూలంకషంగా సమీక్ష చేస్తున్నారని సమాచారం. ఇక, రాష్ట్రంలో కీలకమైన అటవీశాఖపై సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత… పెంపుదలకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు.. రాష్ట్రంలో క్రమంగా క్షీణిస్తున్న అడవుల అంశాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తుఫాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులు ధ్వంసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఏపీకున్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో మడ అడువుల సంరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మడ అడవులు ధ్వంసం చేసే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల రక్షణ, పెంపుదలకు కట్టుబడి పనిచేయాలని వాటి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆ శాఖ అధికారులకు ప్రత్యేకంగా చెప్పారు. అలాగే, అటవీ పరిరక్షణ, పర్యావరణ సంబంధిత అంశాలపై సంగ్రంగా చర్చించి, ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు..

శాస్త్ర, సాంకేతిక శాఖాధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం శాఖ పని తీరు, శాఖ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని కలిగించేందుకు, భవిష్యత్తులో అవసరం అయ్యే కొత్త టెక్నాలజీపై ఆసక్తిని పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆవిష్కరణలు దిశగా విద్యార్థులను తీర్చేదిద్దే ప్రయత్నం వేగంగా కొనసాగాలని అన్నారు.

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన పవన్.. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్‌లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ఇక, ఎన్డీయే కూటమిలో భాగంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన సూపర్ 6 హామీలతో పాటు.. ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాల అమలులో కూడా పవన్ తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Minister Parthasarathi: గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: మంత్రి పార్థసారథి

ఇప్పటికే తన పరిథిలోని శాఖలపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్న డిప్యూటీ సీఎం.. రాబోయే రోజుల్లో మరింత వేగాన్ని పెంచుతారన్నది స్పష్టంగానే కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి, తెచ్చుకున్న అధికార బాధ్యతలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారు. అంతకుమించి, రాజకీయ భవిష్యత్తులో ప్రజల ఆదరాభిమానాలను సంపాదించడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తారనే భావన ఇప్పటికే కలిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక, ఈ ఐదేళ్లూ ఇంకెంత సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు నిర్వహిస్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News