Big Stories

CM Chandrababu Naidu Weekly Diary: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే చంద్రబాబు

- Advertisement -

16/ 6/24
అధికారంలోకి రాగానే చంద్రబాబు తనదైన మార్క్ పాలన మొదలు పెట్టారు. గత ప్రభుత్వంలా కక్ష సాధింపులకు పాల్పడొద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. మంత్రులు, ఎమ్మెల్యేల, పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తానన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయవద్దన్నారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దని పార్టీ నేతలకు సూచించారు. అహంకారానికి దూరంగా బాధ్యతతో, చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పని చేద్దామని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు.

- Advertisement -

17/ 6/24

సోమవారాన్ని ఆపరేషన్ పోలవరంగా చంద్రబాబు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులోని అనేక ప్రాంతాలకు వెళ్లి, పలు విభాగాలను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా చూశారయన. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ చూస్తే పోలవరం చూసిన తర్వాత ఆయన ఎంత ఆవేదనకు గురైయ్యారో అర్థం అవుతోంది. వైసీపీ హయంలో పోలవరం నిర్మాణంలో పెద్దగా పురోగతని కనిపించలేదు. అంతేకాదు.. 2014 తర్వాత టీడీపీ హయంలో నిర్మించిన డయాఫ్రం వాల్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరం విషయంలో మాజీ సీఎం జగన్ క్షమించరాని తప్పులు చేశారని అన్నారు. గత ప్రభుత్వం.. పనులు కొనసాగించి ఉంటే 2020 నాటికి పూర్తి అయ్యేదని చెప్పారు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నాలుగేళ్లు టైం పడుతుందని సీఎం చంద్రబాబు అంచనా.

18/6/24
సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు, మిగిలిన నాలుగు బ్లాకుల్లో మంత్రులకు కార్యాలయాలను కేటాయింపు జరిగింది. జనసేన పార్టీ మంత్రులు పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌ ఛాంబర్లు రెండో బ్లాక్‌లో ఉన్నాయి. ఇదే బ్లాక్‌లో మంత్రులు పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు కూడా ఛాంబర్లు కేటాయించారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సీఎం ఛాంబర్‌కి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్‌తో జనసేన మంత్రులు కూడా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి కొత్త అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం నియమితులయ్యారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆయనే ఏజీగా ఉన్నారు. అయితే, 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయన్ని తొలగించింది. అయితే, ఇప్పుడు కొత్త ప్రభుత్వ కొలువు దీరడంతో సీఎం చంద్రబాబు మళ్లీ దమ్మాలపాటినే ఎంపిక చేశారు.

విదేశీ విద్య స్కీం విషయంలో సీఎం కీలక మార్పులు చేశారు. గతంలో అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్య స్కీంని వైసీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చింది. ఆ పేరును మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యగా చంద్రబాబు మార్చారు. అంతేకాదు.. 2019 ముందు పథకాల పేర్లు ఎలా అయితే ఉండేవో.. వాటినే అలాగే కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు.

Also Read: జగన్ కు ఊరికొక్క ప్యాలెస్‌.. మొత్తం ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

19/ 6/24

రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్‌ తదితరులను పక్కన పెట్టారు. సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను నియమించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర్ కి బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకి, జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ ను నియమించింది చంద్రబాబు ప్రభుత్వం.

20/ 6/24
నాలుగో సారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు అమరావతిలో గురువారం పర్యటించారు. జగన్ సర్కార్ కూల్చేసిన ప్రజావేదిక నుంచే సీఎం రాజధాని టూర్‌ మొదలైంది. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించి అక్కడి నుంచి ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత ఐకానిక్‌ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయో అధికారలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

ఆ తర్వాత ఆయన మాట్లాడిన తీరును చూస్తే అమరావతి నిర్మాణంపై ఆయన ఎన్ని కలలు కన్నారో అర్థం అవుతుంది. గత ప్రభుత్వ అమరావతిని స్మశానంలా మార్చిందని విమర్శించారాయన. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలను నుంచి తీసుకొచ్చిన మట్టితో రాజధాని శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఆ సంకల్పబలమే అమరావతిని కాపాడిందని చంద్రబాబు అభిప్రాయం. ఏ అంటే అమరావతి అని.. పీ అంటే పోలవరమని చంద్రబాబు ఏపీకి కొత్త నిర్వచనం చెప్పారు. ఈ రెండు నిర్మాణాలు పూర్తి అయితే ఏపీ దశ, దిశ మార్చొచ్చని సీఎం ఆలోచన.

21/ 6/24
రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఆయన భార్యపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి అధికారపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎంగానే సభలో అడుగుపెడతానని టీడీపీ అధినేత శపథం చేసి సభను వాకౌట్ చేశారు. చెప్పినట్టుగానే సీఎంగానే సభకు వచ్చి పంతం నెగ్గించుకున్నారు. చంద్రబాబుతోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మొదలైంది.

సభలో అడుగుపెట్టిన మొదటి రోజే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతోనే వైసీపీ అధినేత జగన్ కారుకు అసెంబ్లీ గేటు దగ్గర డైరెక్ట్ ఎంట్రీ దొరికింది. మామూలుగా అయితే.. ఓ ఎమ్మెల్యేగా జగన్ గేటు దగ్గర దిగి నడుచుకుంటూ రావాల్సి ఉంది. ఒకరిని కించపరచడానికి అసెంబ్లీ వేదిక కాకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అసెంబ్లీలో అడుగు పెట్టిన తొలిరోజే చంద్రబాబు సవాల్ ఎదురైంది. చీరాలలో సుచిరిత అనే యువతిపై అత్యాయత్నం చేసి హత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. దీన్ని సవాల్ గా తీసుకున్న సీఎం.. ఘటనా స్థలానికి వెళ్లాలని హోమంత్రి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షడమే కాకుండా.. దీనికి కారణమైన గంజాయి మూలాలను అంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. యాక్షన్ ప్లాన్ మామూలుగా లేదుగా

22/6/2024
శనివారం అసెంబ్లీ రెండో రోజున స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయ్యన్నను సీఎం చంద్రబాబు, పవన్ సభాధ్యక్షుని స్థానంలో కూర్చోబెట్టారు. నీతి, నిజాయితీగా అయ్యన్న రాజకీయాలు చేశారంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏంతో కృషి చేశారన్నారాయన. గత ప్రభుత్వం కేసులతో వేధించినా రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. 66 ఏళ్లు దాటినా.. అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండేనని అనడంతో సభ ఒక్కసారిగా నవ్వులమయమైంది.

గత ప్రభుత్వం అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసిందని చంద్రబాబు విమర్శించారు. తన భార్యను కూడా ఇష్టానుసారంగా కించపరిచిన విషయాన్ని, ఆ రోజు ఆయన చేసిన శపథాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలుగు ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నది చంద్రబాబు అభిప్రాయం. 9 సార్లు తను ప్రజలు అసెంబ్లీకి పంపించారన్న ఆయన తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. మరో జన్మంటూ ఉంటే తెలుగోడిగానే పుడుతానన్నారు.

అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారాయన. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు చెప్పారని.. కానీ.. తన పార్టీ నుంచి పోటీ చేసినవారందరినీ అసెంబ్లీలో అడుగు పెట్టించిన దమ్మున్న నేత పవన్ అని కొనియాడారు. పవన్ కు ఎక్కడ తగ్గాలో ఎక్కడ గెలవాలో బాగా తెలుసని.. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 15వ శాసనసభను కౌరవసభగా అభివర్ణించిన చంద్రబాబు.. 16వ సభను గౌరవ సభగా మార్చాలని మిగిలిన సభ్యులకు చెప్పారు.

ప్రతీ శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలను, ప్రజలను కలిసేందుకు సమయం కేటాయిస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే.. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో సమస్యలు చెప్పుకొవడానికి, ఆయనకు ధన్యవాదాలు తెలపడానికి వందలమంది సమాన్య ప్రజలు వెళ్లారు. సీఎం వారి సమస్యలను ఓపికగా విని వారి దగ్గర వినతులు స్వీకరించారు. కొంతమంది దివ్యాంగులు ఆర్థిక సాయం కోరగా.. దానిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీనేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా దగ్గుమల్ల ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్‌లను ఎంపిక చేశారు. సీఎం అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూల వైఖరి తీసుకున్నారనే అభిప్రాయంతో విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు పోస్టింగులు ఇవ్వలేదు. ఆయా జిల్లా కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాలరెడ్డిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ టైంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్‌లకు కలెక్టర్‌లుగా పోస్టింగులిచ్చింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలనే నియమించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News